చేయి చేయి కలుపుదాం...

ఒక రాజుగారు వేటకు వెళ్లారు. మృగయా వినోదంలో దారి తప్పారు. పైన ఎండ, లోపల క్షుద్బాధతో నీరసించిపోయాడు. తలెత్తి చూస్తే దూరంగా ఒక కుటీరం కనిపించింది. నెమ్మదిగా అక్కడికి చేరుకున్నాడు. ఒక మహిళ కొంతమందికి అన్నప్రసాద వితరణ చేస్తోంది. రాజును చూసి రమ్మని కూర్చోబెట్టి పళ్ళెరంలో ఆహారం వడ్డించింది.

Published : 14 Mar 2023 00:47 IST

క రాజుగారు వేటకు వెళ్లారు. మృగయా వినోదంలో దారి తప్పారు. పైన ఎండ, లోపల క్షుద్బాధతో నీరసించిపోయాడు. తలెత్తి చూస్తే దూరంగా ఒక కుటీరం కనిపించింది. నెమ్మదిగా అక్కడికి చేరుకున్నాడు. ఒక మహిళ కొంతమందికి అన్నప్రసాద వితరణ చేస్తోంది. రాజును చూసి రమ్మని కూర్చోబెట్టి పళ్ళెరంలో ఆహారం వడ్డించింది. కడుపునిండిన రాజు ఆమెకు కాసులమూట ఇవ్వబోయాడు. ఆమె తిరస్కరించి ‘ఇది నా ధర్మం, బాధ్యత’ అన్నది. ‘ఈ రాజ్యంలో ఆకలితో ఎవ్వరూ అలమటించరాదని మా రాజు ఇలాంటి ఏర్పాట్లు పలుచోట్ల చేశా’డని చెప్పింది. తానూ రాజైనా తనకెందుకీ ఆలోచన రాలేదా అని రాజు విచారించాడు. కృతజ్ఞతతో వెనుదిరిగి తన రాజ్యంలో కూడా అలాంటి ఏర్పాట్లు చేశాడు. ఇది కథే అయినా ఇందులో మనిషి ప్రాణం నిలబెట్టే ఆహారం గురించిన ప్రస్తావన ముఖ్యమైనది. కుద్బాధ భయంకరమైనది. సమయానికి ఆహారం అంది కడుపునిండితే చైతన్యశక్తి నిలుస్తుంది. లేకపోతే ప్రాణాలు కొడిగట్టిపోతాయి. ఆకలికి సమయాసమయాలు, రుచీ శుభ్రతలు, గొప్పా బీదా అన్న తేడాలు ఉండవు.

శరీరం, శక్తి ఉన్నప్పుడు ధర్మమార్గంలో ద్రవ్యాన్ని ఆర్జించి కడుపు నింపుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి. తాను, తనతోపాటు ఇతరులు కూడా సామూహికంగా ఆహారాన్ని పంచుకోవాలి. పూర్వం రోజుల్లో అతిథికి సంతర్పణ చేసిగాని       ఎవరూ ఆహారాన్ని స్వీకరించేవారు కాదు. భోజన వేళ అయ్యేసరికి అతిథులను వెతికి తెచ్చేవారు. చేతులకు నిజమైన ఆభరణాలు కంకణాలు, అంగుళీయాలు కాదు... పిడికెడు మెతుకులు పంచి సాటిమనిషి కడుపునింపే అందమైన వేళ్లు! ఏ కార్యకలాపాలు సాగాలన్నా కడుపు చల్లబడాలి. భగవద్రూపమైన ఆహారాన్ని పవిత్రంగా ఆరాధించాలి. భద్రపరచుకోవాలి, ఇతరులకు పంచాలి. ప్రాణం నిలిపే ఆహారం విలువ తెలియక నిర్లక్ష్యంతో నేల పాల్జేస్తున్నాం. అవసరమైనవేళ ఆర్తులకు నాలుగు మెతుకులు విదిలించని మనం ఆడంబరాల పేరిట ఉత్సవాల్లో, సంబరాల్లో మిగిలిన పదార్థాలను మట్టిలో పడేస్తున్నాం. లోకంలో కోట్లాది ప్రాణులు సరైన తిండి దొరకక అలమటిస్తున్నారు. ఉపయోగించే ఆహారం కంటే వృథా చేసేదే అధికమని గణాంకాలు చెబుతున్నాయి. రాశులకొద్దీ ఆహారం సద్వినియోగం కావడం లేదు. ఇలాంటి స్థితిలో ఆకలి బాధలు, ఆహారం విలువ తెలిసిన కొందరు ముందుకు దూకి శుభకార్యాలలో, పండుగలలో ఉపయోగించని ఆహారాన్ని దాతల ద్వారా సేకరిస్తున్నారు. అన్నమో రామచంద్రా అని అలమటించే అభాగ్యులకు వడ్డన చేస్తున్నారు. ఆహారంపట్ల తమ ప్రేమను చాటుతున్నారు. ఒక మహాయజ్ఞంలా కొనసాగిస్తున్నారు. అవకాశాలను సృష్టించుకొని పలువురు దాతలు వారికి సహకరిస్తున్నారు. మానవ మనుగడకు కనీస సదుపాయాలైన ఆహారం, నివాసం, వస్త్రం లభించని దీనులెందరో. చాలా ఇళ్లలో ఉపయోగించని వస్త్రాలు దర్శనమిస్తాయి. అవి అభాగ్యులకు చేరితే చిరుగుల బతుకులకో చిన్న ఆశ. శీతవేళల్లో చలికి వణికే నిరుపేదలకు వస్త్రాలనందిస్తే... అదే మాధవసేవ.

సర్వ ప్రాణులను సమంగా ఆదరించేవారు, ఇతరుల దుఃఖాన్ని తమదిగా స్వీకరించేవారు ఉత్తములని గీతలో పరమాత్మ చెప్పిన మాటలు దీనులను పరికించినప్పుడు జ్ఞప్తికి రావాలి. దేవుణ్ని స్మరిస్తూ చేసే అన్నదానం భగవంతుడిని చేరుతుంది. ఈ యజ్ఞంలో తామూ పాల్గొనాలనే తలపు బలంగా నాటుకోవాలి. మూసుకున్న మానవ హృదయ మందిర ద్వారాలు తెరచుకోవాలి. కారుణ్యపు జేగంటలు మది మదిలో మోగాలి. గింజ రక్షణకు కర్షకుడు పడే కష్టం కళ్లముందు కదలాడాలి. అమృత సమానమైన అన్నకణాలు అన్నార్తులకు చేరాలి. కడుపునిండినవారి ముఖాల్లో ఆనందం తాండవించాలి.

మాడుగుల రామకృష్ణ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు