ఆనంద పరిమళం

ఆనందం అనేది మనసుకు సంబంధించిన విషయం. బాహ్యపరమైన సౌకర్యాల ప్రాతిపదికనో సంపదల రీత్యానో దాన్ని అంచనా వేయలేం. అన్నీ ఉండీ అశాంతితో రగిలిపోయేవారు ఎందరో ఉన్నారు. ఇవేమీ లేకుండా సంతోషంగా గడిపేవారూ ఉన్నారు. ఆనందాన్నిచ్చేవి సంపదలు, అంతస్తులు కావు.

Updated : 26 May 2023 04:49 IST

ఆనందం అనేది మనసుకు సంబంధించిన విషయం. బాహ్యపరమైన సౌకర్యాల ప్రాతిపదికనో సంపదల రీత్యానో దాన్ని అంచనా వేయలేం. అన్నీ ఉండీ అశాంతితో రగిలిపోయేవారు ఎందరో ఉన్నారు. ఇవేమీ లేకుండా సంతోషంగా గడిపేవారూ ఉన్నారు. ఆనందాన్నిచ్చేవి సంపదలు, అంతస్తులు కావు. ప్రశాంతమైన మనసు, నిజాయతీతో కూడిన వృత్తి మాత్రమే మనిషికి ఆనందాన్నిస్తాయి.

మహాభారతంలో యక్షప్రశ్నల ఘట్టం అందరికీ విదితమే. యక్షుడి రూపంలో ఉన్న యమధర్మరాజు యుధిష్ఠిరుడిని ఎన్నో ప్రశ్నలడుగుతాడు. ఆ ప్రశ్నల పరంపరలో ‘ఎవరు సంతోషంగా ఉంటారు?’ అని ప్రశ్నిస్తాడు యక్షుడు. దానికి సమాధానంగా ధర్మరాజు ‘తన భోజనాన్ని తాను వండుకునేవాడు, అప్పులు లేనివాడు, దూరతీరాలకు ప్రయాణించని వాడు సంతోషంగా ఉంటాడు’ అని చెబుతాడు.

మనిషి ఉన్నంతలో తృప్తిగా జీవిస్తూ ఉండటంలోని ఆనందం మరి దేనిలోనూ రాదు. పాశ్చాత్యులు అధికంగా సంపాదించడం ద్వారా తమ జీవిత సమస్యలకు పరిష్కారాలు వెదుకుతుంటే, భారతీయులు ఉన్నదానితో సంతృప్తిగా జీవించడంలోనే తమ జీవిత సమస్యలకు పరిష్కారం కనుగొంటున్నారు అంటారు స్వామి వివేకానంద. సహజంగా మనిషి ఆనందస్వరూపుడు. అతడికి గతంతోను, భవిష్యత్తుతోను సంబంధం ఉండదు. ఉన్నచోట, ఉన్నక్షణంలో సంపూర్ణంగా జీవించడమే ఆనందానికి మార్గమని గ్రహిస్తాడు. అతడు వర్తమానంలోని ప్రతి క్షణాన్నీ సంపూర్ణంగా ఆస్వాదిస్తాడు. ఆనందస్వరూపుడైన వ్యక్తి ఈ సృష్టిలోని ప్రతి వస్తువులోనూ ఏదో ప్రత్యేకత ఉందని తెలుసుకుంటాడు. అందుకే ప్రతి వస్తువుపట్లా సమభావం, సమదృష్టి కలిగి ఉంటాడు.

నిజానికి సాటివారికి చేతనైన ఉపకారం చేయడంలో కలిగే ఆనందానికి మరేదీ సాటిరాదు. అదే మానవత్వం కూడా. ఒకరోజు బుద్ధుడు ఆశ్రమంలో తిరుగుతూ ఉండగా ఒక గదిలో ఓ భిక్షువు అనారోగ్యంతో బాధపడుతుండటం చూశాడు. వెంటనే బుద్ధుడు ఆ భిక్షువుకు తగిన సపర్యలు చేశాడు. కొంతసేపటి తరవాత బుద్ధుడు శిష్యులందరినీ పిలిచి ‘ఈ సోదరుడు అనారోగ్యంతో బాధపడుతుంటే మీరెవ్వరూ పట్టించుకోకుండా ఏం చేస్తున్నారు?’ అని అడిగాడు. అప్పుడు మిగతా భిక్షువులు ‘మేమంతా ధ్యానం చేస్తున్నాం’ అని చెప్పారు. అప్పుడు బుద్ధుడు ‘మన కళ్లముందే తోటివ్యక్తి అనారోగ్యంతో బాధపడుతుంటే అతడి బాధను తీర్చని మీ ధ్యానం నిష్ప్రయోజకం. మీరు ధ్యానం ద్వారా ఏ ఆనందాన్ని పొందగలుగుతున్నారో అదే ఆనందాన్ని ఆ వ్యక్తిని సేవించడం ద్వారా పొందగలిగితే మీ ధ్యాన సాధన పరిపూర్ణమైనట్లు’ అని హితవు పలికాడు.

మానవ జన్మ లభించడమే ఒక వరం. అలాంటి జన్మను సార్థకం చేసుకోవడానికి మనిషి ప్రయత్నించాలి. మనిషి లోకోత్తర ధర్మాలైన దానం, పరోపకారం, సేవ వంటి దైవీ గుణాలు అలవరచుకుని ఆర్తులను ఆదుకున్నప్పుడే శాశ్వతమైన ఆనందాన్ని పొందగలుగుతాడు. మానవసేవ మధురమైన పరిమళం లాంటిది. ప్రతి మనిషీ ఇతరుల వెతలను దూరం చేయడానికి ప్రయత్నించాలి. అప్పుడు లభించే సంతోషం వర్ణనాతీతం. ఆ సేవే మనిషికి మరిచిపోలేని అనుభూతిని, ఆనందాన్ని ఇస్తుంది. మనిషిని మహానుభావుడిని చేస్తుంది!

విశ్వనాథ రమ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని