అనాసక్త యోగం

సుఖదుఃఖాలు జయాపజయాలు మానావమానాలు... వంటి ద్వంద్వాలను మనిషి సమానంగా భావించాలని, స్వీకరించాలని భగవద్గీత చెబుతోంది. దూషణ భూషణ తిరస్కారాలకు అతీతంగా తామరాకుపై నీటిబొట్టులా సంసారంలోనే ఉంటున్నా, తనలో సంసారాన్ని నింపుకోకుండా జీవించడాన్ని ‘స్థితప్రజ్ఞ’గా చెబుతారు.

Published : 27 May 2023 02:18 IST

సుఖదుఃఖాలు జయాపజయాలు మానావమానాలు... వంటి ద్వంద్వాలను మనిషి సమానంగా భావించాలని, స్వీకరించాలని భగవద్గీత చెబుతోంది. దూషణ భూషణ తిరస్కారాలకు అతీతంగా తామరాకుపై నీటిబొట్టులా సంసారంలోనే ఉంటున్నా, తనలో సంసారాన్ని నింపుకోకుండా జీవించడాన్ని ‘స్థితప్రజ్ఞ’గా చెబుతారు. కర్మ పరిపాకాన్ని పూర్తిచేసేందుకే కావాలని భగవంతుడు కష్టాలను కల్పిస్తున్నాడని, గతంలో చేసిన సత్కార్యాలకు ఫలితంగా సుఖ సంతోషాలు దక్కాయన్న ఎరుకతో వాటిని ఆస్వాదించాలని పెద్దలు వివరించారు. ఈ తరహా ప్రవృత్తినే అనాసక్తయోగమన్నారు.

శ్రీకాళహస్తీశ్వర శతకంలోని ‘నిను సేవింపగ ఆపదల్‌ పొడమనీ...’ పద్యంలో ధూర్జటి మహాకవి అనాసక్తయోగి లక్షణాలను వివరించాడు. ‘ఓ స్వామీ! నీ సేవకుడిగా జీవించే నేను- ఆపదలు వచ్చినా చలించను, నిత్యానందం వరించినా పొంగిపోను... నన్ను సామాన్యుడన్నా బాధపడను, మహా త్ముడని పొగిడినా గర్వపడను... సంసార వ్యామోహం పైబడనీ, జ్ఞానం రానీ, మేలు జరగనీ, జరగకపోనీ... అన్నింటినీ అలం కారంగానే భావిస్తాను. నాకు ఏమొచ్చినా- నీవిచ్చిన ప్రసాదంగానే స్వీకరిస్తాను’ అంటాడు ధూర్జటి ఆ పద్యంలో. అనడమే కాదు, ఆచరించాడని చెప్పడానికీ ఆధారాలు తగినన్ని ఉన్నాయి. ఉదాహరణకు శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థా నంలోని అష్టదిగ్గజాలలో ధూర్జటి ఒకడన్నది చారిత్రక సత్యం. ‘కృష్ణరాయ కిరీట కీలిత రత్న రంజిత పదాబ్జ యుగళుడు’ వంటి ప్రశంసలకు నోచుకొన్నాడని, ఆయన మనవడు కుమారధూర్జటి వెల్లడించాడు. అయితే, ధూర్జటికవి ఆ విజయాలను గురించి, సత్కారాల గురించి తన శతకంలో ప్రస్తావించనేలేదు. అనాసక్తయోగమనే మాటకు అర్థం అది.

కవులే కాదు, రక్తినీ విరక్తినీ సైతం సమానంగా భావించి, భక్తికి వాటిని గట్టి పునాదులుగా మార్చుకొన్న గొప్ప భక్తులు సైతం మనకు చరిత్రలో కనిపిస్తారు. వారి భక్తిశ్రద్ధలకు మురిసిపోయిన భగవంతుడు ప్రత్యక్షమై ‘నా మీద ఇంతటి గురి ఎలా కుదిరింది? గాఢమైన భక్తి ఎలా కలిగింది’ అని అడిగాడట.
‘స్వామీ! ఇదంతా నీ పుణ్యమే! పరమ గయ్యాళిని నాకు భార్యగా అనుగ్రహించావు. స్వల్పకాలంలోనే జీవితంపై విరక్తిని ప్రసాదించావు. నన్ను నీ భక్తుడిగా మార్చావు. ఇదంతా నీ ప్రసాదమే. ఈ భక్తిశ్రద్ధలన్నీ నీ వరమే’ అన్నాడు మొదటి ఆయన. రెండో ఆయన బదులిస్తూ ‘ప్రభూ! ఇదంతా నీ దయ. అనుకూలవతియైన చక్కని స్త్రీని ఇల్లాలిని చేశావు. ఆమె నా ఇంటిని ఎంత నైపుణ్యంగా నిర్వహిస్తోందంటే- నేను నిశ్చింతగా, ఇంటి బెంగ పూర్తిగా వదిలేసి, ఆనందంగా నీ సేవ చేసుకొంటున్నాను’ అంటూ ధన్యవాదాలు చెప్పాడు.

ఈ ఇద్దరిలో మొదటి భక్తుడు తుకారామ్‌. రెండో ఆయన సంత్‌ ఏకనాథ్‌! వీరిని ప్రశ్నించినవాడు- విఠలుడు! కష్టమైనా, సుఖమైనా రెండూ భగవంతుడి ప్రసాదమేనని భావించడం నిజమైన భక్తుల స్వభావం. ఆధ్యాత్మికతకు ఆ స్వభావమే ఆలంబన. ఈ అంతరార్థాన్ని గ్రహించినవారికి అనాసక్త యోగమంటే ఏమిటో తెలుస్తుంది. స్థితప్రజ్ఞులుగా జీవించడం అలవడుతుంది!

ఎర్రాప్రగడ రామకృష్ణ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని