చిటికెడు సాధన

వామనుడు కురచవాడు. అవసరమైనప్పుడు విరాట్‌స్వరూపుడయ్యాడు. అగస్త్యుడు పొట్టివాడు. పర్వతాల మెడలువంచి నిలువరించాడు. మర్రి విత్తనం చాలా చిన్నది. ఎవరూ నీళ్లుపోసి పెంచకపోయినా కాసింత మట్టి, కూసింత నీరు తగిలితే చాలు- మొలకెత్తి మహా వృక్షమైపోతుంది.

Updated : 02 Apr 2023 02:24 IST

వామనుడు కురచవాడు. అవసరమైనప్పుడు విరాట్‌స్వరూపుడయ్యాడు. అగస్త్యుడు పొట్టివాడు. పర్వతాల మెడలువంచి నిలువరించాడు. మర్రి విత్తనం చాలా చిన్నది. ఎవరూ నీళ్లుపోసి పెంచకపోయినా కాసింత మట్టి, కూసింత నీరు తగిలితే చాలు- మొలకెత్తి మహా వృక్షమైపోతుంది. చిన్న నీటిచుక్కగా భూమిలోంచి ఉబికివచ్చిన నది, ప్రవహించి ప్రవహించి మహానదియై విస్తరిస్తుంది. లోకంలో అల్పదశనుంచి అనల్పదశకు ఎదగడం, విస్తరించడం సహజమే. ప్రకృతిలోని ప్రతి అంశంలో, ప్రతి దశలో ఈ పరిణామం ఉంది. మన సాధనకూ ఈ అంశాన్ని అన్వయించవచ్చు.

భగవద్భక్తి మీకలవాటు లేదు. అవగాహనా లేదు. అయితే జీవితాన్ని చరితార్థం చేసుకోవాలని, తరించిపోవాలని ఆశ అయితే ఉంది. మీరేం చేయాలి? ఎంతైనా చేయవచ్చు. తీవ్రమైన దాహంతో బాధపడేవాడు మినరల్‌ వాటర్‌ కోసం చూడడు. వెండిగ్లాసుకోసం వెదకడు. ఏది దొరికితే అది. ఏ నీళ్లు అందుబాటులో ఉంటే అవి. సాధనకూడా అంతే... ఉన్నపాటున మనకు సరైన గురువు లభ్యం కాకపోవచ్చు. మనకు ఏది గురి అయిన సాధనో ఎవరూ చెప్పకపోవచ్చు. ఫరవాలేదు. శివుడికి అభిషేకం చేద్దామనుకున్నప్పుడు- కాశీలోని విశ్వనాథుడు ఉన్నపాటున అందుబాటులోకి రాడు. దారిలో దొరికిన ఏ గుండ్రటి రాయినో శివుడిగా భావించినా సరిపోతుంది. శివభక్తుడైన ఒక రాజు శివార్చన సమయానికి ఒక వేశ్య సమక్షంలో ఉంటాడు. సమయానికి శివలింగం, కనీసం శివలింగాకారంలోని మరే వస్తువైనా కనిపించవు. అప్పుడు నిద్రిస్తున్న వేశ్య వక్షోజాన్ని శివలింగంగా భావించి అర్చన చేస్తాడు. ఇక్కడ వస్తు ప్రధానం కాదు... భావ ప్రధానం. మనం భక్తిని ఒక్కసారిగా ఆచరించలేం. నిర్వహించలేం. నిభాయించలేం. క్రమ పద్ధతి ఉత్తమమైనది. పరిణామ క్రమం ఉత్తమమైనది. అందుకే మనకు అర్థమైన అందుబాటులోకి వచ్చిన సాధన- అది ఎంత చిన్నదైనా- చేస్తూ పోవాలి. చీమ చక్కెర కణాన్ని మాత్రమే మోయగలదు. లడ్డు మోయలేదు. చాలు. దాని ఆకలికి, శక్తికి అది చాలు. కడుపు నిండుతుంది. మన భక్తి కూడా అంతే. తేనెటీగలు చుక్క చుక్క తేనెను, భక్తి మకరందాన్ని సేకరించుకుంటాయి. సమర్పణ చేసుకుంటాయి. భగవంతుడు చూసేది పరిమాణం కాదు... ప్రమాణం. రుక్మిణీదేవి తూకానికి వేసిన తులసిదళంతో, కుచేలుడు తినిపించిన అటుకుల్లో, విదురుడందించిన పండు తొక్కలో భగవంతుడు చూసింది ఆ ప్రకారంగానే. అందుకే మనం అర్థమైన, అందుబాటులోకి వచ్చిన చిన్న సాధననే అనుసరిద్దాం. ఆచరిద్దాం. వేళ్లు తెగిన చేతులతో అర్ధ నమస్కారం పెట్టినా దేవుడు కరుణిస్తాడు. వీలు కానప్పుడు, అశక్తులమైనప్పుడు అంతకంటే సాధన అవసరం లేదు. చిన్న సాధన చాలు. చిటికెడు సాధన చాలు. అదే పెద్దదవుతుంది. ఉద్ధృతమవుతుంది.

ధ్యేయం ఒకటే అయినా సాధనలు వేరు వేరు. చిన్నది, పెద్దది, సుసాధ్యమైనది, అసాధ్యమైనది, మనసుకు అనుకూలమైనదే మనకు అందుబాటులోకి వచ్చినదే మన సాధన... సాధించవలసినది. అది కూడా మంత్రమా, జపమా, హోమమా, ధ్యానమా? పేరుతో సంబంధం లేదు. ఆ ప్రక్రియ తీసుకునే సమయంతో సంబంధం లేదు. దానికి సంబంధించిన సంబారాల విలువతో సంబంధం లేదు. చేయవలసినది చేస్తూ పోవడమే. అందుకోలేమనే సందేహానికి ఆస్కారమే లేదు. ఇది పరుగుపందెం కాదు. పరమపథం. ప్రయత్నం ప్రారంభించిన మొదటి క్షణానే గెలుపు ఖాయమవుతుంది.

చక్కిలం విజయలక్ష్మి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని