ఆధ్యాత్మిక జీవితం

మనిషికి రెండు జీవితాలుంటాయి. ఒకటి లౌకిక జీవితం. రెండోది ఆధ్యాత్మిక జీవితం. లౌకిక జీవితంలో తన పుట్టుకకు కారణమైన తల్లిదండ్రులు, తోబుట్టువులు, బంధుమిత్రులు, చదువులు, ఉద్యోగాలు, పెళ్ళిళ్లు, సాంసారిక బాధ్యతలు మొదలైనవి చేరిపోతాయి.

Published : 25 May 2023 00:41 IST

నిషికి రెండు జీవితాలుంటాయి. ఒకటి లౌకిక జీవితం. రెండోది ఆధ్యాత్మిక జీవితం. లౌకిక జీవితంలో తన పుట్టుకకు కారణమైన తల్లిదండ్రులు, తోబుట్టువులు, బంధుమిత్రులు, చదువులు, ఉద్యోగాలు, పెళ్ళిళ్లు, సాంసారిక బాధ్యతలు మొదలైనవి చేరిపోతాయి. వీటికి భిన్నంగా ఉండేది ఆధ్యాత్మిక జీవితం. ఇది కేవలం వ్యక్తికి మాత్రమే సంబంధించింది. దీని సాధనలో ఇతరుల ప్రమేయం ఉండదు. అదెలాగంటే-  తిండి పదార్థం నోట్లో వేసుకున్న తరవాతగానీ, దాని రుచి తెలియదు. ఇతరులు దాని రుచిని వర్ణించి చెప్పినా, వారు చెప్పింది నిజమో కాదో తెలియాలంటే స్వయంగా తానే రుచి చూసి తెలుసుకోవాలి. ఆధ్యాత్మిక జీవితం కూడా ఇలాంటిదే.

మనిషి పుట్టిన తరవాత తాను జీవించడానికి కావలసిన సాధనాలను సమకూర్చుకోవడానికే కాలాన్ని వెచ్చిస్తాడు. ఆకలి ఒక్కటే మనిషిని కర్తవ్యంలోకి పరుగులు పెట్టిస్తుంది. ముందు తాను బతకాలి. ఆ తరవాత తన కుటుంబాన్ని పోషించుకోవాలి. ఆ తరవాతే సమాజం. ఇదీ మానవ జీవన విధానం. మనిషికి తన లౌకిక జీవనంపై ఎన్నో ఆశలుంటాయి. తాను ఆనందంగా ఉండాలని, తన సంతతి వృద్ధిలోకి రావాలని, సమాజంలో గౌరవాదరణలను పొందాలని, బంధుమిత్రుల సహాయ సహకారాలను అందుకోవాలని కోరు కోవడం మానవ సహజ లక్షణం. తన లౌకిక జీవనోన్నతికోసం మనిషి ఎన్నో దారులు వెతుక్కుంటాడు. ఆ దారులు మంచివైతే మంచి ఫలితాలనిస్తాయి. కంటక మార్గాలైతే చేదు అనుభవాలనే మిగిలిస్తాయి. జీవితాంతం వరకు ఈ లౌకిక లంపటాలలోనే కాలం గడిపే మనిషి తన జీవిత పరమార్థానికి అవసరమైన ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి ఆలోచించడం లేదు. జవసత్వాలన్నీ ఉడిగిపోయిన ముదిమి వయసులో ఆధ్యాత్మిక జీవితం గుర్తుకు వస్తుంది. కానీ అప్పటికే పుణ్యకాలం అంతా గడచిపోతుంది కనుక చేసేదేమీ లేక చింతాక్రాంతుడై అలమటిస్తాడు. శరీరంలో శక్తి సంపదలు ఉన్నంతకాలం గుర్తుకురాని ఆత్మ విచారం జీవన సంధ్యాకాలంలో మనసును తొలుస్తుంది. ‘అయ్యో! ఈ సుకృతం చేయలేకపోయానే, ఈ తపస్సు చేయలేకపోయానే, ఈ చింతనను మరచిపోయానే’ అని వాపోవడం చూస్తుంటాం.

‘వయసు పెరుగుతోంది’ అని అందరూ అంటారు. వయసు పెరగడం కాదు, తరగడమేనని వేదాంతాలు చెబుతాయి. కాళిదాసమహాకవి రఘువంశంలో- ‘మనిషికి మరణం సహజం కాని, జీవనం సహజం కాదు. మనిషి చావకుండా బతికి ఉన్నంతకాలం అతడు గొప్ప భాగ్యవంతుడే అనుకోవాలి’ అంటాడు.

మనిషి లోకంలో తన బతుకుతెరువు కోసం ఎన్నో పనులు చేస్తున్నా, అతడిలోని అంతరాంతరాల్లో వైరాగ్య భావం ఉండాలి. లేకుంటే కనబడేదంతా శాశ్వతం అనుకొని భ్రమకు ప్రమాదాలకు గురి అవుతాడు. ఏ క్షణంలో ఏదైనా జరగవచ్చు. మనిషి జీవితం అస్థిరం, క్షణికం అని వేదాంతుల మాట.

‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ అనే సామెతను మనిషి సదా మననం చేసుకోవాలి. కేవలం లౌకికంగా బతకడం మాత్రమే కాదు- ఆత్మశాంతికోసం ఆధ్యాత్మిక జీవితాన్నీ అలవాటు చేసుకోవాలి. ఆత్మోన్నతికోసం ప్రయత్నించాలి. ఆత్మానందాన్ని సాధించాలి. అప్పుడే మనిషి పుట్టుకకు ప్రయోజనం దక్కుతుంది.

 డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని