ఆత్మగౌరవం

ఒక వ్యక్తి తనకు తాను ఇచ్చుకునే అత్యున్నత పురస్కారం ఆత్మగౌరవం. మిమ్మల్ని మీరు గౌరవించుకుంటేనే మీరు ఇతరులను గౌరవించగలుగుతారు. వ్యక్తిత్వం తాలూకు ఉన్నతత్వాన్ని వ్యక్తపరచేది ఆత్మగౌరవమే.

Published : 28 Mar 2023 00:20 IST

క వ్యక్తి తనకు తాను ఇచ్చుకునే అత్యున్నత పురస్కారం ఆత్మగౌరవం. మిమ్మల్ని మీరు గౌరవించుకుంటేనే మీరు ఇతరులను గౌరవించగలుగుతారు. వ్యక్తిత్వం తాలూకు ఉన్నతత్వాన్ని వ్యక్తపరచేది ఆత్మగౌరవమే. వ్యక్తి బాహ్యచర్యలను  శాసించేది, నిర్ధారించేది ఆత్మగౌరవమే. ఆత్మగౌరవం గల వ్యక్తులు ఏర్పరచుకునే మానవ సంబంధాలు చీకటిలో దీపం పరచే వెలుగులా ప్రకాశిస్తాయి. ఆత్మగౌరవం గల వ్యక్తులు తమతో తాము పరిచయం పెంచుకుంటారు, తాము ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు అంటారు సోక్రటీస్‌. ఆత్మగౌరవం గలవారు విలువలకు కట్టుబడతారు. మంచిశ్రోతగా ఎదుటి వారు చెప్పేది వింటారు. తమ ప్రవర్తనతోనే ఎదుటివారిలో పరివర్తన తెస్తారు. ఎంతమందిలో ఉన్నా ప్రత్యేకంగా కనిపిస్తారు. అలాంటి అరుదైన వ్యక్తుల్లో అబ్దుల్‌ కలాం ఓ ఆణిముత్యం. స్వచ్ఛమైన తామర పువ్వులా వికసించిన వ్యక్తిత్వం ఆయనది.

ఆత్మగౌరవంగల వ్యక్తులు ఎలాంటి వారితోనైనా కలిసిపోతారు. కానీ ఎల్లప్పుడూ ఆత్మగౌరవ స్పృహ కలిగి ఉంటారు. చులకన చేస్తే అంతే త్వరగా విడిపోయి, మౌనంగా దూరంగా వెళ్ళిపోతారు. ఆత్మగౌరవం ఉన్న వ్యక్తులే ఆపన్న హస్తం అందించడానికి ముందుకొస్తారు. నిస్వా ర్థమైన సేవా తత్పరతతో తరతమ భేదాలకు అతీతంగా మానవ సంబంధా లకు పెద్దపీట వేస్తారు. తమలోని ప్రత్యేకతను గుర్తించి దాన్ని పదిమంది శ్రేయస్సుకు ఉపయోగించేవారు ఆత్మ గౌరవం కలిగిన వ్యక్తులే.
ఆత్మగౌరవం గల వ్యక్తుల్లో ఆత్మ స్థైర్యం, నమ్మకం ఎక్కువగా ఉంటాయి. ఆ నమ్మకాన్ని అపజయాలకు, అన్యా యం, అక్రమాలకు బలి చేయరు. తమ నమ్మకాన్ని బతికించుకునే ప్రయత్నం చేస్తారు. అపజయాలు ఎదురైనా అవి తాత్కాలికమే అనుకుని ముందంజ వేస్తారు. ఓటమిని ఓడించి  విజేతలయ్యేందుకే కృషి చేస్తుంటారు. ఆత్మగౌరవం కలిగిన వ్యక్తులు, సాధించిన విజయాలతో సంతృప్తి చెందరు. నిరంతరం ప్రయత్నిస్తూ, శ్రమిస్తూనే ఉంటారు. లక్ష్యం మారినా గమ్యాన్ని విస్మరించరు. ప్రేమించే హృదయం, స్పందించే మనసు, పని చేసే చేతులు ఆత్మగౌరవానికి ప్రతీకలు అంటారు స్వామి వివేకానంద.

ఆత్మగౌరవానికి ఆత్మజ్ఞానానికి ప్రత్యక్ష సంబంధం ఉంది. ఆత్మగౌరవం ఉన్న వ్యక్తులు ఆత్మజ్ఞానం వైపు దృష్టి సారిస్తారు. దేనినైనా స్వీకరించినంత తొందరగా త్యజించనూ గలరు. గౌతమ బుద్ధుడు, రమణ మహర్షి, వివేకానంద, జిడ్డు కృష్ణమూర్తి వంటివారు ఆత్మగౌరవానికి ఆత్మజ్ఞానాన్ని అనుసంధానం చేసుకొని మనమధ్యే సంచరించిన యోగులు.
ఆత్మగౌరవం ఒకరు ఇస్తే వచ్చేది కాదు. మరొకరిని చూసిన ప్రేరణతో లభించేది కాదు. ఆత్మగౌరవం ద్వారా ఆత్మజ్ఞానం పొందిన యోగులు తరతమ భేదాలకు అతీతంగా సృష్టిలో ఏ ప్రాణితోనైనా బంధాలు ఏర్పరచుకుంటారు, సంభాషిస్తారు, ఆదరిస్తారు. ఆత్మగౌరవం ద్వారా ఆత్మజ్ఞానం తద్వారా ఆధ్యాత్మిక జ్ఞానం సిద్ధిస్తాయని రామకృష్ణ పరమహంస బోధించారు.

 ఎం. వెంకటేశ్వరరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని