జరిగేది తెలియదు

మానవుడు  తన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి తెలుసుకోవాలని సదా తపిస్తాడు. భౌతిక ప్రపంచ  వెలుగుజిలుగులను దర్శించి ఆనందించే మనిషి దానినే ఇష్టపడతాడు తప్ప లోపలి వెలుగును దర్శించే ప్రయత్నం చేయడు.

Published : 21 Mar 2023 02:57 IST

మానవుడు  తన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి తెలుసుకోవాలని సదా తపిస్తాడు. భౌతిక ప్రపంచ  వెలుగుజిలుగులను దర్శించి ఆనందించే మనిషి దానినే ఇష్టపడతాడు తప్ప లోపలి వెలుగును దర్శించే ప్రయత్నం చేయడు. కనులు మూసుకుంటే చీకటి! ఆ చీకట్లోనే మనిషి లోవెలుగును దర్శించవలసి ఉంటుంది. అదీ ధ్యాన సమయంలో!! మనకు తెలిసిన ధ్యానమే అలనాటి రుషిపుంగవులు ఆచరించిన తపస్సు!! 

ప్రపంచంలో  జరగబోయేదేదీ మనిషికి ముందుగా తెలియదు. వద్దన్న దిక్కుకు వెళ్ళి అవస్థలు పడ్డ రాకుమారుడి కథలు మన చిన్నతనంలో చదివాం. భవిష్యత్తులో ఏదో జరుగుతుంది. అది అనుకూలంగానా, లేక ప్రతికూలంగానా తెలుసుకోవాలని, గ్రహాల కదలికల ద్వారా భవిష్యద్దర్శనం చేయాలని ఆరాటపడతాడు మనిషి. అయినా అతడి భయాలు తొలగవు. మరుక్షణంలో జరగబోయే అతి చిన్న విషయమూ మనిషికి అగోచరమే! వడ్డించిన విస్తరిలా గతం మనోనేత్రం ముందు స్పష్టంగా కదలాడుతుండగా, మరుక్షణం జరగబోయే భవిష్యఘటన తెలియక పోవడం సృష్టివిలాసం. వర్తమానాన్ని గుర్తించి ప్రాధాన్యం ఇవ్వడంలో మనిషి ఎల్లప్పుడూ వెనకబడతాడు.

ఈ సృష్టి అంతా భగవంతుడి విశ్వప్రణాళికలో భాగంగా నడుస్తూ ఉంటుంది. సమూహంతో పాటు వ్యక్తిగత భవిత సైతం ఆ దివ్య గణనలో భాగంగానే సాగుతుంది. మనం ఎన్ని ప్రణాళికలు వేసుకొని ముందుకు సాగినా అవి భగవంతుడి నిర్ణయం మేరకే జరుగుతాయి.  విశ్వశ్రేయస్సును కాంక్షించే జగత్పిత ప్రణాళిక అమలవుతుండగా ఏ ఒక్కరికో కీడు సంభవిస్తుందని శంకించకూడదు. విజ్ఞుల ప్రవచనాలు ఆ విషయాన్నే నిర్ధారిస్తాయి. మన కర్మలు మంచివైనప్పుడు ఫలితం సైతం మంచిగానే ఉంటుంది. కర్మలు చెడ్డవైతే చెడు ఫలితాల నుంచి తప్పించుకోలేం. అది సృష్టినైజం. జరగబోయేది తెలియనప్పుడు భవిత అనే మార్మిక రహదారిలో కళ్లు మూసుకొని నడిచే బదులు విజ్ఞతతో అడుగులు వేస్తే కాలం అనుకూలమవుతుంది. మంచి ఫలితాలు అందివస్తాయి. అప్పుడు ఏది ఎలా జరిగినా సాధకుడికి శ్రేయమే కలుగుతుంది. ఆ శ్రేయస్సు ఇవాళ, లేక రేపు... లేదా కొన్ని సంవత్సరాల తరవాత అనుభవంలోకి రావచ్చు! కాలప్రవాహంలో అత్యంత చిన్నదైన మానవ జీవితపు లెక్కలు దైవ కాలమానంతో ఏకీభవించవు కదా!

జరిగేది తెలియదు కనుక మంచి కర్మలకు మంచి ఫలితాలు ఉంటాయని విశ్వసించి  సత్కర్మలు ఆచరించాలి. అందువల్ల మానవ జీవితం సుఖభరితమవుతుంది. అప్పుడు అందరికీ సద్గతే!  ప్రతి సాధకుడూ ముక్తి కోసం ప్రయత్నించాలని పవిత్ర గీతా గ్రంథం  చెబుతుంది. ఆ గమ్యానికి చేరుకోవడం  అందరి లక్ష్యం కావాలి. దుష్కర్మల వల్ల మోక్షప్రాప్తికి కాలయాపన జరుగుతుందన్నది వాస్తవం. ప్రతి క్షణాన్నీ  అమృతప్రాయంగా తీర్చిదిద్దుకున్నప్పుడు రాబోయే కాలం మనిషిని భయపెట్టదు. జరగబోయేది తెలియకపోయినా సాధకుడికి నష్టమేమీ జరగదు!

 గోపాలుని రఘుపతిరావు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు