మౌనభాష
సుప్రసిద్ధ భూదానోద్యమనేత, బహుభాషావేత్త వినోభాభావే ఒక అంతర్జాతీయ విమానాశ్రయంలో వేచి ఉండగా, పాత్రికేయ బృందం ఆయనను చుట్టుముట్టింది.
సుప్రసిద్ధ భూదానోద్యమనేత, బహుభాషావేత్త వినోభాభావే ఒక అంతర్జాతీయ విమానాశ్రయంలో వేచి ఉండగా, పాత్రికేయ బృందం ఆయనను చుట్టుముట్టింది. విమానం రాక ఆలస్యం అవుతోంది కాబట్టి, తమతో కొంతసేపు ముచ్చటించమని కోరింది. ఆయన అంగీకరించారు. పాత్రికేయుల్లో వివిధ భాషలవారు ఉండటాన్ని ఆయన గమనించారు. ‘నేను ఏ భాషలో మాట్లాడితే మీకు సౌకర్యంగా ఉంటుంది?’ అని వారిని ప్రశ్నించారు. పాత్రికేయుల్లో ఒకాయనకు భావే మాటలు కొంత అతిశయంగా అనిపించాయి. దాంతో ఆయన లేచి ‘మీరు ఏ భాషలో మాట్లాడినా, అర్థం చేసుకోగల సామర్థ్యం అందరికీ ఉంది. మీకు బాగా ఇష్టమైన భాషలో మీరు మాట్లాడవచ్చు’ అన్నాడు దర్పంగా. ఆ పాత్రికేయుడికి కృతజ్ఞతలు చెబుతూ భావే, మందహాసంతో ‘నాకు మౌనం చాలా ఇష్టమైన భాష. మీకు తెలుసుగా’ అంటూ సర్దుకొని కూర్చుని మౌనముద్ర దాల్చారు. చాలాసేపటికి విమానం వచ్చింది. ప్రకటన వినిపించింది. ‘మరి శెలవా!’ అన్నట్టుగా భావే మౌనంగా తలపంకించి చిరునవ్వుతో అక్కడి నుంచి కదిలిపోయారు.
ఇది చదవగానే మనలో చాలామందికి ‘మౌనం కూడా ఒక భాషేనా?’ అనే సందేహం వస్తుంది. నిజానికి ఆ విషయంలో ఎవరూ సందేహించవలసిన పని లేదు. నిజంగానే మౌనమనేది చాలా శక్తిమంతమైన భాష. ప్రశాంత సుందరమైన హిమాలయ పర్వతసానువుల్లోనో... నిర్జనమైన ప్రదేశాల్లోని శిథిల ఆలయాల్లోనో... కార్తిక పౌర్ణమి వేళ మనం డాబాపై ఏకాంతంగా కూర్చొని చల్లని పిల్ల తెమ్మెరలను ఆస్వాదిస్తున్నప్పుడో... శ్రద్ధగా గమనిస్తే- ఆ గాలి ఊసులు చెబుతాయి మౌనం ఎంత గొప్ప భాషో! కోట్లాది శబ్దాలకన్నా మనిషికి నిశ్శబ్దం చాలా ఎక్కువ బోధిస్తుంది. మాట్లాడకుండా కూర్చోవడం కాదు, లోలోపల ఆలోచనల రొద సైతం నిలిచిపోయే ఒకానొక అద్భుతమైన స్థితి పేరు మౌనం! అప్పుడే నిశ్శబ్దం మనసును ఆవరిస్తుంది. మనిషికి ప్రశాంతత అనుభూతమవుతుంది.
మనిషి తనచుట్టూ దట్టంగా పరచుకొన్న కటిక చీకటిని, బ్రహ్మాండమైన వెలుగుల పూర్వరూపంగా ఏనాడో గుర్తించాడు. ఆ చీకటి అసలు రూపం నలుపు కాదని, అది అనంతమైన కాంతి కిరణాలను తన కడుపులో దాచుకొన్న తెల్లని దేదీప్యమానమైన వెలుగుల ముద్ద అనీ పెద్దలు ఎన్నోసార్లు వివరించారు. అదేవిధంగా నిశ్శబ్దం కూడా తన లోపల ప్రళయభీకర శబ్దాలను ఇమడ్చుకొన్నదేనని బోధించారు. ఇది నిజానికి వేద ప్రతిపాదితమైన జ్ఞానం. శబ్దోత్పత్తి ప్రకరణంలో లక్షణ శాస్త్రం దీనికి చక్కని ఉదాహరణ చెప్పింది. ‘నూతిని తవ్వి నేను నీటిని పుట్టిస్తున్నానని అనుకుంటున్నావేమో- అది పొరపాటు... నువ్వు తవ్వకముందే అక్కడ నీరున్నది. అది నీటి అవ్యక్త స్థితి అంటుంది వేదం... నీ ప్రయత్నం ద్వారా అది లోకానికి వెల్లడి అయింది’ అంటూ లక్షణశాస్త్రం వివరణ ఇచ్చింది.
ఈ సత్యాన్ని మనిషి జీర్ణించుకొంటే మౌనం మాట్లాడటమంటే ఏమిటో అర్థం అవుతుంది. గాఢమైన ప్రేమికుల మధ్య... అన్యోన్య దంపతుల మధ్య... నిర్మలమైన భక్తుడికి భగవంతుడికి మధ్య... మౌనం చాలా గొప్ప వాహిక. అనుసంధాన వేదిక. అది అవ్యక్త మధురమైన భాష. మనిషి గుర్తించడు గాని... వాస్తవానికి ప్రతి మనిషికీ ఆ భాషతో పరిచయం ఉండే ఉంటుంది. ఎదలోపలి ప్రతిస్పందనలను గమనించినప్పుడు, మరో హృదయంలోంచి అది నేరుగా తన గుండెల్లోకి ప్రసారం అయినప్పుడు మనిషి దాన్ని గమనించాలి. అది విత్తులోంచి బ్రహ్మాండమైన వట వృక్షాన్ని దర్శించడం వంటిది. ఆ తరహా సాధన ఫలించిననాడు- మౌనంలోంచి,నిశ్శబ్దంలోంచే కాదు... యోగుల సంభాషణల్లోంచి సైతం వారి అంతరంగాల్లో నెలకొన్న ప్రశాంతతను గుర్తించడం సాధ్యమవుతుంది. మాట నేర్చిన మనిషి తన ప్రయాణంలో చివరకు చేరవలసిన గమ్యం అదే!
ఎర్రాప్రగడ రామకృష్ణ
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Shubman Gill: అతడి ప్రశంసలకు గిల్ పూర్తి అర్హుడు: పాక్ మాజీ కెప్టెన్
-
World News
USA: మీరు దిల్లీ వెళ్లి చూడండి.. భారత్ చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం: అమెరికా
-
General News
JEE Advanced: జేఈఈ అడ్వాన్స్డ్.. సికింద్రాబాద్లో స్మార్ట్ కాపీయింగ్
-
India News
Navy: భారత నేవీ మరో ఘనత.. నీటిలోని లక్ష్యాన్ని ఛేదించిన స్వదేశీ టార్పిడో
-
Movies News
Virupaksha: ‘విరూపాక్ష’ మీమ్స్.. ఈ వైరల్ వీడియోలు చూస్తే నవ్వాగదు!
-
Ts-top-news News
Guntur: మృతుని పేరు మీద 12 ఏళ్లుగా పింఛను