సహజ సిరులు

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నది సామెత. చాలామంది దాన్ని సంపదకు అన్వయిం చుకుంటారు. ఆ కారణంతో ధనార్జనకోసం ఎక్కువ తాపత్రయ పడతారు. అవసరం మేరకు సంపాదిం చిన ధనం మనల్ని రక్షిస్తుంది.

Published : 30 Mar 2023 00:42 IST

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నది సామెత. చాలామంది దాన్ని సంపదకు అన్వయిం చుకుంటారు. ఆ కారణంతో ధనార్జనకోసం ఎక్కువ తాపత్రయ పడతారు. అవసరం మేరకు సంపాదిం చిన ధనం మనల్ని రక్షిస్తుంది. అంతకుమించి ఆర్జించిన ధనాన్ని మనం రక్షించాలన్న వాస్తవాన్ని విస్మరిస్తారు. ఉన్నత విలువల్ని భావితరాలకు అందజేయడం, ప్రకృతి రమణీయతను కాపాడటం, శారీరక, మానసిక ఆరోగ్య సంరక్షణ వంటివే నిజమైన సంపదలన్న సంగతిని మనిషి గుర్తించాలి.
పసివాడి కల్మషంలేని నవ్వును ఏ సంపదతో కొనగలుగుతాం? సాటివ్యక్తి కష్టం చూసి గుండె ఆర్ద్రం కావాలి. దయ, జాలి వంటివి తోటివారితో పంచుకోగలిగే ఉత్తమ సంపదలే కదా. కాగితం, లోహం రూపాల్లో ఉన్న సంపదను మించిన సహజ సిరులు ఇవి మాత్రమే.

మనిషి ఆర్జించే సంపదలపై హక్కు చట్టపరంగా ఆ వ్యక్తికే ఉంటుంది. సృష్టిలో ఏ పదార్థమూ తనకంటూ దేన్నీ దాచుకోదు. పదుగురికి పంచడమే ప్రకృతి పరమార్థం. వాగు వంకా కలిసి నదులుగా మారతాయి. ఆ నదులన్నీ సముద్రంలోకి ప్రవహి స్తాయి. ప్రాణికోటి సంరక్షణ కోసం సముద్రం తనను తాను ఆవిరిగా మార్చుకుంటుంది. జలజలా కురి సిన వర్షం పుడమి గొంతుక తడుపుతుంది. భూమి సైతం తనకు లభించిన ఆ నీటిని దాచుకోదు. ఉప్పునీటిని తియ్యటి తాగునీరుగా మార్చి ఆ నీటికి సార్థకత చేకూరుస్తుంది.

పంచభూతాలను పరమాత్మకు ప్రతినిధిగా నిలిపింది వేద నాగరికత. సంపదపట్ల వ్యామోహం లేని రోజులవి. సత్యం, ధర్మం మాత్రమే వారికి తెలిసిన సిరులు. మనం స్వల్పంగా భావించే విషయాలు ఆనాటి మహర్షులకు గొప్పసంపదలు. వేకువఝాము ప్రశాంతతను ఉషస్సూక్తంగా పాడుకున్నారు. మండూకరావంలోని మాధుర్యాన్ని మాండుక్యోపనిషత్తుగా ఈ మహనీయుల వారసులమైన మనకు అందజేశారు. సృష్టిలోని అన్ని ప్రాణుల్లో మనిషి ఒకడు. తన మేధాసంపత్తితో భూమి మీద పెత్తనం చేస్తున్నాడు. అందుచేత అన్ని ప్రాణుల సౌకర్యాన్ని చూడవలసిన బాధ్యత మనిషిపైనే ఉంది.

సృష్టికర్త అనంతమైన ప్రకృతి అందాలతో భూమిని నిర్మించాడు. ఆకలి తీర్చేందుకు రుచికరమైన పళ్లను, దాహార్తి తీర్చేందుకు తియ్యటి మంచినీటిని సహజసిద్ధంగా ఏర్పాటు చేశాడు. మనం అవసరానికి మించిన సుఖలాలసులం అవుతున్నాం. శుభ్రతలేని చిరుతిండిని, కృత్రిమ ఆహారాన్ని తింటూ అనారోగ్యం పాలవుతున్నాం. మనిషి ఏ ధర్మాన్ని నిర్వహించాలన్నా శరీరాన్ని కలిగి ఉండాలి. తన ఉనికిని కాపాడుకుంటూనే ప్రకృతిలో పరమాత్మను దర్శించగలగాలి.

ధనార్జనాపరుడు సమాజంపట్ల, సహచరులపట్ల సానుకూల దృక్పథం కోల్పోకూడదు. ఈ నియమం పాటించనట్లయితే తానొక్కడే ప్రత్యేకమనుకొని తక్కినవారిని చిన్నచూపు చూసే దిశగా ఆ వ్యక్తి మనఃస్థితి చేరుకుంటుంది. అది మనిషి పతనానికి కారణం అవుతుంది. మనిషి మనుగడకు మూలం సంఘం అన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఆస్తుల్ని మించిన ఆప్తులు సమాజం, ప్రకృతి శక్తులన్న విషయాన్ని సదా మననం చేసుకోవాలి.

 గోలి రామచంద్రరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు