ప్రతిక్షణం జీవించాలి

మనిషి జీవితం అమూల్యం. అది ఉత్కృష్టమైంది, దుర్లభమైందని ఎన్నో పురాణాలు పేర్కొన్నాయి. జీవించిన కాలం ఎంత అనేదానికన్నా ఎలా జీవించారు అనేది ముఖ్యం. సూర్యోదయాలు, అస్తమయాల రోజువారీ కాల చక్రం గిర్రున తిరుగుతుంది.

Published : 05 Jun 2023 00:34 IST

నిషి జీవితం అమూల్యం. అది ఉత్కృష్టమైంది, దుర్లభమైందని ఎన్నో పురాణాలు పేర్కొన్నాయి. జీవించిన కాలం ఎంత అనేదానికన్నా ఎలా జీవించారు అనేది ముఖ్యం. సూర్యోదయాలు, అస్తమయాల రోజువారీ కాల చక్రం గిర్రున తిరుగుతుంది. రోజులు గడిచే కొద్దీ ఆయువు తగ్గి మృత్యువు దాపురిస్తుందన్న ఆలోచన మనిషికి రాదు. ఇదెంతో ఆశ్చర్యకరమని భారతంలో ధర్మరాజు యక్షుడితో చెబుతాడు. కాలం ప్రవాహ వేగంతో ప్రయాణిస్తుంది. వేగాన్ని అదుపు చేయలేం. కాలాన్ని, దాని విలువను గుర్తించి సద్వినియోగం చేసుకోవచ్చు. గడచిన కాలాన్ని తలచుకుని బాధపడుతూ, రాబోయే కాలం గురించి భయాందోళనలు చెందుతూ మనిషి ఎప్పుడూ గతంలోనూ, భవిష్యత్తులోనూ బతుకుతున్నాడే కాని, వర్తమానంలో కాదు అంటారు శ్రీరమణులు. నిన్నటిరోజు తిరిగిరాదు. రేపు ఉందో లేదో తెలియదు. నేడు సత్యం. దాన్ని ఆనందంగా, ఆహ్లాదంగా గడపాలి. విజయాలు సాధించాలంటే వర్తమానంలోనే జీవించాలి. సార్థకత చేకూరాలి. కలలు కనండి, వాటిని నిజం చేసుకునేలా పరిశ్రమించాల్సింది నేడే. అందుకోసం బలమైన పునాదిని వెంటనే నిర్మించాలి, అదే భవిష్యత్తులో ఎత్తయిన భవనాన్ని భరిస్తుంది అంటారు అబ్దుల్‌ కలాం.

చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? దేనికైనా ముందుగానే ప్రణాళిక, వివేకం, విచక్షణా జ్ఞానంతో సిద్ధం కావాలి. చికిత్సకన్నా నివారణ ముఖ్యం. జీవితం విలువ తెలిస్తే ఒక్కక్షణమైనా వృథా కాదు. కాలం గడపడం ముఖ్యం కాదు. సద్వినియోగం చేసుకోవడం ప్రధానం. 84 లక్షల జీవరాశుల్లో అత్యున్నతమైంది, ఏదైనా సాధించే శక్తికలది మానవ జీవితం అంటారు పెద్దలు. జననం ముందు అజ్ఞానం, మరణం తరవాత అజ్ఞానం... మధ్యలో విలువైన జీవితకాలం సుసంపన్న జ్ఞానం. ప్రతి నీటిబొట్టును భద్రపరిస్తే నీటి కరవు ఉండదు. ప్రతి క్షణాన్ని వివేకంతో గడిపితే శాశ్వత కీర్తి సొంతమవుతుంది.

జీవితం విలువ, కాలం వేగం అంచనా వేస్తే ప్రతి క్షణం సద్వినియోగమే. త్వరగా ప్రారంభించు, నిదానంగా ప్రయాణించు, క్షేమంగా గమ్యం చేరుకో అనేది ఆంగ్ల సామెత. రేపటి పని ఈరోజే చెయ్యి, ఇవాళ్టి పని ఇప్పుడే చెయ్యి అనేది హిందీ సూక్తి. కాలక్షేపం కోసం ఏదో ఒకటి చేయకు ప్రతిపనీ నిర్మాణాత్మకంగా ప్రతిభతో ప్రగతి వైపుగా ఉండాలని హెచ్చరిస్తారు విజ్ఞులు.

కాలాన్ని తైలధారగా వర్ణించారు. అది నిరంతరం కొనసాగే ధార. జీవితం కూడా అంతటి వేగంగా సాగుతుంది. బాల్యం, కౌమారం, యౌవనం, వార్ధక్యం... ఒకదాని వెంట ఒకటి పరుగుపెడతాయి. ఇలా చేయలేకపోయాను, చేసి ఉంటే ఎంతో సాధించేవాణ్ని అనే నిరాశ కలగకుండా ఉండాలంటే అప్రమత్తంగా విజయాన్ని ఒడిసిపట్టాలి. ప్రతి క్షణం జీవించాలి.

హనుమ లంకలో సీత జాడ కోసం ఒక రాత్రి మొత్తం క్షణం విరామం లేకుండా వెతికాడు. అందరి మధ్య సంచరించాడు. కొంత నిరాశ ఆవహించినా ధైర్యాన్ని వీడలేదు. నిరాటంకంగా, నిర్విఘ్నంగా ప్రయత్నం కొనసాగించాడు. చివరకు అనుకున్నది సాధించాడు. విలువైన, అమూల్యమైన జీవితాన్ని క్షణికావేశంతో తీవ్ర నిరాశతో ముగించేవారు పిరికివారు, మూఢులు. భగవంతుడు ఇచ్చిన సువర్ణ అవకాశం మానవ జీవితం. ఆస్వాదిస్తూ అనుభవించేవారే చరితార్థులు.

 రావులపాటి వెంకటరామారావు

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు