లక్ష్య సాధన

గ్రామాంతరం బయలుదేరిన ఓ బాటసారి త్వరగా గమ్యాన్ని చేరుకొనే దారి తెలిసినా, ఓ దానయ్యను పిలిచి ‘ఇంకా దగ్గర దారేదైనా ఉన్నదా’ అని అడిగాడు. ఆ వ్యక్తి వేరే మార్గాన్ని చూపించాడు. ఆ మార్గం గుండా ఎంతో దూరం నడిచి నడిచి అలసటతో చెట్టు నీడన చతికిలపడ్డాడు...

Published : 30 May 2023 00:58 IST

గ్రామాంతరం బయలుదేరిన ఓ బాటసారి త్వరగా గమ్యాన్ని చేరుకొనే దారి తెలిసినా, ఓ దానయ్యను పిలిచి ‘ఇంకా దగ్గర దారేదైనా ఉన్నదా’ అని అడిగాడు. ఆ వ్యక్తి వేరే మార్గాన్ని చూపించాడు. ఆ మార్గం గుండా ఎంతో దూరం నడిచి నడిచి అలసటతో చెట్టు నీడన చతికిలపడ్డాడు. ఆ దారిన పోతున్న మరో వ్యక్తి అతణ్ని చూసి తప్పుదారిలో వచ్చావని, అతడికి తెలిసిన దారే సరైనదని చెప్పేసరికి తన అవివేకానికి చింతించాడు బాటసారి. ఇలా- చేరాల్సిన మార్గం తెలిసినా డోలాయమాన స్థితిలో సరైన నిర్ణయం తీసుకోలేక ఇతరులపై ఆధారపడి భంగపడుతూ ఉంటారు కొందరు. గమ్యం లేని జీవితం దిక్సూచి లేని నావ లాంటిది. మానవజన్మకు పరమార్థం అపూర్వమైనది సాధించడం. దానికై తపించాలి. కలలు కనడమే కాదు. కష్టించి వాటిని నిజం చెయ్యాలి. మనిషి జీవితం పరుగుపందెం లాంటిది. గమ్యం వైపే దృష్టిని సారించి, పరుగెత్తి లక్ష్యాన్ని సాధించేవాడే విజేత. అనవసర భయాలు, సందేహాలు, అలసత్వం మనిషిని గెలిపించలేవు. శరీర బలంతోపాటు మనోబలం, అకుంఠిత దీక్ష అతడికి సహాయపడతాయి. కొందరికి తమ శక్తియుక్తులు, ధైర్యసాహసాల పట్ల ఏవో అనుమానాలు ఉంటాయి. నిత్యశంకితులై అనుక్షణం భయపడతారు. ఇతరులను ఆశ్రయిస్తారు. వారినే నమ్ముతారు. వారిచ్చే సలహాలు మంచైనా, చెడైనా స్వీకరించి ఫలితాలు అనుభవిస్తారు.

కాళీమాత ఆలయంలో ప్రసాదంగా పంచే మిఠాయి గంపకు చీమలు పట్టాయి. రామకృష్ణ పరమహంసకు ఈ విషయాన్ని చెప్పి, మందు చల్లి చీమలను చంపమంటారా అని అడిగారు పరివారం. ఆయన వద్దని వారిని వారిస్తూ, చీమలు వచ్చే దారిలో చక్కెరపొడి చల్లమని సలహా ఇచ్చారు. వారు అలాగే చేశారు. చక్కెర నోట కరచుకొని చీమలు దారితప్పాయి. మనుషులు కూడా చీమల వంటివారే. కోరుకున్నవాటిని పొందాలని బయలుదేరినా, స్థిరబుద్ధి లేక మధ్యలోనే దారి తప్పిపోతారు. అనుకొన్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయామని విచారిస్తారు. రవ్వంత చక్కెర సంతోషం చాలనుకొని, గంపంత మిఠాయి లాంటి పరిపూర్ణ ఆనందాన్ని దూరం చేసుకొంటారు. గమ్యాన్ని చేరుకోవాలనుకొనేవారు నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు సాగాలి.

సందేహనివృత్తి చేసి జ్ఞానాన్ని ప్రసాదించేవాడే గురువు. గురువును ఆశ్రయించి జ్ఞానసముపార్జన చేయాలనే శిష్యులకు మొదట్లో గురుబోధలు అర్థం కావు. వారిలో కొందరికి సహనం నశిస్తుంది. వెనువెంటనే వారికి గురువుపై సందేహం కలుగుతుంది. ఈ గురువు మనల్ని జ్ఞానవంతుల్ని చేసి ఒడ్డుకు చేర్చగలడా అని. ఏ మాత్రం ఆలోచించక, తొందరపాటు నిర్ణయంతో ఆ గురువును వీడి మరో గురువును ఆశ్రయిస్తారు. అక్కడా అలాంటి పరిస్థితే. ఇలా అటూఇటూ తిరుగుతూ విలువైన కాలాన్ని కోల్పోయి దేన్నీ సాధించలేక విషాదంలో మునిగిపోతారు. ‘ఒక ఆలోచనపైనే దృష్టిని నిలిపి దానిపైనే జీవించండి. మనసును కట్టడిచెయ్యండి. చలించే మనసు నిన్ను తప్పుదోవ పట్టిస్తుంది’ అన్నారు స్వామి వివేకానంద. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో సక్రమదృష్టిని నిలపాలి. సరైన ప్రణాళికలు, అవగాహన, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం తోడై నడిస్తే విజయం వరించక తప్పదు.

మాడుగుల రామకృష్ణ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని