అడుగు జాడలు

పరబ్రహ్మ స్వరూపులు అయిన త్రిమూర్తులు మనకు ఆరాధనీయులు, ఆదర్శప్రాయులు. ఎలా జీవించాలో, ఏం సాధించాలో వారు చెప్పకనే చెబుతున్నారు. ఇహ పరసాధన జీవిత పరమార్థం. ఆ పరమార్థం తెలుసుకుని జీవితకాలాన్ని సార్థకం చేసుకోవడం మానవధర్మం.

Published : 17 Mar 2023 00:37 IST

పరబ్రహ్మ స్వరూపులు అయిన త్రిమూర్తులు మనకు ఆరాధనీయులు, ఆదర్శప్రాయులు. ఎలా జీవించాలో, ఏం సాధించాలో వారు చెప్పకనే చెబుతున్నారు. ఇహ పరసాధన జీవిత పరమార్థం. ఆ పరమార్థం తెలుసుకుని జీవితకాలాన్ని సార్థకం చేసుకోవడం మానవధర్మం. జన్మకర్మలను శాసించేది సంస్కారం. సంస్కారానుసారం కోరికలు కలుగుతాయి. కోరికలనుబట్టి జీవితాలు కొనసాగుతాయి. కోరికలు రెండు రకాలు. భౌతికమైన కోరిక, అలౌకికమైన ఆకాంక్ష. లౌకికమైన కోరికలు అంటే సంతోషంగా జీవించడానికి కలిసివచ్చే సంపద, కీర్తి, సంఘంలో పరపతి, ఆధిపత్యం, అధికారం మొదలైనవి. తరిగిపోయే సంపద, మరుగునపడే పేరుప్రతిష్ఠలు, అరిగిపోయే పరపతి, అడుగంటే ఆధిక్యం, కూలిపోయే అధికారం... వీటివల్ల మనం పొందగలిగిందల్లా క్షణికమైన సుఖం, తాత్కాలికమైన మానసిక ఉల్లాసం.

ఆలోచించగల మనిషికి భౌతి కమైన సుఖాలకు అతీతమైన మరో స్థితి, అలౌకికమైన అనుభూతి ఉన్నాయన్న ఎరుక కలుగుతుంది. తరగని ఆనందం, చెరగని ఆత్మతృప్తి, సాధించాలన్న కోరిక కలుగుతుంది. అదే ఆకాంక్ష! సచ్చిదానంద సాధనమే జీవిత పరమార్థం; పరమగమ్యంగా సాగే అలాంటి మనిషి బతుకుబండి నల్లేరుమీద నడకలా చకచక గమ్యం వైపు మొగ్గుచూపుతుంది. ఆశల సుడిగుండంలో చిక్కుబడిన జీవితం సుళ్ళు తిరుగుతూ ఉంటుంది.

త్రిమూర్తులు మనకు అందిస్తున్న లౌకిక పారమార్థిక దివ్య సందేశం ఏమిటి? బ్రహ్మ సృష్టికర్త. ఆయన సృజనాత్మక శక్తి ఒకవైపు నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. నానారూప కళావిలాసాలు ఉట్టిపడేలా మట్టిబొమ్మలకు రంగులు, హంగులు, ఒక శిల్పాచార్యుడిలా మలచి, మన తలరాతలను రాస్తాడు విరించి. ఈ జీవితం భగవంతుడి వరం. పరిమితమైన మన జీవిత కాలాన్ని వృథా చేయకుండా, చెడు సంస్కారాలకు దూరంగా, మంచి సంస్కారాలకు దగ్గర కావడానికి ప్రయత్నించాలి. అదే సాధన! సాధన ద్వారా జీవన సాఫల్యానికి మార్గం ఏర్పడుతుంది. కమలాసనుడిని కన్న తండ్రి విష్ణుమూర్తి హాయిగా శేషశయనుడై యోగనిద్రలో ఉంటూ విశ్వంభర స్థితిగతుల్ని శాసిస్తూ ఉంటాడు. మహాదేవుడు లయకారుడు. మూడో కన్ను ధరించి, అర్ధనిమీలిత నేత్రుడై ధ్యానయోగంలో లీనమై ఉంటాడు. ఇహపరతీరాలను తాకుతూ ప్రవాహంలా జీవితాన్ని మలచుకుంటూ మలుపు తిప్పుకొంటూ సాగమంటున్నది త్రిమూర్తితత్త్వం.

‘త్రిమూర్తులు’ గురురూపంలో దిగివచ్చి మానవ సమాజానికి లోకకల్యాణానికి, కారణభూతం అవుతారు. గురువును దేవుడిగా భావించి శిష్యబృందం సేవించి, తరించడం అనాదిగా భారతదేశంలో గూడుకట్టడం, మన సనాతన సంస్కృతికి సజీవ నిదర్శనం; ఒక సత్‌ సంప్రదాయం. బ్రహ్మలా జ్ఞానమనే ప్రాణం ప్రదానం చేసి శిష్యుడికి కొత్త జీవితం ప్రసాదించేవాడు, విష్ణువులా కూటస్థ చైతన్య రూపంలో కాచేవాడు, మహేశ్వరుడిలా తామసమనే తిమిరాన్ని హరించేవాడు త్రిమూర్తుల స్వరూపుడు గురువు ఒక్కడే! గురుతత్త్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన విశ్వగురువు భారతదేశం ఒక్కటే!

ఉప్పు రాఘవేంద్రరావు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని