కృష్ణార్పణం... రామార్పణం!

ఈ లోకంలో అందరికీ అన్నీ అమరకపోవచ్చు. ముఖ్యంగా నిత్యావసరాలు తీరక ఎంతో మంది వ్యధ చెందుతూ ఉంటారు. సంతృప్తికర జీవితం గడుపుతున్నవారు తమకు ఉన్నదాంట్లో కొంత ఇచ్చి ఆర్తులను ఆదుకోవాలంటుంది శాస్త్రం. చాలామందికి ఇవ్వడానికి మనసొప్పదు కాని తీసుకోవడానికి క్షణమైనా ఆలోచించకుండా సిద్ధమైపోతారు.

Published : 01 Jun 2023 01:27 IST

ఈ లోకంలో అందరికీ అన్నీ అమరకపోవచ్చు. ముఖ్యంగా నిత్యావసరాలు తీరక ఎంతో మంది వ్యధ చెందుతూ ఉంటారు. సంతృప్తికర జీవితం గడుపుతున్నవారు తమకు ఉన్నదాంట్లో కొంత ఇచ్చి ఆర్తులను ఆదుకోవాలంటుంది శాస్త్రం. చాలామందికి ఇవ్వడానికి మనసొప్పదు కాని తీసుకోవడానికి క్షణమైనా ఆలోచించకుండా సిద్ధమైపోతారు. ఇచ్చే చేతికే తీసుకొనే అర్హత ఉంటుందన్నది మరవకూడని విషయం. ఎలాంటి పరిస్థితుల్లోను, ఎవరి ముందూ చాచడానికి ఇష్టపడకుండా, కేవలం ఇవ్వడానికి మాత్రమే చేతులను ఉపయోగించే మహనీయులవి అమృతహస్తాలు. అవి అభయహస్తాలు.

అపాత్రదానం కూడదంటుంది పెద్దరికం. అవసరార్థులను గుర్తించి తదనుగుణంగా దానం చేయాలి. అలాంటి దానాలకే ఔచిత్యం ఉంటుంది. దానం అన్నది మనం ఎవరికో చేస్తున్న ఉపకారం కాదు. అది మన జీవితాన్ని చరితార్థం చేసుకొనే సదవకాశం. మన పరిధిలో చేసే ద్రవ్య సహాయాన్ని ధర్మం అంటారు. ధర్మం ఇహ, పరలోక సౌఖ్యాలకు దోహదం చేస్తుందంటారు పెద్దలు. ధర్మం చేయడానికి నియమ నిబంధనలు ఉండవుగాని, దానం చేయడానికి ఉంటాయి. మరణ భయంతో భయపడేవారికి అభయం ఇవ్వడం, రకరకాల వ్యాధులతో బాధపడే రోగులకు వైద్యం చేయడం, చేయించడం, పేదవారికి ఉచిత విద్యను అందించడం, ఆకలితో అలమటించేవారికి అన్నదానం చేయడం- ఇవి చతుర్విధ దానాలు. గోదానం, భూదానం, నువ్వులు, బంగారం, వెండి, నెయ్యి, వస్త్రం, ధాన్యం, బెల్లం, ఉప్పులను దశ దానాలంటారు. వీటికే రత్నం, కన్య, గజం, అశ్వం, మంచం, రథం కలిపితే షోడశ దానాలు. వీటిని గ్రహణ సమయాల్లో, పర్వదినాల్లో, సంక్రమణాల్లో(నైమిత్తిక) చేసే దానాల వల్ల పదింతల ఫలితం పొందుతారన్నది పురాణ వివరణ. నేడు రక్తదానం, నేత్రదానం, అవయవ దానాలు మరణం అంచున ఉన్నవారికి ప్రాణం పోస్తున్నాయి. ఇవిగాక మరిన్ని దానాలున్నాయి. తమ కోరిక తీరాలనో, తనవారి, ఊరివారి సంక్షేమం కోరో చేసే పూజలు లేదా యజ్ఞ యాగాదుల్లో భాగంగా చేసేవి. యతులు, గురువులు, సన్యాసులకు ఇచ్చేవి.

ఎవరైనా శక్తికి మించిన విపరీత దానాలు చేసి కష్టాలు కొని తెచ్చుకోకూడదు. మిశ్రమలోహాలను, తమకు చెందనిదాన్ని దానంగా ఇవ్వకూడదు. ఫలితాన్ని ఆశించకుండా నిర్మల, నిశ్చల బుద్ధితో దానం చెయ్యాలి. దానం చేశాక మరిచిపోవాలి. పదిమందికీ చెప్పకూడదు. ప్రత్యుపకారం ఆశించకూడదు. ముఖ్యంగా దాన గ్రహీతను దాత చులకన చేయకూడదు.

దాత నుంచి దానం పొందుతూ కొంతమంది గ్రహీతలు కృష్ణార్పణం, రామార్పణం అంటారు. వారు అందుకొన్న దానాన్ని ముందుగా దేవుడి పరం చేసి తమ అవసరాలు తీర్చుకొంటారు. అందువల్ల అలాంటి వారికి ఇచ్చేది నీతి, నిజాయతీతో కూడినదై స్వీయ స్వసంపాదనతో సాధించినదై ఉండాలి. అప్పుడే అది ఫలవంతమవుతుంది.

బలి రాక్షస చక్రవర్తి అయినప్పటికీ నారాయణుడికి దానం ఇవ్వడంలో మాటల్లో చెప్పలేని సంతృప్తిని పొందాడు. కర్ణుడు దానశీలిగా యుగయుగాలుగా సూర్యసమాన తేజస్సుతో వెలుగొందుతున్నాడు. గొప్ప దానాలు చేయలేకపోయినా మనసావాచా ఇవ్వగలిగింది ఇస్తే, ఆ సంతృప్తిని మాటల్లో వర్ణించలేం. పెద్దల నుంచి వారసత్వంగా ఆస్తులే కాదు- దానగుణాన్నీ పొంది స్వధర్మంగా ఆచరించాలి. అదే ఇహలోకంలోని మనకు, పరలోకంలోని పెద్దలకు ఉత్తమగతులను కల్పిస్తుందని పురాణవచనం.

ప్రతాప వెంకట సుబ్బారాయుడు

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని