కడుపు పల్లకిలో మోసే బోయీ అమ్మ

దేవుడు కఠినుడా, కరుణామయుడా? ఆయనలో ఉన్నది కరుణా, కాఠిన్యమా? రెండూ అంటే ఆశ్చర్యపోవడం మన వంతవుతుంది. ఇంత లోపాయికారీతనంగా రెంటినీ ఒకే మూసలో పోసి, తానుగా వెలసిన భగవంతుణ్ని ప్రశంసించడం ఎవరి తరం? ఈ చమత్కారం ఆయన తన విషయంలోనే కాదు. ఈ సృష్టిలో కూడా పాదుగొలిపాడు.

Updated : 05 Feb 2023 03:47 IST

దేవుడు కఠినుడా, కరుణామయుడా? ఆయనలో ఉన్నది కరుణా, కాఠిన్యమా? రెండూ అంటే ఆశ్చర్యపోవడం మన వంతవుతుంది. ఇంత లోపాయికారీతనంగా రెంటినీ ఒకే మూసలో పోసి, తానుగా వెలసిన భగవంతుణ్ని ప్రశంసించడం ఎవరి తరం? ఈ చమత్కారం ఆయన తన విషయంలోనే కాదు. ఈ సృష్టిలో కూడా పాదుగొలిపాడు. స్త్రీ మూర్తిని తీసుకుంటే నవ మాసాలు శిశువును మోసి కనే అత్యంత క్లిష్టమైన, ప్రాణాంతకమైన ప్రక్రియను ఒక వైపు ఆమెకు ఇస్తూనే- బిడ్డ పెంపకమనే ఒక జీవితకాల అపురూప అనుభూతిని, అద్భుత నిత్య సంతోషాన్ని ఇచ్చాడు దేవుడు. అంటే ఒక ఒరలో రెండు కత్తులు పెట్టిన తమాషా చూసే కొంటెవాడు. ఈ ఆటను పక్కన పెడితే నిజానికి ఆ స్త్రీమూర్తి ఏమైపోవాలి? శరీరాన్ని దాదాపు ఛిద్రం చేసే ఆ ప్రక్రియతో మరణించాలా? ఓవైపు మరణిస్తూనే మరోవైపు ఇంకో జీవికి తాను ప్రాణం పోస్తూ అమ్మనవుతున్న ఆనందాన్ని పొందాలా?

శిరీష కోమలమైన స్త్రీ సౌందర్యాన్ని, ఆమె అపురూపంగా భావించుకునే శరీర సౌష్ఠవాన్ని గర్భం పేరిట శాశ్వత సమాధి చేయడం ఆయన కరుణా? ఆయనంతే. ఒక ఒరలో రెండు కత్తుల తంతే. అయినా సరే. ఆయన కరుణామయుడే. కాటు వేసి విషాన్నిచ్చే సర్పానికి అదే విషంతో ప్రాణం పోసే ఔషధాన్ని అందివ్వడం ఆయన కరుణకు పరాకాష్ఠ. ఇలాంటి సరదాలన్నీ అమ్మ దగ్గర మరింత తీర్చుకున్నాడు ఆ పరమాత్మ. ఏది ఏమైనా- సహించే సహనమే అమ్మ. భరించే బాధే అమ్మ.

అమ్మను కడుపులోంచి తన్నడం తప్ప మరో ఆట రాని బిడ్డను ఎప్పటికప్పుడు గెలిపించడమే అమ్మతనం. తల్లికి తన చివరి ఊపిరి వరకు గుర్తుండిపోయే బిడ్డ తాలూకు స్పర్శ... గర్భస్థ శిశువుగా తన కడుపులో తన్నిన బిడ్డ పూల పాదాల తాకిడే. అది కేవలం బిడ్డ ఆనందమే కాదు. అది తల్లికి మరింత ఆనందానుభూతి నుంచి ఇచ్చే తాకిడి కూడా. అది ఇరువురూ కలిసి పొందే మధురాతి మధురమైన స్పర్శాసుఖం. మనసుల వరకూ పాకివెళ్ళే తీయని విద్యుత్‌ ప్రవాహం. మనసు పొందే అనిర్వచనీయమైన అనుభూతి. దీన్ని ప్రపంచంలో ఏ స్పర్శతోనూ ఏ సుఖంతోనూ పోల్చలేం. అంత అపురూపమైన అనుభూతి కాబట్టే అది తల్లీబిడ్డల అనుబంధాన్ని చివరివరకు మరోదానితో పోల్చలేని అపురూప బంధంగా నిలుపుతుందేమో!

అరచేతిలో చిన్న రేగు పండును కూడా తదేకంగా ఎక్కువ సేపు మోయలేం. అలాంటిది దాదాపు మూడు కిలోల బరువు... తొమ్మిది నెలలు! శిశువును మోసే తల్లికి కూడా తెలీకుండా దూదిపింజెలా కడుపులో పడేసి క్రమేపీ బరువును పెంచే ఆ దేవుడి కార్య నిర్వహణా నైపుణ్యాన్ని ఏమని పొగడాలి? నెత్తిన పెట్టుకొని మోసినట్లు ఒకేసారి కడుపుతో అంత బరువును మోయలేని ఆ అమ్మ ఇబ్బందిని అంత సానుభూతితో పరిష్కరించిన ఆ దేవుడి దయార్ద్ర హృదయాన్ని అణు వంతయినా అర్థం చేసుకోగలమా!

అమ్మ, ఆ దేవుడు... బిడ్డను సృష్టించడంలో పోటీ పడి పన్నిన ప్రణాళికల్లో అమ్మ గెలిచిందా? అవును... అమ్మ గెలవాలి. అమ్మే గెలవాలి.   

కడుపు మీద శాశ్వతంగా నిలిచిపోయిన అందవికారమైన గీతలను సుతారంగా నిమురుకుంటూ ఈ కడుపు, ఈ గీతలు లేకపోతే తనకు ఈ బంగారు బిడ్డ ఎక్కడిది... గీతలైనా వాతలైనా... అవి కూడా తనకు అపురూపమే అనుకుంటుంది అమ్మ!

చక్కిలం విజయలక్ష్మి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు