గుణదోషాలు

మనిషి మనసు నిరంతరం మంచి-చెడుల మధ్య కొట్టుమిట్టాడుతుంటుంది. ఒక్కొక్కప్పుడు మంచివైపు మొగ్గుతుంది. మరొకప్పుడు చెడువైపు మొగ్గుతుంది. స్వార్థానికి దాసుడైనవాడు తన చెడును కూడా మంచిగా సమర్థించుకుంటాడు. విద్యావంతుడు, సంస్కారి, వివేకశీలి, జ్ఞాని ఎక్కడ మంచిని గ్రహించినా స్వీకరిస్తాడు. చెడును దూరంగా ఉంచేస్తాడు.

Published : 25 Mar 2023 00:13 IST

నిషి మనసు నిరంతరం మంచి-చెడుల మధ్య కొట్టుమిట్టాడుతుంటుంది. ఒక్కొక్కప్పుడు మంచివైపు మొగ్గుతుంది. మరొకప్పుడు చెడువైపు మొగ్గుతుంది. స్వార్థానికి దాసుడైనవాడు తన చెడును కూడా మంచిగా సమర్థించుకుంటాడు. విద్యావంతుడు, సంస్కారి, వివేకశీలి, జ్ఞాని ఎక్కడ మంచిని గ్రహించినా స్వీకరిస్తాడు. చెడును దూరంగా ఉంచేస్తాడు.

పిడికిలి ఎంత పరిమాణంలో ఉంటుందో దాదాపు గుండె కూడా అంతే పరిమాణంలో ఉంటుంది. పుట్టిన పసిబిడ్డ పిడికిలి మూసుకునే ఉంటుంది. ఏదైనా పట్టుకోవడానికే ఈ ప్రపంచంలోకి వచ్చానని దాని సంకేతం. ఆ పిడికిలి తెరిచి మంచినే పట్టుకోవడమన్నది తల్లిదండ్రులిచ్చే శిక్షణపై ఆధారపడి ఉంటుంది. అలాగే గుండె తలుపులు తెరుచుకుంటేనే జ్ఞానాన్ని స్వీకరించే అవకాశం ఉంటుంది. గుణాలు అంటే సద్గుణాలనే అర్థం. గుండె వీటినే ఆహ్వానించాలి. అవగుణాలంటే దోషాలు. ఆ దోషాలను విసర్జించాలి.

మనిషి సద్గుణాలని తెలిసినా జీవితంలోకి తేలిగ్గా వాటిని ఆహ్వానించలేడు. నీరు పల్లంవైపే ప్రవహించినట్లు మనసు చెడు వైపే లాగుతుంటుంది. మనిషిని సప్త వ్యసనాల్లో ఏదో ఒకటి ప్రలోభపెడుతుంది. పరస్త్రీ వ్యామోహం, జూదం, వేట, మద్యపానం, వదరుబోతుతనం, నేరాన్ని మించి శిక్షించడం, పూర్వీ కులు సంపాదించి ఇచ్చిన ధనాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగపర చడం- ఈ సప్త వ్యసనాల్లో ఏదో ఒకదానికి బానిసలై కష్టాలను కొని తెచ్చుకున్నవాళ్లెందరో ఉన్నారు. రావణుడు, కీచకుడు, దక్షప్రజాపతి, దుర్వాసుడు, శిశుపాలుడు, హిర ణ్యాక్ష, హిరణ్యకశిపులు, దుర్యో ధనుడు, బలి, కంసుడు... ఇలా ఎందరో ఏదో ఒక దుర్లక్షణానికి దాసులై అనేక కష్టనష్టాలకు బలైపోయినవారే!

మనిషి మూడు ‘ద’కారాలను ఎప్పుడూ గుర్తుచేసుకుంటే చాలు- దేహభక్తి, దేశభక్తి, దైవభక్తి. ధర్మసాధన చేయాలంటే శారీరక స్వస్థత ముఖ్యం. దేహం ఆత్మకు గేహం(ఇల్లు). పరమాత్మలో కలిసిపోయేందుకు తపించేది ఆత్మ. శరీరం ఆరోగ్యంగా ఉంటేనే కదా, ఏదైనా పుణ్యకార్యం చేయగలిగేది. తరవాత దేశభక్తి. సమాజహితం, పరోపకారం, లోకకల్యాణం, మానవతా దృక్పథం,  పారమార్థిక చింతన- ఇవన్నీ దేశభక్తికి సంబంధించినవి.  మూడోది దైవభక్తి. చిత్తశుద్ధి ఏకాగ్రత, శ్రద్ధ, అపేక్షారాహిత్యం- ఇవి భక్తికి ఉండవలసిన లక్షణాలు. ఆరొంతులు మానవ ప్రయత్నం జరగాలి. ఏడోవంతే దైవభక్తి. ఈ కలియుగంలో ‘నామస్మరణ’ను మించిన ఆధ్యాత్మిక యాగం లేదు. అది కూడా చేయలేని దౌర్భాగ్యస్థితికి మనిషి దిగజారకూడదు. పాపభీతి లేని ప్రవర్తన దుర్మార్గానికి తెరతీస్తుంది. సద్గ్రంథ పఠనం, సత్సాంగత్యం, ప్రవచన శ్రవణం, మంచి స్నేహం, ధర్మబద్ధమైన సంపాదన- ఈ సులక్షణాల వల్ల లోకంలో దుర్మార్గాల సంఖ్య తగ్గుతుంది. ‘పరులను పీడించడం మహాపాపం, పరోపకారం పుణ్యప్రదమైనది’ అని మహాభారతం చెబుతోంది. క్షీరనీరాలను వేరు చేయగల హంస నుంచి పాఠం నేర్చుకుంటే- మనిషి ఆదర్శవంతమైన జీవితం గడపగలుగుతాడు. ధర్మం నిర్వచనం గ్రహించగలిగితే గుణదోషాలు సులభంగా అవగతమవుతాయి.

చిమ్మపూడి శ్రీరామమూర్తి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని