బాల్యం వికసిస్తేనే...

శైశవం, బాల్యం, కౌమారం, యౌవనం, గార్హస్థ్యం(గృహస్థాశ్రమం), వానప్రస్థం- ఇవి మానవ జీవన దశలు. వీటిలో బాల్యం ఎంతో కీలకమైంది. బంగారు భవిష్యత్తుకు పునాది పడేది బాల్యావస్థలోనే. బాల్యదశను చక్కగా మలచే బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంది. పిల్లవాడు మంచిగా ప్రవర్తిస్తే...

Published : 09 May 2023 00:43 IST

శైశవం, బాల్యం, కౌమారం, యౌవనం, గార్హస్థ్యం(గృహస్థాశ్రమం), వానప్రస్థం- ఇవి మానవ జీవన దశలు. వీటిలో బాల్యం ఎంతో కీలకమైంది. బంగారు భవిష్యత్తుకు పునాది పడేది బాల్యావస్థలోనే. బాల్యదశను చక్కగా మలచే బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంది. పిల్లవాడు మంచిగా ప్రవర్తిస్తే చూసినవారు అతడి తల్లిదండ్రుల్ని ప్రశంసిస్తారు. అభినందిస్తారు. పిల్లవాడి ప్రవర్తన సరిగ్గా లేకపోతే తల్లిదండ్రుల్ని నిందిస్తారు. బాలుడికి మొదట మాట నేర్పేది తల్లి. నడత నేర్పేవాడు తండ్రి. సంస్కారం, చదువుతో తీర్చిదిద్దేవాడు గురువు. ఈ ముగ్గురి మాట వింటూ సర్వదా వారిని గౌరవించే పిల్లవాడు ఇటు కుటుంబంలోను, అటు సమాజంలోను పేరు ప్రఖ్యాతులు పొందగలుగుతాడు. బాలుడే కాదు, బాలికైనా అంతే!

రామాయణ, భారత, భాగవతాలలోను, అష్టాదశ పురాణాలలోను ఇందుకు ఉదాహరణలు కోకొల్లలుగా కనిపిస్తాయి. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు వసిష్ఠ, విశ్వామిత్రుల వద్ద సకల విద్యలూ అభ్యసించారు. అనేక సందర్భాల్లో శిష్యులుగా వారి వినయ విధేయతలు ఎంతో ముచ్చట కలిగిస్తాయి. లవకుశులు తల్లి సీతమ్మను ఎంతగా ప్రేమించారో, వాల్మీకి మహర్షిని అంత గొప్పగానూ గౌరవించి విద్య నేర్చుకున్నారు. భారతంలో పాండవులు భీష్మ, ద్రోణాచార్యుల వద్ద ఎన్నో విద్యలు నేర్చుకున్నారు. వారి వినమ్రతకు గురువులు పొంగిపోయేవారు. అభిమన్యుడు తల్లి ఉత్తర గర్భంలో ఉండగానే పద్మవ్యూహ ప్రవేశ విధానం తెలుసుకున్నాడు. అందులోంచి తిరిగి వచ్చే మెలకువలు తెలియకపోయినా- తన ధీరత్వం, శౌర్యం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాడంటే, అతడి తల్లిదండ్రులు ధన్యులని శ్లాఘించకుండా ఉండగలమా? ప్రహ్లాదుడు తల్లి లీలావతి గర్భంలో ఉన్నప్పుడే నారద మహర్షి నుంచి శ్రీహరి నామ మాహాత్మ్యం తెలుసుకుని పరమభక్తుడైనాడు. ధ్రువుడు తల్లి పొందిన అవమానం చూసి, కుంగిపోయి అడవులకు వెళ్ళాడు. నారద మహర్షి ఉపదేశించిన ద్వాదశాక్షరీ మంత్రంతో తీవ్ర తపస్సు చేసి, రాజ్యపాలన సాగించి- చివరకు ధ్రువమండలానికి వెళ్ళి భాసిల్లాడు.
శ్రీకృష్ణుడు బాల్యంలోనే అసమానమైన, అనంతమైన లీలలు చూపి, ఆర్తులను ఆదుకున్నాడు. పరమ శివ భక్తుడైన మార్కండేయుడు తల్లిదండ్రుల శివభక్తి ప్రపూరితమైన బోధలకు ప్రభావితుడై పరమేశ్వరుడి సాక్షాత్కారం పొంది చిరంజీవి అయినాడు. ఆదిశంకరులు పిన్నవయసులోనే సన్యాసం స్వీకరించి లోకానికి అద్భుతమైన ఆధ్యాత్మిక సంపదనందించి జగద్గురువుగా లోకవంద్యులైనారు.
ఛత్రపతి శివాజీకి తల్లి జిజియా బాయి రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలలోని ఆదర్శవంతమైన గాథలు వినిపించి యోధుణ్ని చేసింది. బ్రహ్మనాయుడు... తనయుడైన బాలచంద్రుడికి బాల్యంనుంచే పోరాట పటిమ బోధించాడు. గణపతి దేవుడు కూతురు రుద్రమదేవికి బాల్యంలోనే పురుష వేషం ధరింపజేసి యుద్ధ విద్యలన్నీ నేర్పించాడు.

నేడు ఎందరో బాలమేధావులు తల్లిదండ్రులు, గురువుల ప్రోత్సాహం, శిక్షణలతో వెలుగులోకి వస్తున్నారు. సంగీతం, నృత్యం, శిల్పం, చిత్రలేఖనం, నటన, ఇంద్రజాలం, మూకాభినయం, వక్తృత్వం, కవిత్వం లాంటి అనేక కళలలో అతిపిన్న వయసులోనే నిష్ణాతులవుతున్నారు. పిల్లలను తీర్చిదిద్దడంలో పెద్దలదే గురుతర బాధ్యత. బాల్య కుసుమం వికసిస్తే ఆదర్శ వ్యక్తిత్వ పరిమళం విశ్వమంతటా పరివ్యాప్తమవుతుంది.

చిమ్మపూడి శ్రీరామమూర్తి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని