ప్రకృతి ఒడి... మనిషి బడి!

ఏ రోజుకారోజు ప్రకృతి రెండు విరామ చిహ్నాలను అందజేస్తుంది అందరికీ... ఆంతరంగికంగా సిద్ధమవడానికి. అవి- సూర్యోదయం, సూర్యాస్తమయం.

Published : 20 May 2023 01:02 IST

రోజుకారోజు ప్రకృతి రెండు విరామ చిహ్నాలను అందజేస్తుంది అందరికీ... ఆంతరంగికంగా సిద్ధమవడానికి. అవి- సూర్యోదయం, సూర్యాస్తమయం. ప్రకృతి ప్రసాదించే ఈ అద్భుత అవకాశాన్ని ఎంతమంది సక్రమంగా వినియోగించుకుంటున్నారు? సూర్యోదయ సూర్యాస్తమయాలు దైవం ఉనికిని ఆస్వాదించడానికి, ఆరోగ్యంగా జీవించడానికి అద్భుత సమయాలు.

ప్లాటో, గ్రీకులు సూర్యోదయ సూర్యాస్తమయాలకు సాష్టాంగపడతారని చెప్పడాన్ని బట్టి- కేవలం ఇది భారతీయ సంప్రదాయమే కాదని అర్థమవుతుంది.

నది సముద్రం వైపు ఆనందంగా పరుగులు పెడుతుంది. ఎక్కడా నిలిచిపోవాలనుకోదు. దారిలో ఎందరి దాహమో తీరుస్తూ, పంట పొలాలకు పచ్చదనాన్ని అందిస్తూ... మార్గమధ్యంలో పూలు-పండ్లు, కొమ్మలు-రెమ్మలు, చెత్తా-చెదారం, కళేబరాలు... ఏం పట్టించుకోకుండా, దేన్నీ అంటించుకోకుండా గలగల ధ్వనులు చేసుకుంటూ ప్రవహిస్తుంది. అడవులు ఆధ్యాత్మిక అవసరాలకు ఆశ్రయాలు. వృక్ష సముదాయాలు దేవతల నివాస స్థలాలు. రుషులు అడవుల్లో జీవిస్తూ, శిష్యులకు విద్యాబోధన చేశారు. వృక్షాలు- భగవంతుడు జీవరాశులకు ఇచ్చిన  గొప్పవరం. విలువైన ఔషధగుణాలు కలిగిన మొక్కలెన్నో. వాటిని కొనియాడే మంత్రాలున్నాయి.

పురాణాల్లో అనేక సందర్భాల్లో అడవుల ప్రస్తావన వస్తుంది. మంచీ చెడు పక్కపక్కనే ఉంటా యని రామాయణంలో కనిపి స్తుంది. నిస్వార్థ సేవకు ఉదా రగుణానికి వృక్షం ప్రతీక అని భాగవతం చెబుతుంది. పూలు, పండ్లు ఆకులు, వేళ్లు, బెరడు, కాండం... సర్వస్వం పనికొస్తాయి. రావిచెట్టును ఒక దేవతగా కొలుస్తారు. మర్రిచెట్టు కింద ఎందరో మునులు ఆత్మజ్ఞానం పొందారు. బుద్ధుడికి మహావృక్షం నీడలో జ్ఞానోదయం కలిగింది.

భగవంతుడు ఎన్నోరకాల కూరగాయలు, పండ్లు అందుబాటులో ఉంచాడు. మనిషి- ఆహార పదార్థాలకు రసాయనాల్ని మిళితం చేసి వినియోగించే పరిస్థితులను తీసుకొచ్చాడు. మనుషులు యాంత్రిక జీవనాన్ని అలవరచుకుని కృత్రిమ రుచులకు దాసోహమైపోయారు. సహజత్వాన్ని కోల్పోతున్నారు. చెప్పుల్లేని కాళ్లతో పచ్చని పచ్చిక మీద నడిచినా, సేదదీరినా ఆ తాజాదనపు అనుభూతి మనిషిలోని ప్రతి కణాన్నీ పులకింపజేస్తుంది. లేలేత సూర్యకిరణాల వెచ్చదనంలోని హాయి ఎంతో చర్మానికి తెలుస్తుంది. పారే నదిలో కాళ్లు తడిసినప్పటి చల్లదనం శరీరమంతా ప్రసరిస్తుంది. ప్రకృతిని ఆలింగనం చేసుకోవడం పరవశించి పోవడమంటే అదే.

దేహం ప్రకృతి సృష్టి. అది అనారోగ్యం పాలు కాకుండా జాగ్రత్తపడాలి. ఆహారం తీసుకునే విషయంలో జ్ఞానేంద్రియాలను ఉపయోగించాలి. ఆరోగ్యం ఎంతటి మహాభాగ్యమో ప్రకృతిని కాపాడుకోవడం ఎంత అవసరమో గుర్తుంచుకుని జీవించాలి.

మంత్రవాది మహేశ్వర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు