కళాజగత్తు

‘జీవితమే ఓ స్వప్నం’ అంటారు రమణ మహర్షి. మనిషి జీవితమే ఒక కల అయినప్పుడు నిద్రావస్థలోని కలలకు ప్రాధాన్యం ఇవ్వవలసిన అవసరం ఏమి ఉందని ప్రశ్నిస్తారాయన.

Published : 09 Jun 2023 00:18 IST

‘జీవితమే ఓ స్వప్నం’ అంటారు రమణ మహర్షి. మనిషి జీవితమే ఒక కల అయినప్పుడు నిద్రావస్థలోని కలలకు ప్రాధాన్యం ఇవ్వవలసిన అవసరం ఏమి ఉందని ప్రశ్నిస్తారాయన. స్వప్నాలు నిజజీవితాన్ని ప్రతిబింబించే నీడల్లాంటివని భావం. వాస్తవంకన్నా స్వప్నం గొప్పదంటాడొక తత్వవేత్త.

మానవుడి అంతరంగం నుంచి కలలు ఆవిర్భవిస్తాయని, కలలు కళాసృజనకు మూలమని కొందరు శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. అంతర జగత్‌, బాహ్య ప్రకృతుల సమ్మేళనమే కళ అని ఒక భావన. దైవానుగ్రహం వల్ల, పూర్వజన్మ వాసనా సంస్కారం వల్ల, అసమాన ప్రతిభ వల్ల మనిషి తాను చూసి ఆనందించిన ప్రకృతి సౌందర్యాన్ని తన సృజనాత్మక శక్తితో చిత్రించడం వల్ల కళలు ఆవిర్భవించాయి.

కళలు మానవ సంస్కృతికి ప్రతిబింబాలు. మానవుడు నిత్యజీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి విభిన్న వస్తువుల్ని అందంగా నిర్మించుకున్నాడు. నాగరికత వికసించాక జీవితానికి అవసరమైన పనిముట్లు తయారుచేసుకున్నాడు. మన ప్రాచీనులు అరవై నాలుగు కళలను పేర్కొన్నారు. కొన్ని కళల్ని ఉపయోగదృష్టితో, కొన్నింటిని సౌందర్య దృష్టితో సృష్టించుకున్నాడు మానవుడు. ప్రతిభానైపుణ్యాలకు ఆలవాలమైన వాటన్నింటికీ కళలనే సామాన్య నామం ఉంది. మానవుడి నిత్యావసరాలకు, శరీర సౌఖ్యానికి తోడ్పడేవి వ్యవహార కళలైతే- హృదయానికి ఆనందం కలిగించే వాటిని లలిత కళలుగా వ్యవహరిస్తున్నారు. చిత్రలేఖనం, శిల్పం, సంగీతం, నృత్యం, కవిత్వం అనే అయిదూ లలిత కళలుగా ప్రసిద్ధం. మనోహరత్వం, విశ్వజనీనత, అనుకరణం లలిత కళల ప్రధాన లక్షణాలు. ఈ కళలు తాత్కాలికమైన కళానందం లేదా రసానందం నుంచి శాశ్వతమైన బ్రహ్మా నందానికి దారి చూపుతాయి. మనిషిలో ఒక చైతన్యం పుట్టి హృదయం ద్రవిస్తుంది. మెదడు ప్రకంపనలు సృష్టిస్తుంది. అప్పుడది కళారూపంగా వెలుపలికి వస్తుంది.

చిత్రలేఖనం దృశ్యకళ. వంద మాటలు చెప్పే అర్థాన్ని ఒక్క చిత్రం చెప్పగలుగు తుంది. కనబడని సత్యాన్ని కనిపెంచేలా చేసేది చిత్రకళ అంటారు ప్రసిద్ధ చిత్రకళా విమర్శకులు ఆనంద కుమారస్వామి. చిత్రం ద్వారా లిపి పుట్టింది. లిపి భాషకు వాహకమైంది. సాహిత్యానికి భాషే మూలం. శిల్పం కూడా దృశ్యకళే. రాతిని బొమ్మగా చెక్కడం శిల్పం. భారతీయ దేవాలయాలు అద్భుతమైన శిల్పకళకు ఆవాసాలు. ధ్వని, లయ ప్రధానమై శ్రవణేంద్రియం ద్వారా మనసుకు ఆనందం కలిగించేది సంగీతం. సంగీతాన్ని విని శిశువులు పాములు కూడా ఆనందిస్తాయని ఆర్యోక్తి. సామవేదం సంగీతానికి మూలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు వేదాల్లో తాను సామవేదాన్ని అన్నాడు. నృత్యం దృశ్యకళ, అభినయ ప్రధానం. కవిత్వం పరిధి, వైశిష్ట్యం విస్తృతమైనవి. భాష, భావం రెండూ కవిత్వానికి ప్రధానాలు. కవిత్వానికి అనర్హమైన వస్తువు లోకంలో ఏదీలేదు. కవి దృశ్యాల్ని చదువరుల మనోఫలకాలపై సాక్షాత్కరింపజేయగలడు. కవిత్వం ఆలోచనామృతం. ఆనందాన్ని ఉపదేశాన్ని ఏకకాలంలో అందించగల సాహిత్య ప్రక్రియ. రసాస్వాదనకు కవిత్వం ఉపకరించేలా మరే కళా రూపం దోహదం చేయలేదని విజ్ఞుల అభిప్రాయం. కవిత్వం అక్షర రూపంలో శాశ్వతంగా నిలిచి ఉంటుంది. కావ్యరసాస్వాదుడైన సహృదయుడు పశుత్వం నుంచి దైవత్వానికి చేరుకోగలడని పండిత వాక్కు. సకల కళలు, సర్వ విద్యలు భగవన్ముఖమై, పరమార్థ సాధనాలై ఉండాలని భారతీయ భావన.

డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని