రంగుల సంబరం

ప్రకృతి రసాకృతి దాల్చి, హరితార్ణవంగా శోభిల్లే తరుణంలో, ఆ ప్రకృతికి సౌందర్యభరితంగా స్వాగతం పలికే రంగుల సంబరం- హోలీ! వసంత పంచమికి ప్రకృతిలో వసంతరుతువు లక్షణాలు అంకురిస్తే, ఫాల్గుణ పూర్ణిమ నాటికి వసంతశోభ పరిపూర్ణమవుతుంది.

Updated : 07 Mar 2023 08:39 IST

ప్రకృతి రసాకృతి దాల్చి, హరితార్ణవంగా శోభిల్లే తరుణంలో, ఆ ప్రకృతికి సౌందర్యభరితంగా స్వాగతం పలికే రంగుల సంబరం- హోలీ! వసంత పంచమికి ప్రకృతిలో వసంతరుతువు లక్షణాలు అంకురిస్తే, ఫాల్గుణ పూర్ణిమ నాటికి వసంతశోభ పరిపూర్ణమవుతుంది. ఆసేతు హిమాచలం రంగుల కేళి హోలీని ఆహ్లాదభరితమైన వేడుకగా జరుపుకొంటారు. అందుకే విశ్వకవి రవీంద్రనాథ ఠాగూర్‌ హోలీని ‘జనపర్వం’గా అభివర్ణించారు.

ధర్మరాజుకు నారదుడు హోలీ విధి విధానాల్ని వివరించిన వైనాన్ని భవిష్య పురాణం ప్రస్తావించింది. శివపార్వతుల్ని ఏకీకృతం చేసే ప్రయత్నంలో మన్మథుడు శివాగ్రహానికి గురై భస్మమవుతాడు. మదనుడి భార్య రతిదేవి ప్రార్థన మేరకు ఆమెకు మాత్రమే సశరీరంతో గోచరమై మిగిలినవారికి అనంగుడిగా అంటే అదృశ్యరూపంలో ఉంటాడని ఈశ్వరుడు వరమిచ్చాడంటారు. ఆ సందర్భమే అనంగ పౌర్ణమి. అగ్ని సైతం దహించలేని మహాశక్తిమంతురాలైన హోలిక, హిరణ్యకశిపుడి సోదరి. తన పుత్రుడు ప్రహ్లాదుణ్ని ఆమె ఒడిలో కూర్చోబెట్టుకుని అగ్నిప్రవేశం చేయమని హిరణ్యకశిపుడు ఆదేశిస్తాడు. శ్రీహరి భక్తుడైన ప్రహ్లాదుడి  స్పర్శవల్ల హోలిక శక్తి సన్నగిల్లి, ఆమె అగ్నికి ఆహుతైంది. ప్రహ్లాదుడు క్షేమంగా అగ్ని నుంచి బయటకు వస్తాడు. అలా ప్రహ్లాద విజయం చేకూరిన ఆ రోజే హోలికాపూర్ణిమ! నిండు పున్నమి సిరివెన్నెల వెలుగులో గోపికలు, గోపాలుడిపై వసంతాన్ని చిలకరించే వారని, యము నాతీరాన బృందావనంలో ఊయల లూగుతూ రాసలీల వేడుకలో మధు రోత్సవం వెల్లివిరిసేదని ఫాల్గుణ పౌర్ణమి శోభను భాగవతం వివరిం చింది. అందుకే ఈ పున్నమిని డోలా జాత్రగా, డోలా పూర్ణిమగా ఉత్తర భారతంలో వ్యవహ రిస్తారు.

మదుర మీనాక్షీదేవి శివదీక్షను చేపట్టి సుందరేశ్వర స్వామిని మెప్పించి, ఫాల్గుణ పౌర్ణమినాడే వివాహం చేసుకుందని ‘మీనాక్షి తంత్రసారం’ ప్రకటించింది. అందుకే ఈ పౌర్ణమిని కల్యాణ పౌర్ణమిగా పేర్కొంటారు. హోలీని ‘నవాహ్నేష్టి’గానూ ప్రస్తా విస్తారు. ఫాల్గుణ పూర్ణిమ నాటికి పొలాల్లో ఉన్న ధాన్యం, దినుసుల్ని సేకరించి మోదుగ పుల్లల మంటపై ఆవుపాలతో పాయసాన్ని తయారుచేస్తారు. ఈ పాయసాన్నే ‘హోలి’ అంటారు. ఫాల్గుణ, చైత్రమాసాల సంధికాలంలో ‘హోలి’ని నియమబద్ధంగా పక్షం రోజులపాటు స్వీకరించడంవల్ల ఆరోగ్యసౌభాగ్యం చేకూరుతుందని యోగ చింతామణి సూచించింది.

ఫాల్గుణ శుద్ధ అష్టమి నుంచి పౌర్ణమి వరకు ఉండే ఎనిమిది రోజుల్ని హోలాష్టకం అంటారు. ఈ ఎనిమిది రోజుల్లో అష్టమి నాడు దుర్గాదేవి ఆరాధన ప్రారంభించి, ఫాల్గుణ పౌర్ణమినాడు లలితా త్రిపురసుందరి సహా అష్టవిధ శక్తిమాతల్ని వివిధ పుష్పాలతో పూజించే సంప్రదాయమూ ఉంది. అందుకే ఈ పౌర్ణమిని శక్తిపౌర్ణమిగా చెబుతారు. మామిడి పూత, వేప చిగురు, తేనె, కరక్కాయపొడి కలిపిన పదార్థాన్ని హోలీనాడు స్వీకరించడం వల్ల రాబోయే వేసవి వేడిని తట్టుకోగల శక్తి సమకూరుతుందని ఆయుర్వేదం చెబుతోంది. దీన్నే ‘హోలీ మధుప్రాశనం’గా ప్రస్తావిస్తారు. చందన జలం, వసంతం, సుగంధపొడి, తులసి, బిల్వ, జాజి, వేప, రావి పత్రాల రసం కలిపిన ద్రవాన్ని హోలీనాడు చిలకరించుకుంటే శరీరం కాంతిమంతంగా తేజరిల్లుతుందని వైద్యరత్నాకరం వివరిస్తోంది. ఆధ్యాత్మిక సాధన, ఆరోగ్య సౌభాగ్య భావనలతో జీవితాల్ని వర్ణమయం చేసుకోవాలని హోలీ పండుగ సందేశమిస్తోంది!

 డాక్టర్‌ కావూరి రాజేశ్‌పటేల్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని