సత్యవ్రతం

సకల ధర్మాలకూ సత్యమే మూలం. వేయి అశ్వమేధయాగాలను, ఒక సత్యాన్ని త్రాసులో వేసి తూస్తే సత్యం వైపే ముల్లు చూపుతుందని మహాభారతంలో నన్నయ మాట.

Published : 06 Mar 2023 01:02 IST

కల ధర్మాలకూ సత్యమే మూలం. వేయి అశ్వమేధయాగాలను, ఒక సత్యాన్ని త్రాసులో వేసి తూస్తే సత్యం వైపే ముల్లు చూపుతుందని మహాభారతంలో నన్నయ మాట. సకల తీర్థాటనం, సర్వవేదాల అధ్యయనం సత్యంతో సమానం కావని ధర్మజ్ఞులైన మునులు చెప్పారు.

సత్యం అంటే కేవలం నిజం చెప్పడమే కాదు. ప్రపంచంలోని పరమార్థాన్ని గ్రహించడమూ సత్యమే. వేదాలు, వేదాంతాలు, పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు సత్యాన్ని గురించే చెప్పాయి. ‘సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యమేవజయతే’ వంటి సూక్తులతో నిండిన వేదవాఙ్మయం ఏ పరమ సత్యాన్ని ప్రతిపాదించిందో పరిశీలించి ఆచరించడమే సత్యవ్రతం. ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే సత్యమే శాశ్వతమైన సుఖ సంతోషాలను చేకూర్చగలుగుతుంది. మనసులోని ఆలోచనలు మాటల్లో వినిపించకపోవచ్చు. ఆచరణలోకి రాకపోవచ్చు. అంతరంగంలో నిత్యం సత్యదీప్తితో వెలుగొందే పరమాత్మే సత్యనారాయణ స్వామి. నిర్మలమైన మనసుతో సత్యదేవుణ్ని ప్రతిష్ఠించుకోవడమే సత్యనారాయణ వ్రతం.

ఎన్ని వ్రతాలున్నా తెలుగువారికి సత్య వ్రతమంటే సత్యనారాయణ వ్రతమే. ఉత్తర భారతదేశంలో సత్యనారాయణ కథ చాలా ముఖ్యమైనది. సత్యనారాయణ తత్వాన్ని అవగాహన చేసుకోవడమే ఈ వ్రతం. బాహ్యప్రపంచంలో సూర్యనారాయణుడు ప్రత్యక్ష దైవమైతే, మనోవీధిలో సత్యనారాయణుడు ప్రకాశిస్తుంటాడు. వాక్కులో నివసిస్తుంటాడు.

సత్యనారాయణ వ్రతానికి మూలాధారమైన కథావస్తువు స్కందపురాణంలో ఉంది. ఈ పురాణంలోని రేవా ఖండంలో అయిదు అధ్యాయాల్లో ఈ వ్రతకథ ఉంది. ప్రతి అధ్యాయం ముగియగానే స్వామికి పూజచేసి ఖండ నారికేళం నైవేద్యంగా పెట్టడం పరిపాటి. గోధుమపిండితో చేసిన ప్రత్యేక వంటకాన్ని అయిదు భాగాలు చేసి నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరించడం తెలిసిందే.

ఈ కథలోనూ సత్యం అయిదు రూపాల్లో కనిపిస్తుంది. అంటే, కనిపించే ప్రపంచంలో సత్యస్వరూపుడైన పరమాత్మ సర్వాంతర్యామిగా ఉన్నాడని త్రికరణశుద్ధిగా నమ్మి ఆ సత్యదేవుని ఆరాధించడం ఈ వ్రతం ఆంతర్యం. స్త్రీ-పురుష, ధనిక-పేద మొదలైన భేదాలు విస్మరించి నారాయణ స్వరూపాన్ని ఆరాధిస్తూ ఈ వ్రతం ఆచరిస్తారు. నారద-నారాయణ సంభాషణ ఫలితమే ఈ వ్రతం. మొదటి అధ్యాయంలో వ్రత విధానం ప్రధాన విషయం. రెండో అధ్యాయం ఎవరైనా చిత్తశుద్ధితో స్వామిని సేవిస్తే అనుగ్రహం లభిస్తుందని చెబుతుంది. మూడు, నాలుగు అధ్యాయాల్లోని వర్తకుడి కథలో వ్రతం చేయడంలో అశ్రద్ధ, నిష్ఠగా ఆచరించకపోవడం వల్ల స్వామి ఆగ్రహానికి గురికావడం విషయం. అయిదో అధ్యాయం పామరులు చేసిన వ్రతాన్ని చిన్నచూపు చూసిన రాజు నాశనం కావడం చెబుతూ సత్యం అందరికీ సమానమన్న సందేశాన్నిస్తుంది. వ్రత కథను సావధానంగా వినాలని నియమం. శుభకార్యాల్లోను, శుభారంభ సమయాల్లోను, మనశ్శాంతి లోపించిన పరిస్థితుల్లోనూ సత్యనారాయణ వ్రతం ఆచరించడం సంప్రదాయంగా వస్తోంది.

 డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని