శోభాయమానం

తెల్లని మల్లెలు వికసించినట్లు విశ్వాసులు ధరించిన టోపీలు, సుగంధ ద్రవ్యాల పరిమళాలతో వీచే చల్లని గాలులు, అయిదు పూటలు నమాజు విధి నిర్వర్తించాలనే అజాన్‌ పిలుపులతో నిండినదే పండగ సందడి.

Published : 23 Mar 2023 02:28 IST

తెల్లని మల్లెలు వికసించినట్లు విశ్వాసులు ధరించిన టోపీలు, సుగంధ ద్రవ్యాల పరిమళాలతో వీచే చల్లని గాలులు, అయిదు పూటలు నమాజు విధి నిర్వర్తించాలనే అజాన్‌ పిలుపులతో నిండినదే పండగ సందడి. ఆకలిని సహించి మొహమ్మద్‌ (స.అ.వ.) చూపిన దారిలో ఉపవాస దృఢ సంకల్పాలతో ఉషోదయానికి ముందే చేసే సహరీలతో శోభాయమానంగా వచ్చింది పవిత్ర రంజాన్‌ మాసం. అల్లాహ్‌ విశ్వాసులు ఎదురుచూసే చాంద్రమానంలోని తొమ్మిదో మాసం ఎంతో పుణ్యప్రదం. మన్నింపులు వేడుకొనేందుకు అల్లాహ్‌ తమకు ఇచ్చిన సదవకాశంగా దీన్ని ప్రజలు భావిస్తారు.

సూరె బఖరలోని ఇరవై మూడో రుకూ తెలిపినట్లు పవిత్ర రంజాన్‌ నెలలో దివ్య ఖుర్‌ఆన్‌ గ్రంథం అవతరించింది. ఇది మానవులందరికీ సత్యాసత్యాలు వేరుపరచే స్పష్టమైన ఉపదేశాలతో రుజుమార్గం చూపు తుంది. సూరె ఫాతిహాతో ప్రారం భమై సూరె ఆనన్నాస్‌తో ముగిసే నూటపద్నాలుగు ఖండాలతో ఈ గ్రంథం అల్లాహ్‌ సందేశాలను సిద్ధాంతాలను అందిస్తుంది. మనిషి పరిపూర్ణ జీవన వ్యవస్థ అల్లాహ్‌ అభీష్టానికి అనుగుణంగా ఎలా కొనసాగాలో సూచిస్తుంది. ఒక శాశ్వత ధర్మవ్యవస్థకు సమస్త కాల పరిణామాలకు సరిపడే ఆచర ణాత్మక ఆదర్శప్రాయమైన రూపు రేఖలను పవిత్ర గ్రంథం అందిస్తుంది. రంజాన్‌ నెలలో ప్రతీ రోజు చదివే ప్రత్యేక తరావీహ్‌ నమాజుతోపాటు దివ్య ఖురాన్‌ గ్రంథ పారాయణం చేస్తారు. ప్రతి వాక్య సారాంశాన్ని గ్రహించిన విశ్వాసులు అల్లాహ్‌ అనుగ్రహాలకు తన్మయత్వం చెందుతారు.

అల్లాహ్‌కు భయపడవలసిన వారు కొందరు తమ తోటి మనుషులకు భయపడుతున్నారు. ఐహిక జీవిత భోగాలు అల్పమైనవి. విశ్వాసికి దైవభీతి, పరలోక ఆసక్తి ఎక్కువ మేలైనవి. ఎంతటి దృఢమైన భవనాల్లో ఉన్నా మృత్యువు తప్పక సంభవిస్తుంది. దైవ విధేయులే ఆయన అనుగ్రహానికి పాత్రులైన ప్రవక్తలు, సత్యసంధులు, షహీదులు సజ్జనులతో పాటు ఉంటారు. మంచికోసం తపించేవారికి ఆ మంచిలో భాగం లభిస్తుంది. చెడుకోసం పాకులాడేవారికి ఆ చెడులో భాగం లభిస్తుంది. నమ్మకద్రోహులను, నిత్యపాపులను అల్లాహ్‌ ప్రేమించడు. క్షమాభిక్ష అర్థించిన వారిని అల్లాహ్‌ క్షమిస్తాడు. అల్లాహ్‌ నామస్మరణ కంటే మేలైనది ఏదీలేదు.

ఇఫ్తార్‌ సమయంలో చేసే ప్రతి దువాను అల్లాహ్‌ ఆమోదిస్తాడు. భావోద్వేగాలను అదుపులో పెట్టుకొని చెడు అలవాట్లను వదిలేసి దుర్భాషలకు దూరంగా ఉండగలిగితేనే ఉపవాస ఫలం దక్కుతుంది. జకాత్‌, ఫిత్రా దానాలతో ఉపవాసులు దోషరహితులవుతారు. సమాజంలోని అభాగ్య నిరుపేదల్ని ఆదుకోవడమూ ఒక విధి.

ఏ తారతమ్యాలు వర్గ వైషమ్యాలు లేని సర్వోన్నత సమాజ నిర్మాత మొహమ్మద్‌ (స.అ.వ.) ప్రవక్తను ఆదర్శంగా తీసుకొని అల్లాహ్‌ ముందు శిరస్సు వంచాలి. ప్రతి నమాజులోను ప్రపంచ శాంతిసౌభాగ్యాలను కాంక్షించాలి. అందరి దువాలు అల్లాహ్‌ ఆలకించును గాక. ఆమీన్‌.

షేక్‌ బషీరున్నీసా బేగం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని