పెద్దలు దాచిన పెన్నిధి

ఆరోగ్యకరమైన ఆలోచనలు మనిషిని సన్మార్గం వైపు నడిపిస్తాయి. విధ్వంసకరమైనవి కంటికి నిద్రనీయక ధ్వంసరచన వైపు పురిగొల్పి పాతాళంలో పడవేస్తాయి. ఉవ్వెత్తున ఎగసిపడే ఊహలను నియంత్రించి మంచి చెడుల గుట్టు విప్పేదే బుద్ధి.

Updated : 01 Apr 2023 05:08 IST

ఆరోగ్యకరమైన ఆలోచనలు మనిషిని సన్మార్గం వైపు నడిపిస్తాయి. విధ్వంసకరమైనవి కంటికి నిద్రనీయక ధ్వంసరచన వైపు పురిగొల్పి పాతాళంలో పడవేస్తాయి. ఉవ్వెత్తున ఎగసిపడే ఊహలను నియంత్రించి మంచి చెడుల గుట్టు విప్పేదే బుద్ధి. పెడదారి పట్టక బుద్ధిని వెన్నంటి కాపాడేది జ్ఞానం. తెలివిని పెంచి, పంచే జ్ఞానాన్ని సాధన ద్వారా కైవసం చేసుకోవాలి. ధన సంపాదనకు శ్రమకోర్చి కొందరు పాటుపడతారు. దారుణాలకు, దుర్మార్గాలకు పూనుకొని ప్రాణాలు తీసేందుకైనా వెనకాడని నైజం మరికొందరిది. బతుకు గడిచేందుకు ధనం అవసరమైనా అంతకుమించిన సంపద మరొకటుందని తెలుసుకోని మనిషి డబ్బు చుట్టూ తిరుగుతున్నాడు. జ్ఞాన సంపద లభించిన మనిషే నిజమైన మనిషన్న సత్యాన్ని విస్మరిస్తున్నాడు. భోగవాంఛల్లో కూరుకుపోయి ఆలోచనా రహితులుగా మారేవారికి జ్ఞానం లభించదు. ముక్తి మోక్షాలకు సోపానం జ్ఞానస ముపార్జనే. అదే భగవంతుణ్ని చేరే మార్గమని గీతాచార్యుడి వాక్కు. పుట్టుకతో కొంతమేర జ్ఞానం లభించినా మెరుగులు దిద్ది ఉత్త ముడిగా మార్చే వ్యక్తులు దొరకడం ఒక వరం. అజ్ఞానాన్ని పోగొట్టే గురువులు, మంచి చెడులు బోధించే పెద్దలు, మిత్రులు, శ్రేయోభిలాషులు పెన్నిధులు. జ్ఞానం అనంత ప్రవాహం. అది తియ్యని అమృత ధార. దాన్ని ఒడిసిపట్టాలి. కడుపు నిండా నింపుకోవాలి. అందులో తడిసి ముద్దవ్వాలి. ప్రేమ అందించే గురు వులను, పెద్దలను ఆశ్రయించాలి. శుశ్రూష చేయాలి. కాలాన్ని వెచ్చించి సొంతం చేసుకోవాలి.

వారసులు అడిగే ప్రశ్న- పెద్దలు మాకేం ఇచ్చారని. తడుముకోని సమాధానం- అపార జ్ఞానసంపద. బాల్యంలో ఒడిలో కూర్చోపెట్టుకొని ముద్దుముద్దుగా వల్లె వేయించే శ్లోకాలు, శతకాలు, నీతి కథలు, గాథలు... బంగరు బాటలు పరచే నిధులే. పెరుగుతున్న కొద్దీ నేర్వవలసిన విద్యలు, సభ్యతా సంస్కారాలు, పెద్దల పట్ల కనబరచే వినయ విధేయతలు, ఎత్తి చూపే తప్పులను దిద్దుకొనే సామర్థ్యం, సమస్యలను పరిష్కరించే ప్రజ్ఞాపాటవాలు- మనకందించే అపురూప సంపదలే. వంశ మూలపురుషుల చిత్రపటాలు, ఆనాటి పరిశోధనా పత్రాలు, గత కాలపు నిర్మాణాలు, ఆర్జించిన కీర్తికిరీటాలు, వారి దానధర్మాలు, గౌరవ ప్రతిష్ఠలు... ఇవన్నీ తిరుగులేని సంపదలు.  తల్లిదండ్రులు మాకేం ఇచ్చారని ప్రశ్నించే ముందు, మనం వారికేం ఇస్తున్నామని ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? అంతులేని ప్రేమను, మమతను, త్యాగాన్ని పంచినవారికి వార్ధక్యంలో తిరిగి వాటిని అందిస్తున్నామా? చదువుసంధ్యలు, గౌరవ మర్యాదలు నేర్పి మనిషిగా నిలబెట్టినవారిని గౌరవిస్తున్నామా? కష్టాల కడలిని ఈది ఒడ్డుకు చేర్చినవారిని కడగండ్లపాలు చేస్తున్నామా, ఆదుకొంటున్నామా? నిజాయతీగా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి.

క్షణికమైన సంపదలకంటే తులలేని జీవన సంపదలను అందించిన పెద్దల్ని కంటిపాపల్లా నిరంతరం కాపాడుకోవాలి. మలిదశలో వారికి ఆనందం కలిగించాలి. అశాశ్వత నిధుల కోసం అర్రులు చాచి కోపంతో వారిని దూరం చేసుకొంటే మన భవిష్యత్‌ అగమ్యమే. మన సమస్యలను, చిరాకులను చిరునవ్వుతో అర్థం చేసుకొని చిటికెలో చిక్కుముడులు విప్పే అనుభవమూర్తులైన మన పెద్దలే మనకు అసలైన పెన్నిధి.

మాడుగుల రామకృష్ణ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని