బతకడం కాదు... జీవించాలి!

జీవితం భగవంతుడు ప్రసాదించిన వరం. సృష్టిలోని సకల జీవరాశుల్లోనూ మానవ జన్మ ఉత్తమమైనదని ఆర్షవాక్కు. ఈ మాట సార్థకమయ్యేలా మనం జీవిస్తున్నామా లేదా అన్నది ఎవరికి వారు ఆత్మవిమర్శ చేసుకోవలసిందే.

Published : 23 May 2023 01:14 IST

జీవితం భగవంతుడు ప్రసాదించిన వరం. సృష్టిలోని సకల జీవరాశుల్లోనూ మానవ జన్మ ఉత్తమమైనదని ఆర్షవాక్కు. ఈ మాట సార్థకమయ్యేలా మనం జీవిస్తున్నామా లేదా అన్నది ఎవరికి వారు ఆత్మవిమర్శ చేసుకోవలసిందే. ‘చిన్ని నా బొజ్జకు శ్రీరామరక్ష’ అనుకుంటూ తమకోసం తాము బతకడం చాలామంది చేసేపని. ఆహార నిద్రా భయ మైథునాలు జీవకోటి సామాన్య లక్షణాలు. ఆ పరిమితుల్లోనే చాలామంది జీవిస్తుంటారు. నిజానికది జీవితం కాదు. బతకడం మాత్రమే. సాధారణ జీవితం కన్నా కొంత సార్థక జీవితం సాగించిన ప్రతివారూ ప్రశంసనీయులే. అర్థవంతంగా చైతన్యవంతంగా బతకాలి. జీవిత పరమార్థం గ్రహించి మనుగడ సాగించాలి. కీర్తిశేషులు, యశఃకాయులు వంటి మాటలు గతించిన వారిని గురించి వాడుతుంటాం. ఎవరైతే ఈ లోకం నుంచి నిష్క్రమించిన తరవాతా తమ జీవితకాలంలో చేసిన పనుల ద్వారా లోకుల స్మృతిపథంలో మెదులుతుంటారో, ఎవరి శీలసంపద కర్తవ్యనిష్ఠ నిస్వార్థ  సేవల్ని జనం గుర్తుంచుకొని చిరకాలం వారిగురించి గొప్పగా మాట్లాడుకుంటారో వారి జన్మ చరితార్థం.

‘చుట్టూ ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కంటే చిన్న దీపమైనా వెలిగించడం మంచిది’ అని ఒక సూక్తి. ఆ స్ఫూర్తితో- నమ్మిన సిద్ధాంతాలకోసం, ఆదర్శాలకోసం అవిశ్రాంతంగా పోరాడుతుంటారు కొందరు. ధర్మానికి హాని కలిగినప్పుడు దక్షులైనవారు ఉపేక్షిస్తే అది వారికే చేటు కలిగిస్తుందని మహాభారతంలో తిక్కన మాట. అసమర్థ సజ్జనత్వమూ ప్రమాదకరమే. మనం మంచిగా ఉంటే చాలదు. చెడును ఎదుర్కోవడంలో క్రియాశీలకంగా ఉండాలి.

గతాన్ని తలచుకొని జీవించడం, భవిష్యత్తు గురించి బెంగపెట్టు కోవడం ధీరుల లక్షణం కాదు. సంకట పరిస్థితుల్లో కుంగిపోకుండా అవరోధాలను ఓర్పుతో ఎదు ర్కొంటూ జీవితాన్ని సుఖమయం చేసుకోవాలి. ఇంద్రియాల్ని, మన సును అదుపులో ఉంచుకొంటూ వివేకంతో, విజ్ఞతతో నిర్ణయాలు తీసుకోవడం, తమను తాము సంస్కరించుకోవడం ఉత్తముల లక్షణం. తమకు లభించిన దాన్ని ఆనందంగా అనుభవించడం, తమది కానిదాని కోసం ఆరాట పడకపోవడం- రెండూ సుఖమయ జీవనానికి సూచికలు. కుటుంబ పరంగా వృత్తిపరంగా సమాజసభ్యుడిగా ప్రతి వ్యక్తికీ కొన్ని బాధ్యతలుంటాయి. ఎవరి బాధ్యతల్ని వారు సక్రమంగా నిర్వర్తిస్తే సమాజంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. సంఘజీవి అయిన మనిషి ఈ సమాజం తనకేమిచ్చిందని ఆలోచించడం కాదు, సమాజానికి తానేమి చేయగలిగానని ప్రశ్నించుకోవాలి. ఆపదలో ఉన్నవారికి నిస్వార్థంగా సేవచేయడం, ప్రతిఫలాపేక్ష లేకుండా పరులకు ఉపకారం చేయడం, సకల ప్రాణుల పట్ల దయకలిగి ఉండటం- విశిష్ట వ్యక్తిత్వ లక్షణాలు. తన కష్టాల్లో ధైర్యం, ఇతరుల కష్టాలపట్ల దయాగుణం కలిగి ఉండటం- గొప్ప వ్యక్తిత్వం. తన లాభ దృష్టిని కొంతమేరకు తగ్గించుకొని సమాజ హితంకోసం పనిచేయడం కర్తవ్యంగా భావించాలి.

జీవితం ఎంతో విలువైనది. మానవతా విలువలు పాటిస్తూ క్రమశిక్షణతో, జీవితంపట్ల సాటి మనుషులపట్ల సానుకూల వైఖరితో మనుగడ సాగిస్తే ఎవరికైనా జీవితం స్వర్గతుల్యమవుతుంది. లక్ష్యంలేని బతుకు లంగరు లేని నావలాంటిది. ఆత్మవిశ్వాసం, చిత్తశుద్ధి, మానవ సంబంధాల పట్ల తపన కలిగి అందరినీ అర్థం చేసుకొని నడుస్తూ పదిమంది మన్ననలకూ పాత్రుడు కావడం కంటే మనిషికి ఇంకేం కావాలి?

 డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని