ఎవరికీ రాని కష్టం మీకొచ్చిందా?

కష్టాలు మంచివాళ్లకే వస్తాయని కొందరు వాపోతారు. ఒక కోణంలోంచి చూస్తే ఆ మాటా వాస్తవమే కదా అనిపిస్తుంది. ఆపదల్లో ఆదుకునేవారు, కష్టాల్లో గట్టెక్కించేవారు, సమస్యలు చుట్టుముట్టినప్పుడు పరిష్కార మార్గాలు చూపేవారు మంచివారే కదా.

Published : 03 Jun 2023 01:39 IST

కష్టాలు మంచివాళ్లకే వస్తాయని కొందరు వాపోతారు. ఒక కోణంలోంచి చూస్తే ఆ మాటా వాస్తవమే కదా అనిపిస్తుంది. ఆపదల్లో ఆదుకునేవారు, కష్టాల్లో గట్టెక్కించేవారు, సమస్యలు చుట్టుముట్టినప్పుడు పరిష్కార మార్గాలు చూపేవారు మంచివారే కదా. గణిత సమస్య వచ్చినప్పుడు లెక్కల మాస్టారు దగ్గరికే వెళతారు. ఆరోగ్య సమస్య తలెత్తినప్పుడు వైద్యుణ్ని సంప్రదిస్తారు. ఇలా... సమస్యలు వెళ్ళేవి తత్సంబంధ అంశంపట్ల పరిజ్ఞానమున్న మంచివాళ్ల దగ్గరకే కదా!
కష్టాలు మంచివారికే వస్తాయని వారు అనడంలో అసలు ఉద్దేశం ఏమిటంటే- నైతిక విలువలతో ధార్మిక జీవితం గడిపేవారికి ఎప్పుడూ కష్టాలే వస్తాయని, అవినీతితో అక్రమాలకు పాల్పడేవాళ్లు మాత్రం ఏ ఇబ్బందుల్లేకుండా హాయిగా జీవిస్తారని. ప్రమాదాలు, ఆపదలు, సమస్యలు వచ్చినప్పుడు మెలకువ (అప్రమత్తత)తో ఉన్నవాళ్లు గ్రహిస్తారు. నిద్రావస్థలో జోగుతున్నవారు గమనించరు. అంతే తేడా. గాఢాంధకారంలో కంటికి ఏదీ కనిపించదు. అంతమాత్రాన అక్కడ ఏ సమస్యా లేదని అనుకోలేం కదా! చిమ్మ చీకటిలో చిన్నదీపం వెలిగించగానే పక్కనే సిద్ధంగా పొంచి ఉన్న ప్రమాదం కంటపడుతుంది. ఆ సమస్య ఎప్పటి నుంచో అక్కడ ఉంది. దీపం వెలుగు దాన్ని చూపించింది. దీపం ఆర్పివేయగానే మళ్ళీ చీకటి అలముకుంటుంది. దాంతోపాటు సమస్యా అదృశ్యమవుతుంది. కనబడనంత మాత్రాన సమస్య తొలగిపోయినట్లేనా? కాదు. అది అక్కడే ఉంటుంది. వెలుగు మేలు చేస్తుంది. చీకటి మోసం చేస్తుంది. అందువల్లే జ్ఞానాన్ని వెలుగుతోను, అజ్ఞానాన్ని చీకటితోను పోలుస్తారు. సమస్యలు కొన్ని వ్యక్తిగతమైనవిగా ఉంటాయి. మరికొన్ని సార్వజనీనమైనవిగా ఉంటాయి. వాటికి పరిష్కార మార్గాలు మాత్రం ఒకరిద్దరివద్దే ఉంటాయి. జీవితం అలాంటివారినే ఎంపిక చేసుకుంటుంది. వాళ్లు ప్రపంచం బాధనంతా తమ బాధగా భావిస్తారు. విముక్తి కోసం వారి వ్యక్తిగత జీవితాన్నే ధారపోస్తారు. దుఃఖం అనేది ఏ ఒకరిద్దరిదో కాదు. అది ప్రపంచంలో మానవులందరికీ ఉండేది. దాని విముక్తి కోసం జీవితం శుద్ధోదనుడి కొడుకును ఎంపిక చేసుకుంది. జ్ఞానోదయం పొంది తన బోధనల ద్వారా మనిషి అంతరంగంలో లోపలి దీపం వెలిగించాడు. మానవులందరికీ దుఃఖోపశమనం కలిగించడానికి బుద్ధుడు జీవిత పర్యంతమూ కృషి చేశాడు.

ఆధునిక కాలంలో మానవుడు అంధకారంలో మగ్గుతున్న దశలో చీకట్లను తరిమికొట్టడానికి జీవితం థామస్‌ ఆల్వా ఎడిసన్‌ను ఎంచుకుంది. బాధ్యత ఎరిగిన అతడు అనేక ఓటములు చవిచూశాడు. ఎంతో శ్రమకోర్చాడు. అంతిమంగా కృత్రిమ దీపం వెలిగించాడు. లోకాన వెలుగులు పంచాడు.
ఈ భూమిపైన ఎన్నో రాళ్ల గుట్టలు, మరెన్నో పర్వత శ్రేణులూ ఉన్నాయి. వాటన్నింటినీ వదిలేసి జీవితం ఒకే ఒక్క రాయిని ఎంపిక చేసుకుంటుంది. సుత్తితో దాని శరీరాన్ని గాయాలపాలు చేస్తుంది. అందుక్కారణం, దాన్ని గుడిలో ప్రతిష్ఠించి దేవుడిగా కొలవడానికే. అందుచేత ఈ లోకంలో ఎవరికీ రాని కష్టం మీకు మాత్రమే వచ్చినందుకు గర్వపడాలి, సంతోషపడాలి. ఎందుకంటే, ఈ ప్రపంచానికి మీద్వారా ఏదో మేలు జరగాల్సి ఉందన్నమాట!

మునిమడుగుల రాజారావు

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని