ఆధ్యాత్మిక శక్తి

లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా మనుషులకు కలిగే భ్రమను వేదాంతం ‘లోకమాయ’ అంటుంది. అది తొలగిపోనంత కాలం, భౌతిక లోకంలో మనిషి అక్కడ సమస్యలనుకునే ఏ ఒక్కదానికీ పరిష్కారాలు ఉండవంటుంది. ఆ ప్రపంచంలో అతడు జీవితం అనుకుంటున్నది అశాశ్వతమని, శాశ్వతత్వం లేని దేనికోసమైనా శ్రమించడం నిష్ప్రయోజకమని తెలుసుకొమ్మంటుంది.

Published : 27 Mar 2023 00:48 IST

లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా మనుషులకు కలిగే భ్రమను వేదాంతం ‘లోకమాయ’ అంటుంది. అది తొలగిపోనంత కాలం, భౌతిక లోకంలో మనిషి అక్కడ సమస్యలనుకునే ఏ ఒక్కదానికీ పరిష్కారాలు ఉండవంటుంది. ఆ ప్రపంచంలో అతడు జీవితం అనుకుంటున్నది అశాశ్వతమని, శాశ్వతత్వం లేని దేనికోసమైనా శ్రమించడం నిష్ప్రయోజకమని తెలుసుకొమ్మంటుంది. అది తెలియాలంటే ముందుగా తన పుట్టుక, మరణం, ఆ తరవాత జరిగేదేమిటన్న విషయాలమీద ఆసక్తిని అతడు పెంచుకోక తప్పదంటుంది. అప్పుడే తానెవరన్నది తెలుసుకోగలడంటుంది.

మనిషి ఆలోచనలన్నీ తానుండే ప్రపంచం చుట్టూనే పరిభ్రమిస్తుంటాయి. కాలపరిమితులు లేని అనంత దివ్యత్వమైన బ్రహ్మమే భగవంతుడని, అదొక్కటే సత్యమనే వేదాంతుల మాటలు అతడికి బోధపడవు. తాను చూస్తున్న ప్రకృతి పరిసరాలనే ‘సత్యం’గా భావిస్తాడు. లౌకికమైన అటువంటి ఆలోచనలతో, సత్యశోధనకు వేదాంతులు కావాలనే బుద్ధీ మనసులపై ఆధిపత్యం అతడికి రాదు. వేదాంతం చెప్పే ఏ విషయం ప్రయోజనకరమైనదిగా అనిపించదు.
వేదాంతులనేవన్నీ అర్థం కావాలంటే మనిషి ఆధ్యాత్మికుడు కాక తప్పదు. అతడిలో ఆధ్యాత్మికత చిగురించడం ఆరంభమైతే- మానసిక స్థిరత, సమభావన, శారీరక బుద్ధిబలాలతోపాటు ఆత్మబలమూ సమకూరుతుంటుంది. అప్పటిదాకా జ్ఞానమని తాను అనుకుంటున్న దాన్ని మించిన జ్ఞానం ఉందని అతడు గ్రహిస్తాడు. అదీ తనకు అవసరమని తెలుసుకుంటాడు. ఆధ్యాత్మికత అతడి చేత తన అస్తిత్వపు లోతులు వెతికిస్తుంది. అహంకారానికి దూరమయ్యే ప్రయత్నాలు చేయిస్తుంది. దానికి దూరమవుతున్నకొద్దీ భగవంతుడికి దగ్గర అవుతుంటాడు. ‘అహం బ్రహ్మాస్మి’ అన్నమాట అర్థం కావడం మొదలవుతుంది. పాండురంగ భక్తుడైన నామదేవుడు ‘విఠలా! ఇన్నాళ్లూ నేనే నేను అనుకుంటున్నాను. గురువుల నుంచి పొందిన జ్ఞానంతో ఆ నేను నువ్వేనని తెలుసుకున్నాను’ అని తానే రచించి పాడిన ఒక పాటలో అంటాడు.

ప్రహ్లాదుడు జన్మతః ఆధ్యాత్మికుడు. అది నచ్చని తండ్రి చేతిలోనే హింసలెన్నో భరించాడు. అయినప్పటికీ ప్రహ్లాదుడి అణువణువులో తొణికిసలాడిన ఆధ్యాత్మికతే అతణ్ని రక్షించింది. దృఢమైన ఆధ్యాత్మిక సాధనలు చేసేవారికి భగవంతుడెప్పుడూ తోడుగానే ఉంటాడు. ఐహిక ప్రపంచం కలిగించే దృక్పథాలను మార్చుకునేందుకే ఆధ్యాత్మిక సాధనలు అవసరమవుతాయి. మహా వేదాంతి శంకరుడు చెప్పిన ‘తత్వమసి’ ఆ సాధనలన్నింటికీ పరాకాష్ఠ. అంతిమ సత్యమైన బ్రహ్మాన్ని చేరుకునేందుకు మనిషి చేయాలనుకునే ప్రయాణం ఆధ్యాత్మిక వాతావరణముంటేనే కాని ఆరంభమే కాదు. అది సృష్టించుకోవడం అతడి చేతిలోనే ఉన్న పని.

స్ఫూర్తిదాయకమైన విలువల్ని పాటించే వ్యక్తులు ఆధ్యాత్మికులయ్యేందుకు కష్టపడనక్కరలేదు. సమయపాలన, వేళకు నిద్రాహారాలు, సత్‌సాంగత్యం, సద్గ్రంథ పఠనం, భగవద్ధ్యానాలు వారు ఆచరించే కర్మానుష్ఠానాల స్థాయిని పెంచుతాయి. ఆధ్యాత్మికశక్తి లభించే వనరులు ఎక్కడున్నా అన్వేషించి తెలుసుకోవాలి. ఆధ్యాత్మికత అర్హులకే లభించగల జ్ఞానం అనుకోవడం అపోహ. ఉన్న సమయంలో అది ఏ కొద్దిపాటిదైనా, మనుషులంతా ఆధ్యాత్మికులై ఉండగలిగితే- మానవ పతనానికి కారణమవుతున్నవాటిని అడ్డుకునేందుకు మరోశక్తి అవసరం ఉండకపోవచ్చు.

జొన్నలగడ్డ నారాయణమూర్తి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు