జీవితం అపురూప వరం

జీవితం అంటే అల్లకల్లోల సాగరం. ఒడ్డుకు చేరాలంటే సహనం, ఆత్మవిశ్వాసం కావాలి. సమయానుకూలంగా ప్రవర్తించే ఓర్పు, నేర్పు కావాలి. కొన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా అనుకున్నది సాధించలేకపోవచ్చు.

Published : 08 Jun 2023 01:18 IST

జీవితం అంటే అల్లకల్లోల సాగరం. ఒడ్డుకు చేరాలంటే సహనం, ఆత్మవిశ్వాసం కావాలి. సమయానుకూలంగా ప్రవర్తించే ఓర్పు, నేర్పు కావాలి. కొన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా అనుకున్నది సాధించలేకపోవచ్చు. ఆ ప్రయత్నాలన్నీ మనకు అనుభవాలుగా, రానున్న విజయానికి సోపానాలుగా ఉపకరిస్తాయి. ఈ సానుకూల ధోరణివల్ల మన ప్రయత్నాల్ని మరింత ఉత్సాహంతో కొనసాగించవచ్చు. ఎప్పుడైతే జీవితంలో నిరాశా నిస్పృహలు తొంగి చూస్తాయో, అప్పుడు దైవం మనకు తోడుగా ఉన్నాడనే భావన ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. దైవత్వ చింతన అనేది అపురూప శక్తి. ఆ శక్తిని సర్వదా మదిలో నిక్షిప్తం చేసుకోవడం ద్వారా మనకు మనం ఎప్పటికప్పుడు ఉత్తేజితులం కావచ్చు. లోపించిన శక్తిని, ఉత్సాహాన్ని తిరిగి పూరించుకోవచ్చు.ఆధ్యాత్మిక సాధన అనే దివ్యమైన ఔషధాన్ని నియమానుసారంగా క్రమశిక్షణాయుతంగా సేవిస్తే- శరీరానికి మనసుకు అనిర్వచనీయమైన బలిమి, కలిమి చేకూరతాయి.

ప్రసన్నత, ప్రశాంతత, భగవత్‌ ధ్యానం, సంయమనం, అంతఃకరణ శుద్ధి, స్పందించే హృదయం, మనో నిర్మలత్వం అనేవి వ్యక్తుల్ని పరిపూర్ణులుగా తీర్చిదిద్దుతాయి. అలాంటివారు దైవానికి ప్రియమైన వారవుతారు. ‘అహంకారం, బలగర్వం, దర్పం, కామం, క్రోధం... అనే పంచ దుర్గుణాలకు దాసులై, ఇతరుల్ని ఎల్లప్పుడూ నిందిస్తుండేవారు నా అనుగ్రహానికి పాత్రులు కాజాలరు’ అని భగవానుడే స్వయంగా భగవద్గీతలో పేర్కొన్నాడు. మనసు, వాక్కు, సుకర్మల ద్వారా తమ సహకారాత్మక వైఖరితో అందరికీ ఉపకార పరంపరల్ని నిర్వహించేవారిని ఉత్తములుగా, మహితాత్ములుగా భాగవతం ప్రకటించింది. మనిషి తన జీవన పర్యంతం మంచి పనుల్ని చేస్తూనే జీవించాలని వేదం అభిలషిస్తోంది. ఆ సత్కార్యం కూడా నిష్కామ భావంతో చేయాలని సూచించింది. ఫలితాన్ని ఆశించకుండా మంచి పనులు చేస్తూ, అవన్నీ భగవంతుడికి సమర్పించేవారిని కర్మవిరాగులుగా యజుర్వేదం కీర్తించింది.

జీవితం చాలా సూక్ష్మమైనది. రోజులు, నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు ఇట్టే గడిచిపోతాయి. జీవనగతి అంటే మరణం అనే గమ్యానికి చేరుకునే ప్రస్థానం కాదు. ప్రతిరోజూ సద్వినియోగం చేసుకునే అపురూప అవకాశం మన నిత్య జీవితంలో మన చేతల్లో మన చేతుల్లోనే ఉంటుంది. మానవ దేహానికి నవద్వార పంజరమని పేరు. ఈ నవ ద్వారాల ద్వారా ప్రాణమనే చిలుక ఎటైనా ఎగిరిపోవచ్చు. రాబోయే నిమిషం మనది అవునో కాదో తెలియని అనిశ్చితి పరిస్థితి! అందుకే జీవితాన్ని క్షణ భంగురం అంటారు. ఊహకందనిది, భవిష్యత్తును నిర్దేశించలేనిదే జీవితమని ఉపనిషత్తులు ప్రతిపాదించాయి. జీవితం ఎక్కుపెట్టిన బాణం లాంటిది! ఆ బాణాన్ని వృథాగా, వ్యర్థంగా పోనివ్వకూడదు. దానికంటూ ఓ లక్ష్యం ఉండాలి. గురిచూసి శరాన్ని సంధిస్తే లక్ష్యఛేదన సుసాధ్యమైనట్లుగా, జీవన సమరంలో ప్రతి ప్రయత్నానికీ అర్థవంతమైన గమ్యాన్ని నిర్దేశించుకోవాలి. మనిషిగా పుట్టినందుకు దైవ చింతన, మానవీయ విలువల ఆచరణలను ఎన్నడూ విస్మరించరాదని వివేక   చూడామణి ద్వారా ఆదిశంకరులు మనకు దిశానిర్దేశం చేశారు. ఆ దిశగా ముందుకు కొనసాగడమే మన కర్తవ్యం!

 కనకదండి వేణుగోపాలరావు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని