నిరంతర పరీక్షే జీవితం

పిల్లలు విద్యల్లో రాణించి ఉన్నత స్థితికి చేరాలని బడికి పంపుతారు తల్లిదండ్రులు. ఒక్కొక్క తరగతి ఉత్తీర్ణులై ముందుకు సాగుతుంటే కన్న వారి ఆనందం వర్ణనాతీతం. చదువుల్లో అసాధారణ ప్రజ్ఞను కనబరచేవారు కొందరైతే, ఒంటపట్టక దూరమయ్యేవారు ఇంకొందరు.

Published : 10 May 2023 01:07 IST

పిల్లలు విద్యల్లో రాణించి ఉన్నత స్థితికి చేరాలని బడికి పంపుతారు తల్లిదండ్రులు. ఒక్కొక్క తరగతి ఉత్తీర్ణులై ముందుకు సాగుతుంటే కన్న వారి ఆనందం వర్ణనాతీతం. చదువుల్లో అసాధారణ ప్రజ్ఞను కనబరచేవారు కొందరైతే, ఒంటపట్టక దూరమయ్యేవారు ఇంకొందరు. విద్యార్థుల్లోని మేధను విశ్లేషిస్తూ గుణదోషాలను ప్రకటించే ప్రక్రియ పరీక్ష. అందులో ఉత్తీర్ణులు కావాలన్నదే అందరి కోరిక. విద్యార్థి దశ కీలకం. అది భావి జీవితానికి పునాది. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి మహాపురుషులూ సామాన్య విద్యార్థుల్లా గురుకులాల్లో చేరి విద్యనభ్యసించారు. వినయంతో నేర్చిన విద్యలు వారి వ్యక్తిత్వాన్ని, రుజు ప్రవర్తనను, పాలనాధికారాన్ని లోకానికి చాటి చెప్పాయి.

జీవితంలో స్థిరపడి విశాల ప్రపంచంలోకి అడుగు పెట్టగానే కొత్తరకం పరీక్షలు మొదలవుతాయి. ఇవి నిరంతరం కొనసాగుతూ ప్రశ్నల వర్షం కురిపిస్తాయి. ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. సమస్యలతో చుట్టుముడతాయి. తట్టుకొని నిలబడాలి. వాటితో రణానికి సిద్ధపడాలి. చిక్కుముడులు విప్పాలి. ఇందులో ఎవరికీ మినహాయింపు లేదు. అందరూ ఎదుర్కోవాల్సిందే. బోధించే గురువులుండరు. కాగితాలపై సమాధానాలు రాయనక్కరలేదు. గణన చేసి ఎవరూ ఎవరినీ ఉత్తీర్ణుల్ని చేయరు, ఓటమిపాలు చేయరు. ఎవరికి వారే గురువులుగా మారాలి. శిష్యులుగా సమాయత్తం కావాలి. సమాజ అధ్యయనం, మనస్తత్వ పరిశోధన, లౌకిక వ్యవహార నిర్వహణ వంటి పాఠాలను రోజూ చదవాలి. నీపై దృష్టి నిలిపేవారిని నువ్వు క్షుణ్నంగా పరిశీలించాలి. వ్యక్తులను బేరీజు వేయాలి. వారి ప్రవర్తనను త్రాసులో తూచాలి. లోక సంబంధ వ్యవహారాల పట్ల అవగాహన కలిగి ఉండాలి. అనుక్షణం ఎదురయ్యే ప్రతి సమస్యా ఒక పరీక్షే. ప్రతికూలాంశాలను నేర్పుతో, ఓర్పుతో అనుకూలంగా మార్చుకోవాలి. ఆలోచన, అవగాహన, అనుభవం, ముందుచూపు వంటి సూత్రాలను అందుబాటులో ఉంచుకోవాలి. తెలివితో ఇతరుల్ని ఒప్పించి మెప్పించి సమాధానపరచాలి. సున్నితమైన, అంతే కఠినమైన ఆర్థిక సంబంధ చిక్కులను నేర్పుతో విడదీయాలి. అలాంటివారే ఈ పరీక్షల్లో విజేతలుగా నిలుస్తారు.
లౌకిక సమస్యలతో సతమతమవుతున్న మనిషి స్థైర్యాన్ని ధైర్యాన్ని మరింత శోధించి, సాధించేందుకు అంతర్యామి విధించే పరీక్షలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. నవ్వేవారిని ఏడిపిస్తాడు. ఏడ్చేవాణ్ని నవ్విస్తాడు. సిరిసంపదలను, భోగభాగ్యాలను తారుమారు చేస్తాడు. ఆ లీలలు విచిత్రం. భక్తుల మనోబలం, స్థిరబుద్ధి దృఢమో కాదోనన్న కఠిన పరీక్ష. నమ్మినవారికి, దరిచేరినవారికే ఈ పరీక్షలు. తన భక్తుల అనన్య భక్తిని, అచంచల విశ్వాసాన్ని దెబ్బతీసేలా పరీక్షలు పెట్టేవాడు దత్తాత్రేయుడు. తట్టుకోలేని సామాన్యులు పలాయనం చిత్తగించేవారు. నిశ్చలబుద్ధితో, అర్పణదీక్షతో ఎవరైతే కడదాకా నిలిచేవారో వారిని అక్కున చేర్చుకొనేవాడు స్వామి. ఏడేడు జన్మల్లో వెంటాడి కాపాడేవాడని దత్తపురాణం చెబుతోంది. పరీక్షలంటే భయపడేవారిని ఆ పరీక్షలెప్పుడూ భయపెడతాయి. సమస్యలకు భయపడి బాధపడితే అనుకున్నవి సాధించలేం. ఎదుర్కొనే సామర్థ్యాన్ని ప్రతిక్షణం పెంచుకుంటూ పోవాలి. మనిషి నిరంతర విద్యార్థి. జ్ఞానసముపార్జన అతడి లక్ష్యం. లోకోపకారమే అతడి ధ్యేయం. సంఘ స్వరూప స్వభావాలను, సమాజ స్థితిగతులను జీర్ణం చేసుకోవాలి. సమాజ సుస్థిరతకు న్యాయధర్మాలను బలపరచాలి. ఎదురయ్యే ప్రతి పరీక్షను ఎదుర్కొని విజయం సాధించాలి. ఓటమిపాలైనా దిగులుచెందక మళ్ళీమళ్ళీ ప్రయత్నించాలి.

మాడుగుల రామకృష్ణ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని