సమస్యలే సారథులు

జీవితంలో సమస్యలు మనకు కొత్తదారులు చూపిస్తాయి. యథార్థానికి దగ్గరగా తీసుకెళ్తాయి. పరిస్థితులవల్ల ఏర్పడే సంక్లిష్టతలవల్ల జిజ్ఞాస, జ్ఞానసముపార్జన పట్ల ఆతృత కలుగుతాయి. సమస్యలు మనిషిలో కారుణ్యాన్ని పెంచుతాయి. పరిణతికి నిచ్చెనలు వేస్తాయి.

Published : 10 Jun 2023 01:03 IST

జీవితంలో సమస్యలు మనకు కొత్తదారులు చూపిస్తాయి. యథార్థానికి దగ్గరగా తీసుకెళ్తాయి. పరిస్థితులవల్ల ఏర్పడే సంక్లిష్టతలవల్ల జిజ్ఞాస, జ్ఞానసముపార్జన పట్ల ఆతృత కలుగుతాయి.

సమస్యలు మనిషిలో కారుణ్యాన్ని పెంచుతాయి. పరిణతికి నిచ్చెనలు వేస్తాయి. నిగ్రహశక్తిని పెంచడంతోపాటు సున్నితత్వాన్ని కాపాడతాయి. చాలా సందర్భాల్లో ఏది ఎలా ఉన్నా, ఎప్పుడో ఒకప్పుడు అంతిమంగా మృత్యువు అందరినీ సమానం చేస్తుంది. మనిషికి మరణం అన్నదే లేకపోతే ఈ ప్రపంచమంతా అల్లకల్లోలమే. ఎక్కడ చూసినా దోపిడులు, తీవ్ర వేదనలు... చూడాల్సి వచ్చేది. మనిషి జీవితకాలం వందేళ్లంటేనే పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటున్నాయి. పేదరికాన్ని అనుభవించినప్పుడు, ఆ అనుభవాన్ని హృదయంతో చూడగలిగినప్పుడు ఆకలి బాధ ఎలాంటిదో అర్థమవుతుంది. సమస్యలు ఎదుర్కొన్నవారికే వాస్తవిక దృష్టితో చూడటం, పరిస్థితుల పట్ల సంపూర్ణమైన అవగాహన కలిగి ఉండటం కుదురుతాయి. మనసులోని కల్మషాన్ని తొలగించుకుని స్వచ్ఛతను నింపుకోవడం సాధ్యమవుతుంది.

మహాభారతంలో కుంతి శ్రీకృష్ణుణ్ని ఎక్కువ సమస్యలు కలిగించమని కోరుకుంటుంది. ఆ కారణంగా ఆయనను తరచూ తలచుకోగలనని ఆమె భావన. కష్టాలున్నప్పుడే, సమస్యలు ఎదురైనప్పుడే భగవంతుడు గుర్తొస్తాడు.

జీవితంలో ఏ సమస్యా లేకుండా వడ్డించిన విస్తరి అయితే- మనసు విశాలం కాదు, ఎదుగుదల ఉండదు. వాస్తవాలను గుర్తించే శక్తి సన్నగిల్లుతుంది. ఆలోచనా సామర్థ్యం పెరగదు. బుద్ధి వికసించదు. అటువంటప్పుడు జీవితకాలంలో అసలే మెదడులో బహుకొద్ది భాగాన్నే ఉపయోగించే పరిస్థితి నుంచి అది ఇంకా ఇంకా తగ్గిపోయి నిరుపయోగంగా వదిలేసిన వాళ్లమవుతాం.

రామకృష్ణ పరమహంసను ఒక భక్తుడు అడిగాడు- ‘మంచివారికి సమస్యలు తెచ్చిపెట్టే చెడ్డవారిని భగవంతుడు ఎందుకు సృష్టించాడు?’. దానికి ఆయన- ‘చెడు లేకపోతే మంచికి ప్రాముఖ్యం, విలువ ఎక్కడినుంచి వస్తాయి. చీకటి ఉండబట్టే వెలుగుకు అంత విలువ’ అన్నారు. ‘చెడ్డవారికి ఎటువంటి శిక్ష వేయాలి’ అని అడిగినప్పుడు- వారిని పట్టించుకోకూడదు. సురక్షితంగా ఉండగలిగే దూరంలో ఉంటూ, వారి గురించి చెడుగా అనుకోవద్దంటారు. సమస్యలు లేని మనుషులు ఏమైనా మెరుగ్గా ఉంటారా అంటే ఉండరు. ఆలోచనలు సవ్యంగా ఉండవు. మరొకరికి అపకారం తలపెట్టే దిశలో సాగుతుంటాయి. నిర్మాణాత్మకమైన శక్తి కన్నా, వినాశకరమైన శక్తికి ధాటి ఎక్కువ. ఎన్నో దశాబ్దాలపాటు శ్రమకోర్చి నిర్మించినదాన్ని కూల్చడం క్షణాల్లో పని.

ఒక పోరాటం చేస్తున్నామంటే, దాని కోసం వెచ్చించే శ్రమకు ఒక ఉన్నతమైన ఆశయం, దిశ, దీక్ష ఉండాలి. అప్పుడు మనసు ఏకాగ్రత సాధించి, కష్టతరమైన ఆ ప్రయాణానికి అవసరమైన శక్తిని పదింతలు చేస్తుంది. బురదలోంచే అందమైన కమలం ఉద్భవిస్తుంది. మండే ఎండే హాయినందించే వాన చినుకుకు కారణం. అంతరంగంలోని బాధే సంతోషాన్ని పూయిస్తుందని గుర్తుంచుకోవాలి.

మంత్రవాది మహేశ్వర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని