శంకర మానస పూజ

ఇష్టదైవానికి భక్తుడు చేసే పూజ రెండు విధాలు. ఒకటి పూజాద్రవ్యాలతో చేసేది. మరొకటి మానసికంగా చేసేది. ఎవరికి తోచిన రీతిలో వారు ఏ పద్ధతిలో అయినా పూజ చేయవచ్చు. సకల దేవతలను పూజించే పద్ధతులను, స్తోత్రాలను రచించి లోకానికి అందించిన శంకర భగవత్పాదులు మానస పూజకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన రచించిన అమోఘస్తుతి ‘శివానందలహరి’.

Published : 11 May 2023 00:38 IST

ష్టదైవానికి భక్తుడు చేసే పూజ రెండు విధాలు. ఒకటి పూజాద్రవ్యాలతో చేసేది. మరొకటి మానసికంగా చేసేది. ఎవరికి తోచిన రీతిలో వారు ఏ పద్ధతిలో అయినా పూజ చేయవచ్చు. సకల దేవతలను పూజించే పద్ధతులను, స్తోత్రాలను రచించి లోకానికి అందించిన శంకర భగవత్పాదులు మానస పూజకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన రచించిన అమోఘస్తుతి ‘శివానందలహరి’. ఆ స్తోత్రంలో శివుణ్ని ఎలా పూజించాలో విశదం చేశారు.  

‘ఓ పరమేశ్వరా! బంగారంతో నిండిన మేరు పర్వతం నీ చేతిలో ఉంది. ముల్లోకాల్లోనే గొప్ప ధనవంతుడైన కుబేరుడు నీ పాదాలను అర్చిస్తున్నాడు. కల్పవృక్షం, కామధేనువు, చింతామణి నీ ఇంటిలోనే ఉన్నాయి. షోడశ కళలను వెలిగించే చంద్రుడు నీ సిగలో ఆభరణంలా ఉన్నాడు. ఇక నేనేమి ఇవ్వగలను? నా దగ్గర మిగిలింది నా మనసు ఒక్కటే. దాన్నే నీ పాదాలకు పుష్పంలా సమర్పించుకుంటాను’ అని భక్తుడు చేసే మానస పూజను శివుడు ఇష్టపడతాడు.

పూజ కోసం భక్తులు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. పూజాపుష్పాల కోసం ఉన్నత పర్వత శిఖరాల మీద వికసించిన అపురూప కుసుమాల కోసం పరుగులు తీస్తారు. ఇలా ఎక్కడో అందరానంత దూరంలో, ఎన్నో కష్టాలు పడుతూ పూలను సేకరిస్తారే కానీ, తన హృదయం అనే సరస్సులో విరబూసిన ‘భక్తి’ అనే సుమాన్ని శివుడి పాదాలకు అర్పిస్తే, అది గొప్ప విషయం కదా అంటారు శంకరభగవత్పాదులు.  
మనిషి అజ్ఞానంతో ముత్యపు చిప్పను చూసి వెండి అనుకొంటాడు. గాజు ముక్కను చూసి మణిగా భావిస్తాడు. పిండితో కలిసిన నీళ్లను పాలు అనుకొంటాడు. ఎండమావులను చూసి అవన్నీ నీళ్లు అనుకొంటాడు. శివుడి నిజ స్వరూపమే ఈ సమస్త ప్రపంచమని తెలుసుకోకుండా ఏవో గంధర్వ నగరాలను ఊహించుకొంటాడు. అంతా శివమయమని అని తెలుసుకోవడమే మానస పూజ. శివుడి పాదారవిందాలపైనే మనసును నిలపాలి. నోటితో శివుడి స్తోత్రాలను పఠించాలి. చేతులతో అర్చన చేయాలి. శివుడి మంగళకరమైన నామాలనే చెవులతో వినాలి. బుద్ధిని ఉపయోగించి, శివుణ్ని ధ్యానించాలి. కళ్లతో శివుడి దివ్యరూపాన్ని దర్శించాలి. సమస్తం శివుడే అనే జ్ఞానాన్ని సాధించాలి. ఇదే శంకర మానసపూజ. పద్మాలతో నిండిన సరస్సులోనే హంస విహరిస్తుంది. చాతక పక్షి మేఘ జలం కోసం మబ్బుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. చక్రవాక పక్షి సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడా అని ఎదురుచూస్తుంది. చకోర పక్షి చంద్రోదయం కోసం నిరీక్షిస్తుంది. అలాగే శివుడిపై నిర్మలమైన భక్తి ఉంటే, మనసు శివుడి దర్శనంకోసం తపిస్తుంది. ఇదే శివమానస పూజ.
పూజా ద్రవ్యాలతో చేసే పూజ మనసును నియంత్రించడానికే కాని, కేవలం వస్తు సమర్పణ కోసం కాదని శంకరుల ఉపదేశం. పూజా సామగ్రిని సేకరించడం మాత్రమే పూజ అనుకుంటే అది కేవలం వస్తు పూజ అవుతుందే కాని మానసిక పూజ కాదు. భక్తి అనేది మానసికంగా ఉద్భవించాలి. కేవలం బాహ్యాడంబరాలతో కనబడరాదు. ఆడంబరాలు భక్తిని ప్రకటించవు. నిరాడంబరమైన హృదయార్పణమే నిజమైన భక్తి. మనిషి తాను చేసే పూజను ప్రపంచానికి కనబడేలా ప్రదర్శించకూడదు. అది మానసికారాధనగానే ఉండాలి. అలా చేసే పూజనే పరమేశ్వరుడు ఇష్టపడతాడని చెప్పడమే ‘శివానందలహరి’లోని అంతరార్థం.

డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని