సమాజహిత చింతన

జీవితంలోని ఒడుదొడుకులు నిమ్మళించి, బాధ్యతలు ఒక కొలిక్కి వచ్చే చరమాంకంలో మానవులు విధిగా భగవంతుణ్ని ఆశ్రయించాలంటారు.

Published : 09 Mar 2023 01:14 IST

జీవితంలోని ఒడుదొడుకులు నిమ్మళించి, బాధ్యతలు ఒక కొలిక్కి వచ్చే చరమాంకంలో మానవులు విధిగా భగవంతుణ్ని ఆశ్రయించాలంటారు. దేవుడు అంటే రాయి, రప్ప, చెట్టు, పుట్ట అనుకొని భక్తిగా ఏ తులసిదళమో సమర్పిస్తారు. పురాణాలు చదువుతారు. ప్రవచనాలు వింటారు. సత్సంగాలకు వెళతారు. ‘మాధవుణ్ని చేరే మార్గాలను అన్వేషించడానికి, అనుసరించడానికి అవసరమైనంత సమయం కేటాయించవచ్చు కదా’ అని వృద్ధాప్యదశను అంకితం చేయాలనుకుంటారు. నిజానికి భవబంధాలను తెంచుకోలేనివాళ్లు, కోరికలను కట్టడి చేయలేనివారు ఎప్పటికీ ఏ దశలోనూ ఆత్మను అంతరాత్మలో లయం చేయలేరు. మానసిక పరిణతి కలిగినవాళ్లకు ప్రకృతి, పరమేశ్వరుడు... ఒకటే!

చెట్లు, పుట్టలు దాటుకొని దుర్గమ మార్గాల్లో నడచి ఎక్కడో కొండ శిఖరం మీద ఉన్న పరంధాముణ్ని దర్శించు కోవడం కష్టతరం. పసిపిల్లలు, ముసలివాళ్లకు అదెంతో ప్రయాసతో కూడుకొన్న ప్రయాణం. కొండపైకి మెట్లదారి ఏర్పాటు చేస్తే, భక్తులకు భగవంతుడు దగ్గరవుతాడన్న సంకల్పం ఏ మహావ్యక్తికో కలుగుతుంది. అహర్నిశలూ అదే ధ్యాసను మనసులో పూరించుకొని, కార్యసాధనకు పూనుకొని, మహత్కార్యం పూర్తిచేస్తాడు. భక్తుడు ఎక్కే ప్రతి మెట్టు పుణ్యంలోని ఒకవంతు భాగం ఆ మహోన్నతుడికి చెంది తీరుతుంది. అన్నదానంతో క్షుద్బాధను, మంచినీళ్లతో దాహార్తిని తీర్చేవాళ్లు సమాజంలో కోకొల్లలు. వారంతా దైవస్వరూపానికి మానవ నిదర్శనాలు.

ఉచితంగా ఏదైనా ఇస్తున్నారంటే ఎగబడేవాళ్లు ఎక్కువమందే ఉంటారు. అక్కడకు వెళ్ళలేని అర్హులకు, అవసరార్థులకు వాటిని సేకరించి చేరవేసేవారు కొందరే ఉంటారు. సంస్థల్లో కొంతమంది పేరుకు అధికారులే కాని అధికారదర్పం ప్రదర్శించకుండా వ్యక్తిత్వంలో సేవాభావ దృక్పథం తొణికిసలాడుతూ ఉంటారు. కార్యార్థులై వచ్చేవారికి వారిలో జగన్నాథుడు ద్యోతకమవుతాడు. పెద్ద వయసుతో జవసత్వాలు ఉడిగిపోతున్నా తమ అపార అనుభవంతో మాట సహాయం, ఉపకారం చేయడానికి ఉవ్విళ్లూరుతుంటారు అనుభవజ్ఞులు. 

అవయవదానం చేసి మరొకరికి పునర్జన్మనిచ్చేవాళ్లు, మృత్యుశయ్య మీద ఉన్నవాళ్ల ఆఖరికోరిక తీర్చి ఆనందం చేకూర్చేవారు- మనిషి రూపంలోని దేవుళ్లు. బాట పక్కన గుడిసెల్లో నివసించే అభాగ్యులకు దుస్తులు, ఆహారపదార్థాలు అందించేవారు, అనాథలు, వృద్ధుల శరణాలయాలను కనిపెట్టుకొని సహాయసహకారాలు అందించేవారు మనకు తారసపడుతూనే ఉంటారు. తమ తమ రంగాల్లో ఉన్నత శిఖరాలు అధిరోహించి ధనవంతులైన కొంతమంది ఉత్తములు, తమ సంపాదనలోని సింహభాగం దానానికి వెచ్చిస్తున్నారు. దానధర్మాలు చేయడం మాత్రమే కాదు- సంఘం పట్ల బాధ్యత కలిగి తమవంతు మానవసేవ చేస్తున్నవారు మనమధ్య తిరుగాడే భగవదవతారాలు. మహాత్ములవల్ల ఎన్నో జీవితాలు గాడిన పడతాయి. మనసును ప్రశాంతత ఆవరించిన ప్రతి మనసులో పరంజ్యోతి వెలుగులు ప్రసరిస్తాయి. కాలానుగుణంగా పూజకు, భక్తికి, పుణ్యానికి నిర్వచనం మారుతోంది. సమాజహిత చింతన, మానవసేవ అగ్రతాంబూలం పొందుతున్నాయి. మానవుడు, మాధవుడు ఒక్కటేనన్న భావం శోభిల్లుతోంది.

 ప్రతాప వెంకట సుబ్బారాయుడు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని