ఉప పురాణాలు-పురాణాలు

పురాణాల సంఖ్య పద్దెనిమిది. వాటి పేర్లను సులభంగా జ్ఞాపకం పెట్టుకునేందుకు వీలుగా చెప్పిన ఒక శ్లోక భావం ప్రకారం... మ కారంతో మత్స్య, మార్కండేయ పురాణాలు. భ కారంతో భాగవత, భవిష్యత్‌ పురాణాలు. (రెండేసి) ‘బ్ర’కారంతో... బ్రహ్మ, బ్రహ్మవైవర్త, బ్రహ్మాండ అనేేే మూడు పురాణాలు.

Published : 08 Feb 2023 00:40 IST

పురాణాల సంఖ్య పద్దెనిమిది. వాటి పేర్లను సులభంగా జ్ఞాపకం పెట్టుకునేందుకు వీలుగా చెప్పిన ఒక శ్లోక భావం ప్రకారం... మ కారంతో మత్స్య, మార్కండేయ పురాణాలు. భ కారంతో భాగవత, భవిష్యత్‌ పురాణాలు. (రెండేసి) ‘బ్ర’కారంతో... బ్రహ్మ, బ్రహ్మవైవర్త, బ్రహ్మాండ అనేేే మూడు పురాణాలు. వ అనే అక్షరంతో వాయు, వరాహ, వామన, విష్ణు అనే నాలుగు పురాణాలు. అగ్ని, నారద, పద్మ, లింగ, గరుడ, కూర్మ, స్కాంద పురాణాలు- ఒక్కొక్కటి. మొత్తం పద్దెనిమిది.
కాశీక్షేత్ర ప్రాశస్త్యం, యయాతి, కార్తికేయుడు వంటి రాజుల గొప్పదనాన్ని మత్స్యపురాణం తెలియజేస్తుంది. శివకేశవులు, ఇంద్ర, అగ్ని, సూర్య, దేవీ మాహాత్మ్యాలను మార్కండేయ పురాణం వెల్లడిస్తుంది. విష్ణువు అవతారాలు, శ్రీకృష్ణ జననం, లీలల గురించి భాగవత పురాణం సమగ్రంగా చాటుతోంది. భవిష్యపురాణంలో అగ్ని, సూర్యోపాసన విధులతో పాటు, భవిష్యత్తులో జరగబోయే వివిధ విషయాల గురించిన వివరణలు ఉన్నాయి. బ్రహ్మ పురాణంలో వర్ణధర్మాలు, స్వర్గ నరకాల గురించిన వివరణ లున్నాయి. బ్రహ్మ వైవర్తపురాణం భోజననియమాలు, రోగనివృత్తి సాధన, గోలోక ప్రశంస, తులసీ/సాలగ్రామ మాహాత్మ్యాలను తెలుపుతుంది.

రాధాకృష్ణులు, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు, లలితాదేవి గొప్పతనం, ఖగోళ విజ్ఞానం గురించి బ్రహ్మాండ పురాణం తెలియజేస్తుంది. ఈశ్వరుడి మాహాత్మ్యం, భూగోళం, సౌరమండల వివరణలు వాయుపురాణంలో ఉన్నాయి. వరాహావతారం దాల్చిన విష్ణువు భూదేవికి తన జన్మవృత్తాంతం, ఉపాసనా విధానం, ధర్మశాస్త్రాలు, వ్రతకల్పాలు, భూమిపై ఉన్న వివిధ రకాల పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలు తెలపడం వరాహపురాణంలో చూడవచ్చు.

వామన పురాణంలో శివపార్వతుల కల్యాణం, గణేశ/కార్తికేయుల జన్మవృత్తాంతాలు, రుతువుల గురించిన వర్ణనలు ఉన్నాయి. విష్ణుపురాణంలో విష్ణుమూర్తి అవతార వర్ణన, ధ్రువ, ప్రహ్లాద, భరతుల చరితామృతం ఉన్నాయి. వ్యాకరణం, ఛందస్సు, వైద్యశాస్త్ర రహస్యాలు, జ్యోతిశ్శాస్త్రం, భూగోళ, ఖగోళ రహస్యాలను తెలిపేది అగ్నిపురాణం. నారద పురాణంలో వేదాంగాల గురించి, పలు పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలు ఉన్నాయి.

మధుకైటభులనే రాక్షస వధ, రావిచెట్టు మహిమ, పద్మగంధి దివ్యగాథ, గంగా మాహాత్మ్యం, గీతాసారం, నిత్యపూజా విధానాల గురించి  పద్మపురాణం విశదీకరిస్తుంది. లింగరూప శివ మహిమలతో పాటు వివిధ వ్రతాలు, ఖగోళ, జ్యోతిష, భూగోళాల గురించిన సమాచారం తెలుపుతుంది లింగపురాణం. గరుడుడి జన్మవృత్తాంతంతో పాటు జనన మరణాలంటే ఏమిటి, మరణానంతరం జీవుడు ఎక్కడికి వెళతాడు; ఏ పాపానికి ఎలాంటి శిక్ష... మొదలైన విషయాలు గరుడ పురాణం సమగ్రంగా తెలుపుతుంది. ఖగోళశాస్త్రం గురించి, వారణాసి, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాల గురించి వర్ణనలను కూర్మపురాణం చెబుతుంది.

కాశీ, కేదార, రేవాఖండాల గురించి, రామేశ్వర క్షేత్ర మహిమ, పూరీ జగన్నాథ ఆలయంతో సహా అనేక పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలు, కుమారస్వామి జననం, మహిమలు, శివలీలలు స్కాంద పురాణంలో ఉన్నాయి. పురాణాల లాగానే ఉపపురాణాలు సైతం పద్దెనిమిది. వాటినీ వేదవ్యాసుడే రాశాడని ప్రసిద్ధి.

అయ్యగారి శ్రీనివాసరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు