జయ హనుమాన్‌

అతులితమైన, అమేయమైన దీక్షా దక్షతలకు ఆంజనేయుడు ప్రతీక. రామాయణంలో రాముడే కథానాయకుడు. సుందరకాండకు మాత్రం హనుమ నాయకుడు.

Published : 14 May 2023 00:32 IST

అతులితమైన, అమేయమైన దీక్షా దక్షతలకు ఆంజనేయుడు ప్రతీక. రామాయణంలో రాముడే కథానాయకుడు. సుందరకాండకు మాత్రం హనుమ నాయకుడు. భక్తి భావన, కార్యసాధన, ఆత్మశోధన, నిరుపమాన స్వామి ఆరాధనలకు సాకార రూపం- ఆంజనేయుడు. రుద్ర రూపమే అంజనానందనుడిగా ఆకృతి దాల్చిందని పరాశర సంహిత ప్రకటించింది. ‘హర’ అనే శివ శబ్దంలో ‘హ’కారం హనుమ వాచకం, ‘ర’కారం రామ సూచకం. ఈశ్వర చైతన్యం రాముడి రూపంలో పరమాత్మగా ఆవిష్కారమైతే, ఆ దైవీగుణ సంపన్నతను లోకానికి చాటి చెప్పడానికి పవనసుతుడు అవతరించాడు. వేద హృదయమై రామాయణం భాసిల్లితే, ఆ వేద ధర్మాన్ని ప్రతిఫలింపజేయడానికి వేదమూర్తిగా వాయుపుత్రుడు వ్యక్తమయ్యాడు.

రామ కార్య నిర్వహణలో నిబద్ధతను, సుగ్రీవ, అంగద, జాంబవంతాది వానర వీరుల పట్ల మధురమైన మైత్రిని, లక్ష్మణుడికి ప్రాణదాతగా తన బలిమిని, సీతా శోకాన్ని నివారించి, ఆమెకు ఆనం దాన్ని అందించిన ప్రసన్న మూర్తిగా ఆంజనేయుడు వర్ధిల్లాడు. ఇలా ఎందరో జీవితాలకు సుందరత్వాన్ని ఆపాదించిన దివ్య సుందరుడు- హనుమంతుడు. రాముడు పరమా త్మకు, సీతా మహాసాధ్వి జీవాత్మకు సంకేతం. జీవాత్మను, పరమాత్మతో అనుసంధానం చేయడానికి, అద్వై తాన్ని సాధించడానికి భక్తి మాధ్యమం ఉపయుక్తమవుతుంది. ఆ భక్తి తత్పరతకు ప్రతిబింబమే, మంగళమూర్తి మారుతి. సకల గుణ సమన్వయ రూపధారిగా, అఖిల దేవతా శక్తుల ఏకీకృత వజ్రాంగ దేహుడిగా రామాయణంలో హనుమను వాల్మీకి మహర్షి దర్శించాడు. త్రిమూర్తుల దివ్యాంశతో, పంచభూతాల తేజస్సుతో అవ్యక్త అప్రమేయ పరతత్త్వానికి ప్రతిఫలనంగా, పంచ మహా శక్తుల సమన్వయంతో పంచముఖ ఆంజనేయుడు పరిఢవిల్లుతున్నాడు. ప్రతికూల సంహార శక్తికి నృసింహతత్త్వాన్ని, జ్ఞాన గరిమకు హయగ్రీవ అంశను, అనంత వేగశక్తికి గరుత్మంతుడిని, ఆపదుద్ధారక తత్త్వానికి వరాహమూర్తిని, శ్రేయో సంధాయకతకు వానర రూపాన్ని విరాట్‌ రూప హనుమ తనలో నిక్షిప్తం చేసుకున్నాడు. లంక అనే శ్రీనగరిలో శ్రీచక్ర రాజ నిలయగా భాసిల్లే సీతామహాలక్ష్మిని తన సాధనా పటిమతో, అనిర్వచనీయ తపోదీక్షతో దర్శించి, తరించాడు. అందుకే హనుమను మహాదేవీ అనుగ్రహ భవ్య రూపుడిగా కపిల తంత్రం అభివర్ణించింది.

అంజన, కేసరి దంపతులకు వరపుత్రుడిగా ఆంజనేయుడు ఆవిర్భవించాడు. అంజన అంటే అఖండ తపోనిష్ఠ! కేసరి అంటే అత్యున్నత స్థితి. సర్వోత్కృష్టమైన ఉపాసనా సంవిధానంతో భగవదంశను ప్రతిఫలంగా ఆ దంపతులు అందుకున్నారు. వైశాఖ బహుళ దశమినాడు అవతరించిన పవమాన సుతుడు నిర్మల, నిరంజన, నిష్కామ్య భక్తి విశేషానికి సమగ్ర రూపం. భక్తుడు, భగవంతుడు ఏకోన్ముఖమై విలసిల్లే అపురూప చింతనా మార్గానికి ఆంజనేయుడు ప్రతినిధి. సర్వతో శుభంకరమైన, సర్వదా భద్రంకరమైన వ్యక్తిత్వ, దైవత్వ భావాలకు హనుమంతుడు సారథి. ఆదర్శనీయ, ఆరాధనీయ భావనా పరంపరకు కపివీరుడు వారధి!

డాక్టర్‌ కావూరి రాజేశ్‌ పటేల్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు