ఆలయ మహిమ

ఆలయాలు తల్లివంటివి. ఎన్నో సంస్కారాలు నేర్పుతాయి. పాపభీతి, దైవభక్తి, గురుభక్తి, సమష్టితత్వం, నిస్వార్థసేవ, ధార్మికచింతన, సామాజిక స్పృహ... ఇలా ఎన్నో సద్గుణాలను ప్రోది చేస్తాయి. భారతీయ సంస్కృతికి ఇవి పట్టుగొమ్మలు. మన సనాతన ధర్మాన్ని పెంచి పోషించి, నేటికీ సజీవంగా ఉంచిన మాతృసమానులు.

Updated : 04 Mar 2023 05:32 IST

ఆలయాలు తల్లివంటివి. ఎన్నో సంస్కారాలు నేర్పుతాయి. పాపభీతి, దైవభక్తి, గురుభక్తి, సమష్టితత్వం, నిస్వార్థసేవ, ధార్మికచింతన, సామాజిక స్పృహ... ఇలా ఎన్నో సద్గుణాలను ప్రోది చేస్తాయి. భారతీయ సంస్కృతికి ఇవి పట్టుగొమ్మలు. మన సనాతన ధర్మాన్ని పెంచి పోషించి, నేటికీ సజీవంగా ఉంచిన మాతృసమానులు. ప్రపంచంలో అనేక ప్రాంతాల ప్రజలు అనాగరికులుగా ఉండే అతి ప్రాచీనకాలంలోనే, మనదేశంలో ఆలయాలు వెలశాయి.
దేవాలయాల విశిష్టత ఏమిటి, వాటిని నిర్మించమని శాస్త్రాలు పదేపదే ఎందుకు చెబుతున్నాయి అనేది ప్రశ్న. ప్రపంచంలో ఏ దేశానికీ లభించని గొప్ప వరం మనకు లభించింది. అదే ఆలయ విజ్ఞానం. అలయాలు కేవలం ప్రార్థనామందిరాలే కావు, దైవశక్తి కేంద్రీకృతమైన చైతన్య స్థానాలు. సూర్యకాంతి నుంచి విద్యుచ్ఛక్తిని పొందేందుకు, ఆ శాస్త్రజ్ఞానంతో రూపొందిన సాంకేతిక పరికరం ఉండాలి. అలాగే బ్రహ్మాండమంతా వ్యాపించిన మహాశక్తి ఒక దివ్యరూపంలో దర్శనమివ్వాలంటే, ఆగమశాస్త్ర జ్ఞానంతో ప్రతిష్ఠించిన విగ్రహమనే ఉపకరణం ఉండాలి. మనిషికి మాతృగర్భంలా, భువిలో దేవ తలకు ఆలయగర్భం జన్మస్థానం. ప్రాణమనే పురుషుడు పంచ భూతా త్మకమైన ప్రకృతి ఏకత్వాన్ని పొందడమే సృష్టి. ఉదాహరణకు ప్రాణం(రేతస్సు) స్త్రీ గర్భాన్ని చేరి, దేహం రూపొం దేందుకు కావలసిన మట్టి, నీరు, వేడి, గాలి, ఆకాశాలను తల్లినుంచి పొందు తుంది. ఈ సృష్టి సూత్రమే ఆలయ విజ్ఞానానికి ఆధారం. పంచభూత తత్వాలను ప్రాణాన్ని సశాస్త్రీయంగా విగ్రహంలో ప్రతిష్ఠిస్తే, ఆ మహా ప్రాణశక్తే విగ్రహాకృతిని పొందుతుంది. గుడిలో దైవంగా దర్శనమిస్తుంది. ఇది శాస్త్రవచనం. అందుకే ప్రతిష్ఠలో ముందుగా పంచభూత తత్వాలను విగ్రహంలో నిక్షిప్తం చేస్తారు. దీనికై జల క్షీర పుష్ప ధాన్య శయ్యాధివాసాలు నిర్వహిస్తారు. అధివాసాలంటే నిర్దేశించిన ద్రవాలలో విగ్రహాన్ని ముంచి ఉంచడం. శయ్యాధివాసంలో మాత్రం మూర్తిని పట్టుపానుపుపై శయనింపజేసి, నిద్రాకలశాన్ని ఉంచుతారు. ఇది విగ్రహంలో సర్వాంగాలను చైతన్యం చేస్తుందని విశ్వాసం. తరవాత విగ్రహాన్ని గర్భగుడిలో స్థాపించి, ప్రాణప్రతిష్ఠ చేస్తారు.

ప్రతిష్ఠలో ఆగమశాస్త్ర నియమాలు తప్పక పాటించాలి. విగ్రహానికి ఏ చిన్న దోషం ఉండకూడదు. చీమలువంటి సూక్ష్మపాణులు దీనికింద మరణించినా దోషమే. దోషనివారణకు విగ్రహాన్ని పవిత్ర నదీజలాలతోను, పంచపల్లవ కషాయాలతోను... ఇలా విశేషమైన అనేక ద్రవ్యాలతో శుద్ధిచేసి, ప్రతిష్ఠావిధిని ప్రారంభించాలి. విశేషంగా హోమాలు చేసి సంపాదాజ్యాన్ని (ఆహుతులనిచ్చేటప్పుడు గరిటలో మిగిలిన నేతి బిందువులు) విగ్రహానికి లేపనం చేయాలి. ఇది మహిమను ప్రసాదిస్తుంది. స్వామిని నిలిపేచోటులో నవరత్నాలు, ఓషధులు, బంగారం, పాదరసం... వంటివి నిక్షిప్తం చేయాలి. శక్తిమంతమైన యంత్రాన్నీ ఉంచాలి. ఇది స్థలమహత్యాన్నిస్తుంది. స్వామి నేత్రాలను బంగారు శలాక(సూది)తో చెక్కాలి. ఆ నేత్రాలు ద్వారంలోని శుభస్థానాన్ని వీక్షించేలా విగ్రహాన్ని స్థాపించాలి.
ఆలయాలను నిర్మించడానికి అంగబలం, అర్థబలం, మనోబలం, శాస్త్రబలం, అనుష్ఠానబలం కావాలి. జనసమీకరణ వస్తుసేకరణపై శ్రద్ధ వహించాలి. అందరూ కలిసి సమైక్యంగా సామరస్య భావంతో నిర్వహించే బృహత్‌ కార్యమిది. పదిమందికీ మంచి చేయాలనే భావన, ఐకమత్యంతో మెలగాలనే దృక్పథం... వీటిని ఆలయాలు మనకు చెప్పకనే చెబుతాయి. వ్యక్తిని సంఘటిత శక్తిగా తీర్చిదిద్దుతాయి.

పిల్లలమర్రి చిన వెంకట సత్యనారాయణ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు