ధనం కన్నా గుణమే ప్రధానం

ధనం అన్నింటికీ మూలమని, ప్రపంచం దాని చుట్టూ తిరుగుతుందని, అది ఎలాగైనా సంపాదించాలన్న ధ్యాస తప్ప మరో ఆలోచన లేకుండా, విలువైన జీవిత కాలాన్ని కొందరు వృథాచేస్తారు.

Published : 29 May 2023 00:35 IST

నం అన్నింటికీ మూలమని, ప్రపంచం దాని చుట్టూ తిరుగుతుందని, అది ఎలాగైనా సంపాదించాలన్న ధ్యాస తప్ప మరో ఆలోచన లేకుండా, విలువైన జీవిత కాలాన్ని కొందరు వృథాచేస్తారు. ధనం సంపాదించడంలోనే వారి బతుకు తెల్లవారుతుందని, ఆ సంపాదనంతా మరొకరి పాలవుతుందని వారు తెలుసుకోలేరు. అలాంటివారిని ఈ లోకం అవసరం కొద్దీ సేవిస్తుంది. వారిపట్ల సమాజం కనబరచే గౌరవం, సానుభూతి అసత్యాలు. ఈ నాటకం, బూటకం అనాదిగా ప్రపంచంలో చెల్లుబాటు అవుతున్నాయి.

ధనం కన్నా గుణం ప్రధానం అంటారు పెద్దలు. అది తరగని నిధి. ధనవంతుడిని మరిచిపోయినా, ఈ ప్రపంచం గుణవంతుడిని గుర్తుచేసుకుంటూనే ఉంటుంది. సంపదలు రెండు రకాలు- ధనం, గుణం. ఆ గుణసంపదను రెండు రకాలుగా విడదీసి చెబుతున్నది గీతోపనిషత్తు. దైవీగుణాలు, ఆసురీగుణాలు, వాటి మంచి చెడ్డల గురించి పదహారో అధ్యాయం- దైవాసుర సంపద్విభాగ యోగంలో చూడవచ్చు. శాస్త్ర సమ్మతమైన విధులు దివ్యానుభూతిని, అందుకు భిన్నంగా చేపట్టే పనులు అధోగతిని కలిగిస్తాయని కృష్ణపరమాత్మ అర్జునుడికి చెప్పాడు.

సత్యం, వివేకం, దానం, దయ, సంయమనం, ఓర్పు ఈ ఆరు గుణాలున్న వ్యక్తిని లోకం ప్రేమిస్తుంది. వజ్రకిరీటం ఉన్న చక్రవర్తి కన్నా ఈ మకుటంలేని మహారాజు పట్ల ఆత్మీయత, అనురాగం కనబరుస్తుంది. అలాంటి వ్యక్తి కనుమరుగైనప్పటికీ, చిరకాలం ప్రజల గుండెల్లో గూడు కట్టుకుని ఉంటాడు. అమరత్వానికి, అమృతత్వానికి సజీవ ప్రతీకగా ఆచంద్ర తారార్కం వెలుగుతున్న దారిదీపంలా నిలిచి అలరిస్తాడు. సత్యసంధుడు, వివేకవంతుడు, దానగుణ సంపన్నుడు, దయామయుడు, సంయమి, జనని- ఈ ఆరుగురు, వారి పుణ్యకథలు... పురాణాల్లో ఇతిహాసాల్లో మణిమాణిక్యాల్లా దాగి ఉన్నాయి. సత్యం అనగానే సత్య హరిశ్చంద్రుడి కథ, ఇచ్చిన మాటకోసం ఆ మహారాజు పడ్డ కష్టాలు గుర్తుకొచ్చి కన్నీళ్లు పెట్టిస్తాయి. వసిష్ఠుడితో పందెం ఒడ్డిన మహర్షి విశ్వామిత్రుడు అతడి సత్యనిష్ఠా గరిష్ఠాన్ని అంగీకరించడం, హరిశ్చంద్రుడు దూరమైన రాచరికాన్ని వైభవాన్ని తిరిగి పొందడం తెలిసిన విషయమే. క్షీర సాగర మథనంలో ముందు విషం, తరవాత అమృతం పుట్టిన విధంగా సత్యానికి అగ్నిపరీక్షలు తప్పవు. చివరికి గెలుపూ తప్పదు. నిజాన్ని పూర్తిగా నమ్ముకుంటే విజయం నెమ్మదిగా తప్పనిసరిగా వరిస్తుంది అంటారు వివేకానందులు.

ఏది మంచి, ఏది చెడు అని ఆలోచించి అడుగువేసే జ్ఞానవంతుడిని వివేకి అంటారు. ప్రియమైన సత్యం ఏదో, అప్రియమైన సత్యం ఏదో తెలుసుకుని మసలుకోవడమే వివేకవంతుడి లక్షణం అంటుంది లోకం. దైవీగుణాలు, ఆసురీ గుణాలు రెండూ ఒకే మనిషిలో కాపురం చేస్తూ ఉంటాయి. పరోపకారాలపైన దృష్టి సారించినవాడు మానవుడైనా దేవడితో సమానం. పరపీడనం వైపు మొగ్గుచూపేవాణ్ని మానవ రూపుడైన దానవుడు అంటారు. ఓరిమి ఉన్నచోట కూరిమి(ప్రేమ) ఉంటుంది. జనని(తల్లి) ఓర్పునకు, జన్మభూమి కూర్పునకు ఆటపట్టులు.  ఇద్దరూ ఉన్నచోటు స్వర్గంకన్నా మిన్న. ఆదర్శ మానవుడైన రాముడి మాటలు మనకూ ఆదర్శమే!

 ఉప్పు రాఘవేంద్రరావు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని