కోరుకోదగినవి

పెళ్ళి కాబోయే కన్య అబ్బాయి రూప లావణ్యాలను, ఆమె తల్లి ధనాన్ని, తండ్రి విద్యాబుద్ధులు, గుణగణాలను, బంధుజనం మంచి విందు భోజనాన్ని కోరుకుంటారని ఓ చమత్కార శ్లోకం ఉంది. సాధారణంగా జరిగే పెళ్ళి విషయంలోనే ఒక్కొక్కరిదీ ఒక్కొక్క కోరిక. అలాంటిది అనంతమైన మనుషులు, మనస్తత్వాలు కలిగిన ఈ ప్రపంచంలో కోరికలకు అంతం ఉండదు.

Published : 24 May 2023 01:34 IST

పెళ్ళి కాబోయే కన్య అబ్బాయి రూప లావణ్యాలను, ఆమె తల్లి ధనాన్ని, తండ్రి విద్యాబుద్ధులు, గుణగణాలను, బంధుజనం మంచి విందు భోజనాన్ని కోరుకుంటారని ఓ చమత్కార శ్లోకం ఉంది. సాధారణంగా జరిగే పెళ్ళి విషయంలోనే ఒక్కొక్కరిదీ ఒక్కొక్క కోరిక. అలాంటిది అనంతమైన మనుషులు, మనస్తత్వాలు కలిగిన ఈ ప్రపంచంలో కోరికలకు అంతం ఉండదు. మనసు నిరంతరం ఏదొకటి కోరుతూనే ఉంటుంది. ఒకటి నెరవేరితే మరొకటి పుట్టుకొస్తూనే ఉంటుంది.

వయసు, స్థాయి, కాలమాన పరిస్థితులకు తగ్గట్లు కోరికలు ఉండాలి. పేదవాడు పేదరికం తొలగి సుఖమయ జీవనం గడపాలని కోరుకోవాలి. విద్యార్థి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని, ఉద్యోగార్థి తగిన ఉద్యోగం రావాలని, మధ్యతరగతి వ్యక్తి జీవనానికి లోటు లేకుండా జీవితం గడవాలని... కోరుకోవడం సహేతుకం. పగ్గాలు వేసి పట్టుకోకపోతే గుర్రం అదుపు తప్పినట్టే, అలవికాని కోరికలు కోరినవారి జీవితాలు గతి తప్పుతాయి. శంకరాచార్యులు బ్రహ్మచర్యాశ్రమంలో మధుకరం(భిక్ష) కోసం ఒక ఇంటికి వెళ్ళారు. ఆ ఇల్లాలు కడు పేదరాలు. భిక్ష వేయడానికి ఏమీ లేకపోవడంతో తటపటాయిస్తున్న సమయంలో ఆమె ధనవంతురాలు కావాలని కోరుకుని లక్ష్మీదేవిని ప్రార్థించి కనకధారా స్తోత్రం ఆశువుగా చెప్పారు. ఆయన తన సొంతానికి ఏమీ కోరుకోలేదు. కోరిక అంటే ఎలా ఉండాలో తెలుపుతుంది ఈ కథ.

పురాణాలు, వేదాలు, శాస్త్రాలు, కావ్యాలు తదితరాలు అన్నింటిలోనూ అనేకమైన కోరికలున్నవారి ప్రస్తావన ఉంది. వాటిని నెరవేర్చుకోవడానికి తపస్సు, ధ్యానం, ప్రార్థనలను ఆశ్రయించారు. తపస్సు చేసి దేవుణ్ని మెప్పించి అలవికాని కోరికలు కోరినవారు వరాలు పొందినా వాటి ఫలితాలను పొందలేకపోయారు. దీనికి  హిరణ్యకశిపుడు, రావణా సురుడు ఉదాహరణలు. వీరిద్దరూ మరణం లేకుండా వరం కోరుకున్నారు. అవి కోరదగిన కోరికలు కాదు. కానీ చేసిన తపస్సుకు వరాలు ఇవ్వకపోతే మార్గాంతరం లేదు. వాటిని ఇచ్చినట్టే ఇచ్చి వారు కోరిన తీరులోని లోపాలతో వధించారు. శిశుపాలుడి తల్లి శ్రీకృష్ణుణ్ని వరమడిగింది. ఆమె అడిగినట్లు నూరు తప్పులు మన్నించిన తరవాతే శిశుపాలుణ్ని సంహరించాడు. ‘నీ పాదపద్మాల సేవ, ఆ సేవ చేసే వారితో స్నేహం అంతులేని భూతదయ నాకు ప్రసాదించు’ అని సుదాముడు శ్రీకృష్ణుణ్ని కోరుకున్నాడు.

దైవదర్శనానికి వెళ్ళేవారు తమకు కావాల్సిన వాటి జాబితా ఏకరువు పెడతారు. అవన్నీ తనకు, తన కుటుంబానికి సంబంధించినవే అయి ఉండవచ్చు. కానీ ఇతరుల గురించి ఎవరూ సాధారణంగా ఏమీ కోరరు. అలా కాకుండా అందరూ సుఖంగా ఉండాలి అని మనసారా కోరుకుంటే అందరిలో మనమూ ఒకరమై సుఖంగా ఉంటాం.

కోరికలను తీర్చుకోవడానికి రెండు పద్ధతులు అవలంబిస్తారు. వాటిలో మొదటిది ప్రయత్నం. రెండోది మొరపెట్టుకోవడం. రెండోదానికంటే మొదటిదే సరైనది. సరైన కోరిక కోరుకుని, తగిన  ప్రయత్నం చేసి దాన్ని నెరవేర్చుకోవడం సరైన పద్ధతి. ప్రయత్నం చేస్తున్నాడంటే అది తగినది, నెరవేర్చుకోదగిన కోరికే అయి ఉంటుంది. అలా కాకుండా దేవుడికి మొరపెట్టుకున్నాడంటే అది అలవికాని కోరిక కిందే లెక్క.

అయ్యగారి శ్రీనివాసరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని