కాలం శుభకరం

వేదం ప్రకారం చైత్రం మధుమాసం. వైశాఖం మాధవ మాసం. ఈ మధుమాధవ మాసాలే మధురమైన వసంతం. ప్రకృతిలో భూగోళంలో వచ్చే పరిణామాలను అనుసరించి పర్వాలను ఏర్పరచుకొనే భారతీయ సనాతన ధర్మం, ఆ కాలాల మార్పులలోని దివ్యత్వాన్ని దర్శించిన ఋషుల ద్వారా ఎన్నో చక్కని ఆచారాలను నిర్దేశించింది. ఏడాదికి ‘యుగ’మని పేరుంది.

Published : 22 Mar 2023 00:09 IST

వేదం ప్రకారం చైత్రం మధుమాసం. వైశాఖం మాధవ మాసం. ఈ మధుమాధవ మాసాలే మధురమైన వసంతం. ప్రకృతిలో భూగోళంలో వచ్చే పరిణామాలను అనుసరించి పర్వాలను ఏర్పరచుకొనే భారతీయ సనాతన ధర్మం, ఆ కాలాల మార్పులలోని దివ్యత్వాన్ని దర్శించిన ఋషుల ద్వారా ఎన్నో చక్కని ఆచారాలను నిర్దేశించింది. ఏడాదికి ‘యుగ’మని పేరుంది. రెండు అయనాల (యుగళం) కాలం కనుక. అందుకే ‘యుగాది’ అని కూడా వ్యవహారం. అంతేకాక- సృష్టి ఆరంభం, తొలియుగం మొదలు చైత్ర శుద్ధపాడ్యమి- అని కొన్ని సంప్రదాయగ్రంథాలు చెబుతున్నాయి.

ప్రకృతిలో చిగురింత, నూతన శోభ- ఈ ‘తొలి’ ‘కొత్త’ లక్షణాలను సూచిస్తాయి. అందుకే చిగురింతతో ప్రారంభమయ్యే కొత్త ఏడాదిని, శుభాలను కోరుతూ ఆహ్వానించే సంస్కృతి పరంపరగా వస్తోంది. ఈ రోజున ప్రాతఃకాలంలో మామిడి, బెల్లం, వేపపూతలను కలిపిన ఉగాది ప్రసాదాన్ని స్వీకరించాలని ధర్మ శాస్త్రాలు చెబుతున్నాయి. బంధు మిత్రులందరూ కలిసి పంచాంగ శ్రవణం చేయడం మరొక విధి.  తిథి, వార, నక్షత్ర, యోగ, కర ణాలనే ఐదంగాల కాలమానం ఒక శాస్త్ర పద్ధతిని, గణిత విధానాన్ని ఆధారంగా నిర్మించినది. ధర్మకర్మల ఆచరణకు, సంప్రదాయసిద్ధమైన కార్యక్రమాల నిర్వహణకు పంచాంగాన్ని పరిశీలించడం పరిపాటి. ఈ పంచాంగ విధానం ప్రకారం- సృష్టి మొదటి నుంచి ఇప్పటి వరకు జరిగిన మన్వంతరాలు, యుగాలు, సంవత్సరాలు మొదలైన లెక్కలను ఒక పద్ధతిని అనుసరించి చెప్పడం విశేషం. కనురెప్పపాటు కాలం నుంచి కల్పకాలంవరకు గణించిన జ్యోతిర్విజ్ఞానం పంచాంగంలో ఉంది. గ్రహాలు, నక్షత్రాలు, సూర్యచంద్రుల ఉదయాస్తమానాలు- వీటిననుసరించి అయిదు అంగాలను నిర్దేశించే పంచాంగశ్రవణం- ఆయా కాలాది దేవతల అనుగ్రహాన్ని పొందడానికి సాధనంగా సంప్రదాయవేత్తలు తెలియజేస్తారు.

ప్రకృతి, కాలం మనకు తగినట్టుగా ఉండాలని అందరూ ఆశిస్తారు. కానీ మార్పులను మనకు అనుగుణంగా మలచుకోవడమే నేర్పరితనం. మంచీ చెడూ కాలమో, దైవమో ఇచ్చేవి కావు. మన తలపులకీ, చేతలకీ ఫలంగా లభించేవి. వాటిని సల్లక్షణాలతో సంస్కరించుకుంటే ప్రతికాలమూ శుభకరమే. శోభాకరమే.
శాస్త్రరీత్యా కూడా తిథి నక్షత్రాదులలో ‘చెడు’ అనేది లేదు. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క సల్లక్షణం ఉంటుంది. దాన్ని సద్వినియోగపరచుకొనే తీరును తెలియజేసేది ఈ కాలశాస్త్రం. వసంతంతో ప్రారంభమైనప్పటికీ శిశిరం వరకు ప్రయాణించవలసినదే! ఈ పయనంలో ప్రతి దశకీ ప్రయోజనముంది. ఉత్సవాలు, ఉత్పాతాలు రెండూ అనివార్యాలే. ఉత్సవాల ఆనందాలను పంచుకుంటూ, ఉత్పాతాల ఆందోళనలను ఓర్పుతో నేర్పుతో ఎదుర్కొంటూ కాలాన్ని సద్వినియోగం చేసుకొనేందుకు సంసిద్ధులం కావడమే వత్సరాది కర్తవ్యం.

సంకల్పించే ప్రతి పని సాఫల్యం పొందాలంటే సరియైన 1. ప్రణాళిక, 2. ప్రయోజనం ఉండాలి. ఆ ప్రయోజనం వ్యక్తి సౌఖ్యమే కాక సమూహ క్షేమం అయినప్పుడు, ఆ ప్రణాళిక సదాలోచనతో సాగినప్పుడు కాలరూపుడైన పరమేశ్వరుడు ‘శోభకృత్‌’- శోభన కలిగించేవాడిగా- సత్ఫలితాలనే ప్రసాదిస్తాడు.

సామవేదం షణ్ముఖ శర్మ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని