ధ్యానం అంటే?

ఒక విషయం తెలిసి ఉండటం జ్ఞానం, తెలియకపోవడం అజ్ఞానం. ఈ రెండింటికీ భిన్నమైంది, విలక్షణమైంది ధ్యానం. మనిషి చేసిన మొత్తం జీవన పయనంలో అత్యంత సున్నితం, సుకుమారం, సులభం, సరళం, సౌందర్యభరితం, సన్నిహితం, అత్యున్నతమైంది ఏదైనా ఉందంటే- అది ధ్యానం ఒక్కటే.

Published : 22 Sep 2023 00:11 IST

క విషయం తెలిసి ఉండటం జ్ఞానం, తెలియకపోవడం అజ్ఞానం. ఈ రెండింటికీ భిన్నమైంది, విలక్షణమైంది ధ్యానం. మనిషి చేసిన మొత్తం జీవన పయనంలో అత్యంత సున్నితం, సుకుమారం, సులభం, సరళం, సౌందర్యభరితం, సన్నిహితం, అత్యున్నతమైంది ఏదైనా ఉందంటే- అది ధ్యానం ఒక్కటే. అందువల్లే అది కఠినమై కూర్చుంది. నిరంతర సాధకులకూ అది దొరికినట్టే దొరికి జారిపోతూ ఉంది.

నడిజాము వేళ తలుపులు బార్లా తెరచి ఆ వెంటనే సూర్యడి కిరణాలు ఇంటిలోకి రమ్మంటే వస్తాయా? మొక్కలు నాటగానే పువ్వులు పూస్తాయా? కాగితం, కలాలు చేతుల్లోకి తీసుకోగానే కవిత్వం పుడుతుందా? ఇల్లు అలకగానే పండుగ అవుతుందా? దేనికైనా సమయం, సందర్భాలు రావాలి. అది ప్రాకృతిక ప్రామాణిక నియమావళి.

ధ్యాన సాధన మొదలుపెట్టిన రోజే విశ్వామిత్రుణ్ని అయిపోవాలి, గౌతమ బుద్ధుడిగా మారిపోవాలి, కీర్తిప్రతిష్ఠలు గొప్పగా పొందాలనే ఆరాటం ఆతృతలతో ఏ లాభమూ ఉండదు. పైగా ఆ ప్రక్రియలు ధ్యానమార్గాన్ని ఆటంకపరుస్తాయి. అలాగని, అజ్ఞానంతో కాలయాపనా చెయ్యరాదు.

చిట్టిరెక్కలతో ఆకాశంలో ఎగరడం నేర్చుకుని పెరిగి పెద్దదైన తరవాత ఒక పక్షి ఆకాశం అంటే పైన అగుపడుతున్న నీలితెర అనుకుంది. దాన్ని అందుకుందామని రెక్కలార్చుకుంటూ ప్రయాణం మొదలుపెట్టింది. ఆకాశం ఎంతకీ అందలేదు. ఆ పక్షి వెనక్కి తిరిగి చూసుకుంది. అప్పటివరకూ పైన మాత్రమే అగుపడే నీలితెర కిందా కనిపించింది. అసలు తాను ఎటువైపు పయనిస్తున్నానన్న ఆలోచనలో పడింది.

సముద్రంలో పుట్టి పెరిగిన ఒక చేప ఒకనాడు సాగరం అంటే ఎవరని తెలుసుకోవడానికి సముద్రమంతా కలియతిరిగింది. ముసలిదైపోయింది గానీ సముద్రాన్ని కలవలేకపోయింది. ఒకరోజు వేటగాడు వచ్చి వలవేసి ఆ చేపను బయటకు తీశాడు. అప్పుడు తెలిసింది చేపకు అసలు సముద్రం(నీటి యానకం) అంటే ఏమిటీ అని.

ఆకాశం అన్ని దిక్కులా(అంతటా) ఉంది. అది ప్రతి జీవిలోనూ ఉంది. నీరు అనేది సముద్రం అంతటా ఉంటుంది. సముద్రంలో పుట్టి పెరిగిన ప్రతి జీవిలోనూ ఉంటుంది.

వెలుగులో ఉన్నంతసేపూ వెలుగు అంటే ఏమిటో తెలియదు. అందుకే చీకటి వచ్చి వెలుగును పరిచయం చేస్తుంది. ఆరోగ్యంగా ఉన్నంతకాలం దాని విలువ తెలియదు. అనారోగ్యం బారిన పడగానే ఆరోగ్యం స్పృహలోకి వస్తుంది. ‘అద్వైతం’ (అంటే రెండుగా విభజించలేనిది) అవగాహనలోకి రావాలంటే ముందుగా ‘ద్వైతం’ అంటే ఏమిటో అర్థం కావాలి.

అనవసరమైన (వృథా) భాగం తొలగిస్తేనే అవసరమైన (విగ్రహం) భాగం బయటపడుతుంది. ‘ధ్యానం’ తెలియాలంటే ‘ధ్యానం కానిది’ ఏమిటో ఎవరికి వారే కనిపెట్టాలి.

ముక్కుమీద కళ్లజోడు పెట్టుకుని దాని కోసం ఇల్లంతా వెతక్కూడదు. చంకలో పిల్లవాణ్ని ఎత్తుకుని వాడి జాడ కోసం ఊరంతా తిరగకూడదు. అదే రీతిన మనిషి లోపల ధ్యానం పెట్టుకుని దాన్ని పట్టుకోవడానికి బయట అన్వేషించ కూడదు. అంటే, ఆలోచించకూడదని అర్థం. ‘ఆలోచించడం’ అంటేనే మనసు సంచరించడం. మనసు తిరిగేది ఎప్పటికైనా బయటే. ఈ భూమ్మీద మనిషి పుట్టకముందే ‘ధ్యానం’ ఉంది. మనిషి వచ్చాకా తనలో ఉంది. అతడు వెళ్ళిన తరవాతా ఉంటుంది. అందుచేత తనలోనే దాగి ఉన్న దానిపట్ల ఎరుక వహించకుండా దాని గురించి ఆలోచించడం అంటే ‘ధ్యానం’ వద్దని దాన్ని అవతలకు నెట్టి వేయడమే అవుతుంది.

అనేకానేక ఆలోచనలచేత ధ్యానం కప్పి ఉంది. అందుచేత, ఆలోచనే ఆలోచనల్ని అర్థం చేసుకున్నప్పుడు ఆలోచనల సమాహారమంతా ఆగిపోతుంది. అప్పుడు ‘ధ్యానం’ బయటపడి అనుభవంలోకి వస్తుంది.

మునిమడుగుల రాజారావు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు