హృదయపూర్వక భక్తి

భగవంతుడు భక్త సులభుడు. ఆయనను చేరుకోగలిగే అన్ని మార్గాల్లో  భక్తి మార్గం తేలిక. భగవంతుడి అనుగ్రహం పొందడానికి కొన్ని గుణాలనూ కలిగి ఉండాలి. అహంకారం, ద్వేషం ఉండకూడదు. ఓర్పు, కరుణ కలిగి ఉండాలి. బుద్ధిని మనసును అదుపులో ఉంచుకోవాలి. 

Published : 13 May 2023 00:58 IST

గవంతుడు భక్త సులభుడు. ఆయనను చేరుకోగలిగే అన్ని మార్గాల్లో  భక్తి మార్గం తేలిక. భగవంతుడి అనుగ్రహం పొందడానికి కొన్ని గుణాలనూ కలిగి ఉండాలి. అహంకారం, ద్వేషం ఉండకూడదు. ఓర్పు, కరుణ కలిగి ఉండాలి. బుద్ధిని మనసును అదుపులో ఉంచుకోవాలి. మైత్రీ భావంతో మెలగాలి. అటువంటివాడంటే తనకు ఇష్టమని గీతాచార్యుడు చెప్పాడు. భక్తిభావం కలిగిన ప్రహ్లాదుడికి అన్ని సద్గుణాలు అలవడ్డాయి. భగవంతుడి కోసం సంసారాన్ని త్యజించి పూజామందిరాల్లోనే గడపడమో, అడవులు పట్టి తిరగవలసిన   అవసరమో  లేదు. భగవంతుడే   ప్రపంచమనే మహా సంసారాన్ని వహి స్తున్నాడు. ఈ సంసారంలోనే, చుట్టూ ఉండే వ్యక్తులలో, నీలో, నువ్వు చేసే పనిలో, సర్వాంతర్యామి అయిన  ఆ భగవంతుని  దర్శించాలి. ఏ పూజ చేసినా పరమేశ్వర ప్రీతి కోసమనే చేయాలి. ధర్మబద్ధమైన కోరికలే కోరాలి.

హృదయాన్ని అహింస, ఇంద్రియ నిగ్రహం, సర్వ భూత దయ, క్షమ, శాంతి, తపస్సు, ధ్యానం, సత్యం అనే అష్టదళ  పుష్పంగా చేసుకుంటే ఆ భగవంతుడే నీ హృదయ కమలంలో కొలువు తీరతాడు. ఎవరికి  ఏది పెట్టినా  భక్తి భావం ఉండాలి.  శబరి భక్తితో పెట్టిన ఎంగిలి పండ్లను రాముడు ప్రీతితో స్వీకరించాడు. విదురుడు పండును వదిలేసి తొక్కను పెట్టినా కృష్ణుడు ఆప్యాయంగా ఆరగించాడు. గీతలో కృష్ణ పరమాత్మ భక్తితో సమర్పించేది పత్రం, పుష్పం, ఫలం, తోయం ఏదైనా సంతోషంగా స్వీకరిస్తానంటాడు.

భక్తి అనేది కేవలం దైవం మీద మాత్రమే కాదు. ‘మాతృదేవోభవ’, ‘పితృదేవోభవ’, ‘ఆచార్య దేవోభవ’, ‘అతిథి దేవోభవ’ అని ప్రత్యక్ష దైవాలైన తల్లిదండ్రులు గురువులు అతిథులు తత్సమానులైన పెద్దలం దరిమీదా అదే రకమైన భక్తి ఉండాలి. గురువు ఆదిశంకరాచార్యుల మీద భక్తితో సదానందుడు నదిపై నడచి  పద్మపాదుడు అయినాడు. పుండరీకుడు తల్లిదండ్రులను భక్తితో సేవించి  పాండురంగణ్ని భువికి దించి రాయిపై నిలుచోబెట్టాడు. పతిభక్తితో   అనసూయ  త్రిమూర్తులను పసిబిడ్డలను చేసింది. కసాయి వృత్తి చేసే ధర్మవ్యాధుడు తల్లిదండ్రులను భక్తితో పూజించిన కౌశికుడు అనే బ్రాహ్మణుడికి ధర్మోపదేశం చేసే స్థాయిని పొందాడు.
నిజానికి భారతీయుల జీవన విధానంలో భక్తి వేరు, జీవితం వేరు కాదు. రెండూ పెనవేసుకుపోయాయి. ‘మానవసేవే మాధవసేవ’ అనే భక్తిభావంతో దీనులకు, ఆపన్నులకు సహాయం చేయాలి. ఎవరైనా మనకు అవసరాలలో ఆపదలో సహాయం చేస్తే ‘దైవం మానుష రూపేణా’ అనుకొని ఆ వ్యక్తిలోని భగవంతుడికి నమస్కరించాలి.

పనే దైవంగా అంకితభావంతో త్రికరణ శుద్ధితో ఒక పూజగా నిర్వహించినప్పుడు, నువ్వు గుళ్లకు గోపురాలకు తిరగలేకపోయినా తీర్థాల్లో మునక వేయకపోయినా ఆ భగవంతుడే నీ దగ్గరికి వస్తాడు. తన చల్లని చూపులు నీపై ప్రసరింపజేస్తాడు.

కస్తూరి హనుమన్నాగేంద్ర ప్రసాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని