నకిలీ వార్తలతో జాగ్రత్త!

నిజం నిలకడ మీద తెలుస్తుంది. కానీ, అంతలోగా అబద్ధం సమస్త లోకాన్నీ చుట్టేసి వస్తుంది. ప్రజాసమూహాల నడుమ విద్వేషాలకు అంటుకడుతుంది. కొన్ని సందర్భాల్లో అది దారుణ హింసోన్మాదాన్నీ ప్రేరేపిస్తుంది. కొన్నేళ్ల క్రితం ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో చెలరేగిన అల్లర్లకు అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైన ఒక నకిలీ వార్తే పుణ్యం కట్టుకుంది.

Published : 07 Mar 2023 01:04 IST

నిజం నిలకడ మీద తెలుస్తుంది. కానీ, అంతలోగా అబద్ధం సమస్త లోకాన్నీ చుట్టేసి వస్తుంది. ప్రజాసమూహాల నడుమ విద్వేషాలకు అంటుకడుతుంది. కొన్ని సందర్భాల్లో అది దారుణ హింసోన్మాదాన్నీ ప్రేరేపిస్తుంది. కొన్నేళ్ల క్రితం ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో చెలరేగిన అల్లర్లకు అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైన ఒక నకిలీ వార్తే పుణ్యం కట్టుకుంది. తాజాగా తమిళనాడులో వలస కార్మికులపై దాడులు జరుగుతున్నాయంటూ బూటకపు కథనాలు, వీడియోలు విరివిగా వ్యాప్తిలోకి వచ్చాయి. బిహార్‌ తదితర ఉత్తరాది రాష్ట్రాల్లో అవి తీవ్ర కలకలం సృష్టించాయి. వెనువెంటనే ప్రతిస్పందించిన తమిళనాడు ప్రభుత్వం- క్షేత్రస్థాయిలో నిజనిర్ధారణ ద్వారా అదంతా తప్పుడు ప్రచారమేనని ప్రకటించింది. జీవనోపాధి కోసం ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చిన వారందరి భద్రతకు పూర్తిస్థాయిలో హామీ ఇస్తూ, అసత్య సమాచారాన్ని ప్రచారంలోకి తెచ్చినవాళ్లను వేగంగా గుర్తించి కేసులు నమోదు చేసింది. వలస కార్మికులపై దాడులంటూ వెలువడిన వీడియో క్లిప్పింగులు నకిలీవని తమిళనాడులో పర్యటించిన బిహార్‌ అధికారుల బృందమూ కొట్టిపారేయడంతో ఆందోళనలు కొద్దిమేరకు ఉపశమించాయి. ప్రధాని మోదీ ఇటీవల హెచ్చరించినట్లు- జాతీయస్థాయిలో పెనుఉద్రిక్తతలకు కారణభూతమయ్యే విధ్వంసక సామర్థ్యం నకిలీ వార్తల సొంతం. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో చలామణీ అయ్యే సమాచారాన్ని విశ్వసించే ముందు, మరొకరికి ఫార్వర్డ్‌ చేసే మునుపు ఒకటికి పదిసార్లు తరచి చూసుకోవాలన్నది వాస్తవం. కానీ, సోషల్‌ మీడియాలో కనిపించేవన్నీ నిజాలేనని నమ్మేవారికి  కొదవలేని ఇండియాలో వదంతుల వ్యాప్తి పోనుపోను మంచినీళ్ల ప్రాయమవుతోంది!

దాదాపు 75కోట్ల స్మార్ట్‌ఫోన్లు, 80కోట్ల అంతర్జాల వినియోగదారులు కలిగిన భారతదేశంలో- వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ వంటి మాధ్యమాలు ప్రజాభిప్రాయాలను ప్రభావితం చేసే శక్తులుగా అవతరించాయి. విద్వేష వ్యాఖ్యలు, ఆన్‌లైన్‌ వేధింపులకు ప్రధాన సాధనాలుగానూ అవి ఎప్పటినుంచో పరువు మాస్తున్నాయి. వాటికి తోడు ప్రముఖ మీడియా సంస్థల లోగోలు, చిత్రాలను దుర్వినియోగం చేస్తూ అసలైన వార్తల రూపంలోనే నకిలీ కథనాలకు పురుడుపోసి, జనంలోకి వదిలే ముఠాలూ నెట్టింట్లో తిష్ఠవేశాయి. సంకుచిత స్వప్రయోజనాల కోసం అసత్యాలు, అర్ధసత్యాలను కలబోసి ఆయా అజ్ఞాత బృందాలు వండివార్చే వదంతుల తీవ్రత ఇండియాలోనే అత్యధికమని అంతర్జాతీయ అధ్యయనాలు గతంలోనే నిగ్గుతేల్చాయి. వ్యవస్థీకృతంగా పనిచేస్తున్న అరాచక మూకలతో ఎన్నికల సమయంలోనైతే అటువంటి  బూటకపు కథనాల వ్యాప్తి విశృంఖలమవుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది. ‘ఒక్క నిమిషం యూట్యూబ్‌ చూస్తే ఎన్నో నకిలీ వార్తలు కనిపిస్తాయి... ఎవరైనా అందులో ఒక ఛానెల్‌ను ప్రారంభించుకునే అవకాశం ఉంది... వెబ్‌పోర్టళ్లపై ఎవరి నియంత్రణా లేదు’ అని సాక్షాత్తు సర్వోన్నత న్యాయస్థానమే గతంలో ఆందోళన వ్యక్తంచేసింది. పుక్కిటి పురాణాల కార్ఖానాలుగా వర్ధిల్లుతున్న యూట్యూబ్‌ ఛానెళ్లపై కేంద్రం అడపాదడపా చర్యలు తీసుకుంటోంది. కానీ, జనవర్గాల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టడానికి ఉద్దేశపూర్వకంగా వదంతులు, అసత్య వార్తలను సృష్టిస్తున్న ప్రతీప శక్తులను ఎప్పటికప్పుడు జల్లెడపట్టే సరైన వ్యవస్థలే దేశీయంగా కొరవడ్డాయి. అదే సమయంలో అసమ్మతి స్వరాలను అణచివేయడానికే ఎక్కువగా సామాజిక మాధ్యమాలపై సర్కారీ వర్గాలు నిఘా వేస్తున్నాయనే విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. మతసామరస్యం వంటివాటిని దెబ్బతీస్తూ మూకదాడులకు కారణభూతమవుతున్న నకిలీవార్తల సృష్టికర్తలపై ఉక్కుపాదం మోపడం అత్యావశ్యకం. ఆ క్రమంలో ప్రజాస్వామ్యానికి ప్రాణాధారమైన ప్రజల భావప్రకటనా స్వేచ్ఛను పరిరక్షించడమూ అత్యంత కీలకమే. సున్నితమైన ఆ సమతౌల్యాన్ని సాధించడం ప్రభుత్వాల విధివిహిత కర్తవ్యం. అందులో అవి విజయవంతమైతేనే- దేశీయంగా అంతర్జాలం సురక్షితమవుతుంది!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు