ఆత్మోద్ధరణ

‘ప్రతి మనిషీ తనను తానే ఉద్ధరించుకోవాలి’ అన్నది గీతాచార్యుడు చెప్పిన మాట. ఒకరు తింటే మరొకరి ఆకలి తీరనట్టే, ఒకరి నిద్ర మరొకరు పోనట్లే- ఒకరికి బదులు మరొకరు సాధన చేయడం సాధ్యం కాదు.

Published : 18 May 2023 01:17 IST

‘ప్రతి మనిషీ తనను తానే ఉద్ధరించుకోవాలి’ అన్నది గీతాచార్యుడు చెప్పిన మాట. ఒకరు తింటే మరొకరి ఆకలి తీరనట్టే, ఒకరి నిద్ర మరొకరు పోనట్లే- ఒకరికి బదులు మరొకరు సాధన చేయడం సాధ్యం కాదు. కాబట్టి ఎవరి సాధన వారే చేసుకోవాలి. తద్వారా ఎవరి జ్ఞానాన్ని వారే సంపాదించుకోవాలని విశ్లేషకులు చెబుతుంటారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అధోగతి తప్పదనీ హెచ్చరించారు. దీనికిగాను కొంత పరిశ్రమ చేయాలన్నారు. దీన్నే సాధన అంటారు.

సాధన కష్టమైనపని కానే కాదు. అలా చేయాలనుకునేవారికి గురువులు, శాస్త్రాలతోపాటు దైవం దారి చూపిస్తాడు.  ప్రయత్నించే వారికి భగవంతుడే స్వయంగా అండగా నిలిచి సహాయపడతాడని పురాణాలు చెబుతున్నాయి. మానవ ప్రయత్నం లేనిదే భగవంతుడు సైతం ఏమీ చేయలేడు. ఇంద్రియాలను జయించి మనసును అదుపులో పెట్టుకోవాలి. లేకపోతే అవే శత్రువులవుతాయి. సోమరితనం, నిలకడ లేకపోవడం, ఇంద్రియ నిగ్రహం/వైరాగ్య భావన లేకుండటం, అంతా ఆ దేవుడే చూసుకుంటాడులే అనే నిర్లక్ష్యం ఏ సమయంలోనూ పనికిరావు.

‘ఉద్ధరించుకోవడమైనా, దిగజార్చుకోవడమైనా ఎవరికి వారి చేతుల్లోనే ఉంది. వారి వారి ఆలోచనలు, మాటలు, చేతలమీదే అది ఆధారపడి ఉంది. తమ భావాల నిరంతర పరిణామమే దీనికి కారణం’ అని పురాణాలు బోధిస్తున్నాయి. పరమానందాన్ని పొంది, సద్గతులు ప్రాప్తించాలనుకుంటే అలసత్వం పనికిరాదు. నిర్మల చిత్తంతో నిస్వా ర్థంగా పరిశ్రమ చేస్తే ఫలితం ఉంటుంది. ఎంతో త్యాగం, మరెంతో సాధన చేసి, ఇంద్రియ నిగ్రహం పాటించి అకుంఠిత దీక్షతో పరా త్పరుని వేడుకోవాలి. పెద్దలు బోధిం చిన మార్గాన్ని అనుసరించాలి. స్వయంకృషి సాగించాలి.

ఎందరో మహాత్ములు అనేక కష్టనష్టాలకు ఓర్చి అహర్నిశలు శ్రమించి ఎన్నో సంవత్సరాలు సాధన చేసి తమ చిత్తాన్ని ఇంద్రియాలను నిగ్రహించుకుని ధన్యులయ్యారు. వారి చరిత్రలను, జీవన విధానాన్ని గమనించాలి. ఆ విధంగా ఎవరికి వారే తమ శాయశక్తులా ప్రయత్నించి తమ చిత్తాన్ని శుద్ధపరచుకోవాలి. వారే సంసార బంధనాల నుంచి విముక్తులు కాగలరు. విషయ వాసనా రాహిత్యం కలిగి, దృశ్యమాన ప్రపంచ వాసనలేవీ లేని తన నిర్మల చిత్తమే తనను ఉద్ధరించే ఉద్ధారకుడు. అలాగే మలినమైన తన మనసే పతనం కలగజేస్తుందని గ్రహించాలి. మనసును ఇంద్రియాలను తన వశంలో ఉంచుకుంటే అవే ఆత్మ బంధువులవుతాయి. సాధారణంగా ప్రతి మనిషి మనసులో రెండు భాగాలు ఉంటాయి. ఒక భాగం చేయమని ప్రేరేపించేది. మరొకటి ఆలోచించమని సూచన చేసేది. అలాంటప్పుడు ప్రేరక భాగం చెప్పిన విషయాలను, రెండో పార్శ్వం వైపు ప్రయత్న పూర్వకంగా మళ్ళించి తన మనసును ధర్మం వైపు తిప్పుకోవాలి. ఈ ప్రకారం చేస్తే అనవసర విషయాచరణ జరగదు. ఫలితంగా తమను తామే ఉద్ధరించుకోగలుగుతారు. చిత్తశుద్ధే ఆత్మబంధువు కాబట్టి ప్రతి ఒక్కరూ దాన్ని ఆశ్రయించాలి. అది మహోపకారం చేస్తుంది.

జీవుడు ప్రయత్నపూర్వకంగా వివేకంతో ఓరిమితో తన మనసును జయించి శత్రువుల్ని మిత్రులుగా చేసుకోవాలి. పరిశుద్ధమైన మనసే తన ఉద్ధారకుడు అని గ్రహించిన నాడు మనిషి ఆత్మోన్నతుడు అవుతాడు. తద్వారా ముక్తుడవుతాడు.

  వి.ఎస్‌.రాజమౌళి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని