మూఢ భక్తి

‘భక్తి’ అంటే భగవంతుడి పట్ల మనం చూపే అనురక్తి. మనకు ప్రియమైన వారిపట్ల ప్రేమను వ్యక్తీకరించడానికి అనేక పద్ధతుల్ని అనుసరిస్తాం. పసిపిల్లలైతే ముద్దులతో ముంచెత్తుతాం. కాస్త పెద్ద పిల్లలైతే తియ్యని తినుబండారాలో, బొమ్మలో ఇచ్చి మురిపెంగా ఆలింగనం చేసుకుంటాం...

Published : 06 Jun 2023 00:59 IST

‘భక్తి’ అంటే భగవంతుడి పట్ల మనం చూపే అనురక్తి. మనకు ప్రియమైన వారిపట్ల ప్రేమను వ్యక్తీకరించడానికి అనేక పద్ధతుల్ని అనుసరిస్తాం. పసిపిల్లలైతే ముద్దులతో ముంచెత్తుతాం. కాస్త పెద్ద పిల్లలైతే తియ్యని తినుబండారాలో, బొమ్మలో ఇచ్చి మురిపెంగా ఆలింగనం చేసుకుంటాం. ప్రాపంచికంగా ప్రేమ వ్యక్తీకరణ అనేది వ్యక్తిని బట్టి మారుతుంది. అది తల్లిదండ్రులకు ఒక విధంగా, మిత్రులకు మరొకవిధంగా, భార్యకు ఇంకోవిధంగా, సంతానం పట్ల విలక్షణంగా ఉంటుంది. ఎలా వ్యక్తీకరించినా ప్రేమ మధురమే. రూపాలు వేరైనా తీపి పదార్థాల రుచి ఒకటే కదా!

భగవంతుడి పట్ల మనం భక్తిని చూపుతాం. భక్తి అనగానే అంచులు దాటిన ప్రేమగా మనం అర్థం చేసుకోవాలి. ప్రాపంచిక పరిధుల మధ్య ప్రేమకు అవధులు అనివార్యం. ప్రేమ ఉందికదాని అవతలివారికి సమస్తం అప్పజెప్పం. వారికి ఎంత స్థాయిలో, ఏ విధంగా ప్రేమ చూపాలని మన మనసు చెబుతుందో అంతవరకే చేస్తాం. మిత్ర బాంధవులెవరైనా ఇంతే. కానీ భగవంతుడిపట్ల మనం చూపాల్సింది భక్తి కనుక, అది ప్రాపంచిక పరిధులు దాటిపోవాలి. దానికి ఎలాంటి పరిమితులూ ఉండకూడదు. అలా ఉంటే- అది భక్తే కాదు. భక్తి గురించి చెప్పుకొనే సందర్భంలో మనం ఆంజనేయ భక్తి గురించి తప్పక చెప్పుకోవాలి. ఎందుకంటే అంతటి మహా భక్తుడు వేరొకరు లేరు.
మనిషికి- తనువు, మనసు, ధనం (తన్‌, మన్‌, ధన్‌) అత్యంత ప్రీతికర మైనవి. భగవంతుడికి సమర్పించ వలసినవి, అమూల్యమైనవి- ఈ మూడు. అలా అర్పించి శరణాగతి చెయ్యాలి. తిరుపతిలో నిలువుదోపిడి అంటే శరీరం మీద ఆభరణాలు అయిష్టంగా ఇవ్వడం కాదు. ఆభరణాల మీద మనకు గల మక్కువను కానుకగా ఇవ్వడం. తలనీలాలూ అంతే. కేశ సంపద మీద గల ఇష్టాన్ని త్యజించడం. ‘నాకు నీకంటే ఏదీ ప్రియమైనది కాదు’ అని రుజువు చేసుకోవడం.

విశ్వాసం భక్తికి రుజువు. ప్రహ్లాదుడు దృఢమైన విశ్వాసంతో అన్ని అపాయాల్నీ దాటగలిగాడు. మనకు కలిగే కష్టాలన్నీ భక్తి పరీక్షలే అని గ్రహిస్తే బాధ ఉండదు. విశ్వసించిన మనిషి మోసం చేయవచ్చు. భగవంతుడెప్పుడూ అలా చెయ్యడు. అదృశ్యంగా మన పక్కనే కాచుకుని ఉంటాడు. కర్మ దోషాలు కొండమీద నుంచి మనల్ని లోయలోకి నెట్టేవరకు ఊరుకుంటాడు. మనం ఆయనే దిక్కని గట్టిగా నమ్మితే శ్రీహరి ప్రహ్లాదుణ్ని చేతులతో పట్టుకుని కాపాడినట్లు ఆఖరి క్షణంలోనైనా ఆదుకుంటాడు. ఘోర ప్రమాదాల నుంచి చిన్న దెబ్బకూడా తగలకుండా బయటపడటం కేవలం మనపట్ల దైవం చూపిన కరుణ తప్ప మన అదృష్టం కాదు.

భక్తిలో రెండు విధాలున్నాయని వేదాంతులు చెబుతారు. ఒకటి- జ్ఞాన భక్తి. పూజలు, వ్రతాలు, జపతపాలు వంటివి. రెండోది- మూఢ భక్తి. దీనికి భక్తకన్నప్పకన్నా గొప్ప ఉదాహరణ లేదు. నోటితో నీరు తెచ్చి, శివుడికి అభిషేకం చేశాడు. చెప్పు కాలుతో శివ నిర్మాల్యాన్ని పక్కకు నెట్టేశాడు. మాంసాన్ని నివేదన చేశాడు. శివుడు పెట్టిన పరీక్షకు బెదరక తన రెండు నేత్రాలను శివుడి నేత్రాలకు అమర్చాడు. దీన్నే భక్తికి పరాకాష్ఠ అంటారు. రావణుడు పేగులను పెకల్చి, రుద్రవీణతో చేసిన రుద్రగానం అమోఘ భక్తికి తార్కాణం.

ఈ భక్త గాథలు మనలో ఆత్మ చింతన కలిగించాలి. మనలో రావణుడు, ప్రహ్లాదుడు, ఆంజనేయుడితో పోల్చగల భక్తులుండే అవకాశం లేకపోవచ్చు. కాని, ఈ కథలు మనలో స్ఫూర్తిని, విశ్వాసాన్ని రగిలించాలి. అప్పుడు మన భక్తిస్థాయి క్రమంగా పెరుగుతుంది.

కాటూరు రవీంద్ర త్రివిక్రమ్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు