సుందర చంద్రుడు

వాల్మీకి కవికోకిల. ఆ కోకిల గానామృతమే రామాయణం. రామాయణం అంటే రాముడి అయనం అని, రామ అయనం అనీ రెండు అర్థాలు. అయనం అంటే మార్గం కనుక రామాయణాన్ని మర్యాదాపురుషోత్తముడైన రాముడు చూపిన మార్గంగా చెబుతారు.

Published : 20 Mar 2023 00:54 IST

వాల్మీకి కవికోకిల. ఆ కోకిల గానామృతమే రామాయణం. రామాయణం అంటే రాముడి అయనం అని, రామ అయనం అనీ రెండు అర్థాలు. అయనం అంటే మార్గం కనుక రామాయణాన్ని మర్యాదాపురుషోత్తముడైన రాముడు చూపిన మార్గంగా చెబుతారు. ‘రామ’ అంటే స్త్రీ అని అర్థం కనుక, సీత చూపిన ఉత్తమశీల మార్గంగానూ రామాయణ శబ్దాన్ని అన్వయిస్తారు. రామాయణానికి ‘సీతాయాశ్చరితం మహత్‌’ (సీతకు సంబంధించిన మహనీయ చరిత్ర) అనే ప్రశస్తి ఉంది. ఈ విధంగా రామాయణ శబ్దం సీతారాములకు ఇద్దరికీ వర్తిస్తుంది.

రామాయణంలో ఎంతో మనోహరమైన భాగం సుందరకాండ. పేరులోనే సౌందర్యాన్ని దాచుకొన్న ఈ కాండ ఆద్యంతమూ పాఠకులను ఆకట్టుకొంటుంది. రాముడి ఆజ్ఞతో సీతాదేవిని అన్వేషించేందుకు అతులిత బలధాముడైన హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళడం, అక్కడి అశోక వనంలో రావణుడి చెరలో ఉన్న సీతాదేవి జాడను కనుక్కొని, రావణుడిపై కోపంతో అశోక వనాన్ని ధ్వంసం చేయడం, రావణుడికి హెచ్చరికగా లంకను కాల్చి వేయడం, చివరికి సీత జాడను రాముడికి చేరవేయడం వరకు సుందరకాండ అంతా ధార్మిక వీర విజృంభణకు ఆలవాలంగా కనిపిస్తుంది.

లంకలో సీతాదేవి జాడ కోసం హనుమంతుడు వెదుకుతున్నప్పుడు చంద్రోదయం అయింది. నింగిలో జాబిల్లి అందాలు హనుమంతుణ్ని ఆకర్షించాయి. చంద్రుడు సుందరుడు. చంద్రిక సుందరి. రామచంద్రుడిలోనూ చంద్రుడు ఉన్నాడు. అతడు సుందరుడు. రాముడి సుందరి సీతాదేవి. ఆమె రామచంద్రుడికి వెన్నెల.
హనుమంతుడు దర్శించిన చంద్రుణ్ని గురించి వాల్మీకి అద్భుతంగా వర్ణించాడు. జనుల పాపాలను, దుఃఖాలను పోగొట్టేవాడిగా చంద్రుడు కనిపించాడట. వెండి పంజరంలో ఉన్న హంసలా, మందర పర్వత గుహలో ఉన్న సింహంలా, ఆకాశం అనే మదపుటేనుగుపై ఎక్కికూర్చున్న వీరుడిలా, వాడిగా ఉన్న కొమ్ములు గల తెల్లని ఎద్దులా ఉన్నాడట. ఎత్తైన శిఖరాలు గల తెల్లని కొండలా, బంగారు తొడుగులతో కూడిన కోరలు గల ఐరావతంలా ఉండి- మంచు తెరలు తొలగిపోయాక నిర్మలంగా కనిపిస్తూ అందరినీ ఆకర్షిస్తున్నాడని  కవి వర్ణన.

ఈ వర్ణనలన్నీ కేవలం చంద్రవర్ణనలే కావు. హనుమంతుడి ఆనందోత్సాహాలకు సంకేతాలు. సీతాదేవి ఎక్కడుందో తెలుసుకొని ఆమె కుశలాన్ని రాముడికి తెలియజేయాలనేది హనుమంతుడి సంకల్పం. తన సంకల్పం సిద్ధించడానికి అమితోత్సాహంతో శతయోజనాలను దాటుకొని, లంకకు వెళ్ళాడు హనుమంతుడు. అతడికి ఆకాశంలో కనబడిన చంద్రుడు ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని అందించాడు.

ధర్మవీరుడికి ఉండవలసిన లక్షణాలన్నీ హనుమంతుడిలో పుష్కలంగా ఉన్నాయి. అధర్మంగా పరస్త్రీని ఎత్తుకొనివచ్చిన రావణుడికి తగిన విధంగా బుద్ధి చెప్పాలనే దృఢ దీక్ష అతడిలో అమితోత్సాహాన్ని రగిలించింది. దారిలో సముద్రంలో మైనాకుడు ఆగి, విశ్రాంతి తీసుకొమ్మని కోరినా రామకార్యాన్ని సఫలం చేసేదాకా విశ్రమించను అని ప్రతిజ్ఞ చేసి ముందుకు సాగిపోయాడు. సురసను ఎదుర్కొని, సింహికను సంహరించి, లంకిణిని అణచి, లంకలో సునాయాసంగా ప్రవేశించాడు.

లంకానగరం దుర్భేద్యమని విర్రవీగిన రావణుడి గర్వాన్ని ఖర్వం చేసి, రావణుడి సంపదలకు నష్టాన్ని కలిగించి, అధర్మవర్తనుడికి ఎలాంటి గతిపడుతుందో చూపిన మహావీరుడు హనుమంతుడు. అతడే సుందరకాండకు చంద్రుడి వంటివాడు. ఆకాశంలో పున్నమినాడు ప్రకాశించే రాకాచంద్రుడు లోకులకు ఎలాంటి ఆహ్లాదాన్ని కలిగిస్తాడో, అలాగే రాముడి కుశలవార్తను, సందేశాన్ని అందించి సీతాదేవి మనసును ఆహ్లాదపరచిన ధార్మిక చంద్రుడు హనుమంతుడు!

డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని