విశేష ప్రతిభ

ప్రతిభ పుట్టుకతో వస్తుందని కొంతమంది అంటారు. గట్టిగా నమ్ముతారు. ప్రతిభ దైవదత్తం అంటారు ఇంకొందరు. కోకిలకు పాట ఎవరు నేర్పారు, చేపకు ఎవరు ఈత నేర్పారు వంటి తర్కంతో మనుషులను నిరుత్సాహపరుస్తారు.

Published : 16 Mar 2023 05:35 IST

ప్రతిభ పుట్టుకతో వస్తుందని కొంతమంది అంటారు. గట్టిగా నమ్ముతారు. ప్రతిభ దైవదత్తం అంటారు ఇంకొందరు. కోకిలకు పాట ఎవరు నేర్పారు, చేపకు ఎవరు ఈత నేర్పారు వంటి తర్కంతో మనుషులను నిరుత్సాహపరుస్తారు. నిజానికి మానవుడికి అసాధ్యమైనది లేదు.

పురాణ పురుషులు చాలామంది అనూహ్యమైన ప్రతిభ కనబరచారు. అర్జునుడు, భీముడు పాండవులలో ప్రత్యేకతను ప్రతిభావంతంగా చాటుకున్నారు. హనుమంతుడు త్రేతాయుగంలో, కలియుగంలో ఆధునిక ఆధ్యాత్మికవాదులైన రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, బుద్ధుడు, మహావీరుడు, శంకరాచార్యుడు తదితరులు వారి అసామాన్యమైన ప్రతిభను మహిమాన్వితంగా రుజువు చేశారు.

మనం చెయ్యడానికి అమితంగా ఇష్టపడే పని ఎప్పుడూ ఆనందాన్ని ఇస్తుంది. మనం ఏదైనా అత్యుత్తమంగా చేసేందుకు దోహదం చేస్తుంది. అవసరమైతే, ప్రతిఫలం లేకుండా కూడా పనిచేస్తాం. అది మనలోని అత్యుత్తమమైన సామర్థ్యాన్ని బయటకు తెస్తుంది. ఆ పనిలో మునిగి ఉన్నప్పుడు అద్భుతమైన ఆనందాన్ని, సంతృప్తిని అనుభవిస్తాం. మనలోని ప్రతిభ, పాటవాలు పుట్టుకతోనే వచ్చినవి. వాటిని అభివృద్ధి చేసుకోవడం తేలిక. అవి మన అంతరంగంలో నమోదై ఉన్నాయి. వాటిని ఉప యోగించుకునేందుకే మనం ఈ భూమ్మీదకు వచ్చాం. మనలోని సామర్థ్యాన్నంతా పూర్తిగా అర్థం చేసుకొని ఉపయోగించుకోవాలంటే ఆ నైపుణ్యాన్ని అభ్యాసంతో అల వరచుకోవచ్చు. అభ్యాస యోగం అని భగవద్గీత ప్రస్తావించింది ఇదే. సరిగ్గా పనిచెయ్యకపోవడం అనే ఆలోచన సరైనది కాదు. అది ఒక ఉచ్చు. అందులో పడకూడదు.

విజయానికి ఎప్పుడూ కొంత మూల్యం చెల్లించాలి. అది ఏమిటంటే, మన రంగంలో అత్యున్నతమైన స్థానాన్ని సంపాదించుకునేందుకు ఒక కష్టమైన పనిలో నైపుణ్యాన్ని సంపాదించుకోవాలి. మనం నేర్చుకున్నదాన్ని వీలైనంత త్వరగా కార్యరూపంలో పెట్టాలి. ఒక మంచి ఆలోచనను విన్న ప్రతిసారీ ఆచరణలో పెట్టాలి. వంద ఆలోచనలు విని, ఒక్కదాన్ని కార్యరూపంలో పెట్టిన వ్యక్తి కన్నా, విన్న వెంటనే ఒకేఒక ఆలోచన కార్యరూపంలో పెట్టే వ్యక్తే విలువైనవాడు.

మనం నేర్చుకునే విషయాన్ని ఎంత ఎక్కువగా అభ్యసిస్తే ఆ పనిలో అంత వేగంగా సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని సంపాదించుకోగలుగుతాం. అభ్యాసం చేసిన కొద్దీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మనలోని లోటుపాట్లనూ అంతే వేగంగా అధిగమించగలుగుతాం. అదే వేగంతో పనిలో పూర్తి అధికారాన్ని సంపాదించుకోగలుగుతాం. మనకు ఈ నైపుణ్యం అలవడిన తరవాత ఇక జీవితాంతం అది మన సొంతం అయిపోతుంది. మన కోసం ఏర్పరచుకున్న ఎటువంటి లక్ష్యాన్నయినా సాధించేందుకు అవసరమైన ఎటువంటి విషయాన్నయినా నేర్చుకోగలుగుతాం. మనం సాధించదలచుకున్నవాటికి నిజానికి ఎటువంటి హద్దులూ లేవు. ఒకవేళ ఏమైనా ఉన్నాయంటే అవి మన మనసుకు, ఊహలకు మనంతట మనం ఏర్పరచుకున్నవే. మనం అద్భుతమైన విజయాల్ని సాధించాలనుకున్నా, మన రంగంలో పై స్థాయిలో చేరుకున్న వారిలో ఒకరిగా ఉండాలనుకున్నా అక్కడకు చేరుకోవడానికి ఎవరూ మనకు అడ్డుపడరు. దేవుడు సాధకులను ఆపడు. ఆశీస్సులు ఇచ్చి భుజం తట్టి ముందుకు నడిపిస్తాడు. విజేతలు కాగోరినవారికి అన్ని విధాలా సహాయం చేస్తాడు.

 ఆనందసాయి స్వామి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు