స్ఫూర్తిమంతమైన పాఠం

ప్రపంచ ప్రసిద్ధ ఫోర్డు వాహన సంస్థ అధినేత హెన్రీఫోర్డ్‌కు ఇంజిన్ల తయారీ విషయంలో ఒక సరికొత్త ఆలోచన మనసులో మెరిసింది. సంస్థ ముఖ్య సాంకేతిక నిపుణులందరితో సమావేశం ఏర్పాటు చేశాడు.

Published : 12 May 2023 01:25 IST

ప్రపంచ ప్రసిద్ధ ఫోర్డు వాహన సంస్థ అధినేత హెన్రీఫోర్డ్‌కు ఇంజిన్ల తయారీ విషయంలో ఒక సరికొత్త ఆలోచన మనసులో మెరిసింది. సంస్థ ముఖ్య సాంకేతిక నిపుణులందరితో సమావేశం ఏర్పాటు చేశాడు. శక్తిమంతమైన కొత్త ఇంజిన్‌ గురించి తన ఆలోచనలను వివరించాడు. ఎవరికీ అది రుచించలేదు.
హెన్రీఫోర్డ్‌ వారి వాదనలన్నీ ఓపిగ్గా విన్నాడు. అందరినీ పరిశీలనగా చూశాడు. ‘ఈ తరహా ఇంజిన్‌ తయారీ కష్టసాధ్యమనే విషయం నాకూ తెలుసు. మీ ద్వారా అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలన్నది నా ప్రయత్నం. ఎందుకు విఫలమవుతామన్న మీ ఆలోచనలను పక్కకు నెట్టి, ఎలా సాధించాలన్న విషయంపై దృష్టి సారించండి. సానుకూల దృక్పథంతో వెంటనే పని మొదలు పెట్టండి. విజయం సాధించి, మీ సత్తా నిరూపించుకోండి’ అని ఆదేశించాడు.
వారిలో పట్టుదల రగిలింది. అందరూ కసిగా రంగంలోకి దిగారు. ఆరు నెలలు తిరిగే సరికల్లా అమెరికా రహదారులపై వి-8 ఫార్ములా ఇంజిన్లతో శక్తిమంతమైన ఫోర్డుకార్లు పరుగులు తీశాయి. వాహనరంగంలో విజయవంతమైన వాటిలో వి-8 ప్రధాన వాహనంగా పేరు గడించింది.

సీతమ్మను అన్వేషిస్తూ వానరులు కొండాకోనా గాలించారు. చివరకు సాగరతీరానికి చేరారు. నూరు యోజనాల విస్తీర్ణంతో భీకరంగా గర్జిస్తున్న సముద్రాన్ని చూడగానే నీరుకారిపోయారు. నిరాశ ఆవరిం చింది. అందరూ దిగాలుగా కూర్చున్నారు. జాంబవంతుడు లేచాడు. హనుమంతుణ్ని సమీ పించాడు. గంభీరమైన కంఠంతో హనుమను ప్రేరేపించడం ఆరంభించాడు. ‘ఓ మహావీరా! నీవు సామాన్యుడివి కావు. బలంలో తేజస్సులో రామలక్ష్మణులకు సమానుడివి. అంతరిక్షంలో అనాయాసంగా విహరించే గరుత్మంతుడి రెక్కల్లోని అనంతమైన శక్తి నీ సొంతం. విషాద సాగరంలో మునిగిన ఈ వానర సమూహాన్ని ఉద్ధరించగల శక్తిశాలివి నీవు. శ్రీ మహావిష్ణువు త్రివిక్రముడైనట్లు నీవు విజృంభించు... విక్రమించు. సముద్రాన్ని లంఘించు. సీతమ్మదర్శనం సాధించు. రామకార్యాన్ని పూర్తిచేసి, ఆ అవతార పురుషుడికి ఆనందాన్ని కలిగించు. లే... లంకకు పోయి విజయుడివై తిరిగిరా’ అంటూ పరిపరి విధాల ప్రబోధించాడు.

అంతే!  జాంబవంతుడి పలుకుపలుకుతో గుండెల్లో ఉత్తేజం పొంగి ప్రవహించగా- హనుమ దేహం అంతకంతకూ పెరిగిపోయింది. ఆ సందర్భంలో వాల్మీకిమహర్షి హనుమనోట అద్భుతమైన వాక్యాలు పలికించారు. ‘నా బుద్ధి, మనసు సీతమ్మవారిని దర్శించాలన్న ఉత్కంఠతో ఉవ్విళ్లూరుతున్నాయి. లంకను పెకలించి తెస్తాను. మీరంతా నిశ్చింతగా ఉండండి’ అన్నాడాయన. అంటే మానసికంగా అప్పటికే ఆయన సీతమ్మ సమక్షంలో ఉన్నాడు. విజయం ముంగిట్లో నిలిచాడు. ఇక భౌతికమైన ప్రయాణం ఒక్కటే మిగిలింది.

వ్యక్తిత్వ వికాస తరగతిగదుల్లో నేర్పించవలసిన గొప్ప పాఠమిది. నాయకుడు తన సహచరులను ఏ రకంగా ప్రేరేపించాలో... ఆ ప్రేరణ కళను విజేత ఏ విధంగా ఆకళించుకోవాలో... పని ఆరంభించే సమయంలోనే దాని విజయాన్ని మానసికంగా ఎలా అనుభూతి చెందాలో... మహోత్సాహంతో లక్ష్యాన్ని ఎలా సునాయాసంగా సాధించాలో... రామాయణం మనకు అలవోకగా బోధించింది.

వై.శ్రీలక్ష్మి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని