సౌందర్యారాధన

సుందర దృశ్యానికి స్పందించని వారంటూ ఉండరు. బీజరూపంలోనో, పరిణత స్థితిలోనో- అందరూ సహజ సౌందర్య దృష్టి కలిగి ఉంటారు. ఏదో ఒక విధమైన సౌందర్యం ప్రతి మనిషినీ కదిలిస్తుంది.

Published : 24 Mar 2023 00:42 IST

సుందర దృశ్యానికి స్పందించని వారంటూ ఉండరు. బీజరూపంలోనో, పరిణత స్థితిలోనో- అందరూ సహజ సౌందర్య దృష్టి కలిగి ఉంటారు. ఏదో ఒక విధమైన సౌందర్యం ప్రతి మనిషినీ కదిలిస్తుంది. కొందరు చక్కని ప్రకృతి దృశ్యాలకు చలించవచ్చు. కొందరు వ్యక్తుల సౌందర్యానికి ఆకర్షితులు కావచ్చు. మరికొందరు ఉదాత్తశీల ప్రభావానికి ముగ్ధులు కావచ్చు. ప్రతి మనిషికీ ఈ రీతిగా సుందరమైన వస్తువులపై, రూపాలపై ఆకర్షణ ఏర్పడుతుంది. అందం అనగానే చాలామందికి స్ఫురించేటట్లు శారీరకమే కాదు-  అది మానసికమూ కావచ్చు, నైతికమూ కావచ్చు. శారీరకంగా సౌందర్యం లేకపోయినా, వ్యక్తిత్వం గుణగణాలు మనుషులకు సౌందర్యాన్ని ఆపాదిస్తాయి.

అందమైనవన్నీ ఉపయోగకరం కాకపోవచ్చు. విఖ్యాత సౌందర్య నిలయాలుగా ప్రశంసలనందుకున్నవి ఎన్నో ఉన్నాయి. చక్కగా మలిచిన, చెక్కిన, గీసిన వస్తువులు కళాసంపదకు మచ్చుతునకలుగా ఉన్నాయి. వాటివల్ల ప్రయోజనం లేకపోయినా అవి మానవుడి సౌందర్యభావానికి చెక్కుచెదరని రూపం దిద్దుకుని ఉంటాయి. అందమైనవన్నీ పవిత్రమైనవి కానక్కర్లేదు. ఉదాత్తమైన విషయాలు కొన్ని సుందరమన్న భావం వెంటనే కలగకపోవడానికి కారణం- మంచివాటికి, పవిత్రమైనవాటికి ఆకర్షణ లక్షణాలు లేకపోవడమే. భయంగొలిపే శార్దూలానికీ మనోహరరూపం, శారీరక లక్షణాలు ఉంటాయి. వెరపుగూర్చే మెరుపూ సుందరంగా ఉంటుంది. యుద్ధరంగం బీభత్సంగా ఉన్నా రకరకాలుగా తీర్చిదిద్దిన సైనిక విన్యాసం చూడముచ్చటగా ఉంటుంది.

సుశిక్షితమైన శీలంలోనో, ఆచరిస్తున్న సత్యంలోనో మనలోని వ్యక్తిత్వం దాగి ఉంటుంది. అవ్యక్తం ప్రకాశంలో లీనమయ్యేటట్లు చేసే గుణమే సౌందర్యం. చిత్రకారుడు సూర్యాస్తమయ శోభను తిలకిస్తూ తన్నుతాను మరిచిపోతాడు. అతడు సౌందర్యారాధకుడు. కన్నపాప మొగం చూస్తూ సర్వస్వం మరిచే తల్లి ఆ సమయంలో సౌందర్యసాక్షే. ఇక్కడ ప్రయోజనానికి, నీతికి చోటులేదు. అది అనాలోచితమైన, నిర్హేతుకమైన తన్మయానందం.

ఉదాత్తస్థాయిలో సౌందర్యం భౌతికమైనది కాదు. అది ఉన్నతమైన మేధకు, తత్వానికి సంబంధించినది. ఆనందానుభవం ఓ నిశ్చలసమాధి వంటిది. అది భావనలో తెచ్చుకున్న తెలివైన ఊహ కాదు. మనోవికారమూ కాదు. గాఢంగా అనుభవించి అనుభూతిలోనికి తెచ్చుకొని పొందే తన్మయత్వమే నిజమైన సౌందర్యదర్శనం. సౌందర్యపు తన్మయానుభూతి మూగవాడి మధురానుభూతిలాగా ఉంటుంది. అతడు ఆనందించగలడు గాని వర్ణించలేడు. దివ్యమైన తేజస్సు నేత్రాలను మూసివేస్తుంది. ఆత్మను ప్రకాశింపజేస్తుంది. కన్ను చూడలేదు. ఆత్మ ఆనందిస్తుంది. సుందరమూర్తియైన పరమేశ్వరుడి స్వయంప్రకాశంకంటే సౌందర్య వ్యక్తీకరణ ఏముంది? ప్రపంచంలోని మొత్తం సౌకుమార్యం, ఉదాత్తత, మాధుర్యం, సమస్త ప్రియత్వం, ఆత్మవశీకరణ- పరమేశ్వరుడి దివ్యమంగళ సౌందర్యంలోనే ఇమిడి ఉన్నాయి. భగవత్‌ సౌందర్యమొక్కటే శాశ్వతమైనది.

డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు