ఆధ్యాత్మిక ఆవశ్యకత

సంపదలు ఎన్ని ఉన్నా, పదవులు ఎన్ని వరించినా అవి మనిషి మానసిక అశాంతిని తొలగించలేవు. మనోవ్యాధిని పోగొట్టలేవు. ఆత్మజ్ఞానం ఒక్కటే దీనికి పరమావధి అని గీతాచార్యుడు సెలవిచ్చాడు.

Published : 19 Nov 2023 00:56 IST

సంపదలు ఎన్ని ఉన్నా, పదవులు ఎన్ని వరించినా అవి మనిషి మానసిక అశాంతిని తొలగించలేవు. మనోవ్యాధిని పోగొట్టలేవు. ఆత్మజ్ఞానం ఒక్కటే దీనికి పరమావధి అని గీతాచార్యుడు సెలవిచ్చాడు. ప్రతివారూ ప్రాపంచిక సౌఖ్యాలు, పదవులు, భోగాలు సంపాదించడం కోసం అతిగా తాపత్రయ పడకూడదు. వాటి కోసం వెంపర్లాడటం అవివేకం. బుద్బుద ప్రాయమైన ఈ జీవితాన్ని అకృత్యాలకు అంకితం చేయడం తగదు. ఆత్మజ్ఞానం పొందే ప్రయత్నం చేయాలి. అందుకోసం దైవాన్ని ఆశ్రయించాలి. భక్తిభావం పెంపొందించుకోవాలి. అయితే, ఆ భక్తి మొక్కుబడి కాకూడదు. జీవితంతో అనుసంధానమై ఉండాలి. దైవచింతన మహత్తరమైనది. అంతర్యామిని స్మరించడం, పూజించడం, ఉత్సవాలు చేయడం... అన్నీ ఆధ్యాత్మిక సంబంధిత అద్భుతాలే. అలాగని మన ఆధ్యాత్మిక చింతన అక్కడి వరకే పరిమితం కాకూడదు. త్రికరణశుద్ధిగా భగవంతుడి అభీష్టానికి అనుగుణంగా నడుచుకోవాలి. అంతేకాక, ఉన్నతమైన జీవితాన్ని గడపడం పూజా పునస్కారాల ఉద్దేశం. ధార్మిక చింతన లేకుండా పూజలు చేయడం వ్యర్థం. దీనికి హృదయ సంస్కారం ఉండాలి. కేవలం దేవాలయాలకు వెళ్ళడం, పూజలు చేయడంతో సరి పోదు. భక్తి చింతనను ఇహలోక వ్యవహారాల్లోనూ కనబరచాలి. కరుణరస భావన తొణికిసలాడాలి. ఎదుటివారికి బాధ కలిగించరాదనే ఎరుక కలిగి ఉండాలి. స్వామి వివేకానంద ‘నువ్వు దేవుణ్ని దర్శించాలంటే మానవ సేవ చెయ్యి. దేవుణ్ని చేరుకోవాలంటే కోట్లమంది దరిద్ర నారాయణులకు సేవ చెయ్యి’ అన్నారు.

ఆధ్యాత్మికం అంటే స్వభావం. అంటే, తన భావం అని అర్థం. మరోలా చెప్పాలంటే, ప్రత్యగాత్మ రూపమే ఆధ్యాత్మికం. సాధారణంగా ప్రజలు అజ్ఞానం వల్ల తాము దేహమని, మనసు అని భావిస్తుంటారు. అది వారి స్వరూపమని, స్వభావమని అనుకుంటారు. అది పొరపాటు. జీవుని వాస్తవ స్వభావం ఆధ్యాత్మికం. అంటే ప్రత్యగాత్మ భావనే కానీ దేహాదులు కాదు. తానే దేహమని, మనస్సని, ప్రాపంచిక వస్తువని అనుకోవడం వల్ల ఎవరికీ శాంతి సుఖాలుండవు. ఎందుకంటే, అవి నశించేవి.

నశించే పదార్థాన్ని ఆధిభూతం అంటారు. విరాట్పురుషుడు లేదా హిరణ్య గర్భుడిని ఆధిదైవికం అంటారు. మనిషి తన జీవన యాత్రలో మూడు విధాలైన ధర్మాలు నిర్వర్తించాలి. అవి- ఆధిభౌతిక, ఆధిదైవిక, ఆధ్యాత్మిక ధర్మాలు. ఆధిభౌతికం లౌకికమైనది. ఆధిదైవికం దేహాన్ని అనుక్షణం పాలించే అధిదేవతలను తృప్తిపరచేది. ఇక ఆధ్యాత్మికం బాహ్య జీవితం కన్నా భిన్నమైన ఆత్మను ఉన్నత స్థితికి చేర్చగలిగే జ్ఞానాన్ని కల్పించడం.

ఆధ్యాత్మికత శరీరానికి ఒక మాధ్యమం లేదా సాధనం. ఇది మానవుడి అంతరంగ శుచిత్వానికి, పవిత్రతకు ప్రాముఖ్యాన్నిస్తుంది. ఆచార వ్యవహారాల నిర్వహణలో బాహ్య ఆంతరంగిక శుచిత్వం, శ్రద్ధాసక్తులు, నైతిక సత్ప్రవర్తన, నియమాలు, నిర్మలత్వానికి ఆధ్యాత్మికత ప్రాధాన్యమిస్తుంది.

ప్రపంచంలో ఎన్ని విద్యలున్నా, ఆధ్యాత్మిక విద్యే తానని గీతాచార్యుడు చెప్పాడు. ఏ విద్య వల్ల మనిషికి జన్మరాహిత్యం, ఆనంద ప్రాప్తి కలుగుతాయో, పరమ శాంతి చేకూరుతుందో అదే అన్నింటికన్నా గొప్పది. అటువంటి విద్యే బ్రహ్మవిద్య. ఆధ్యాత్మిక విద్యను చేపట్టి జనన మరణ భయాదులతో నిండిన సంసార బంధం నుంచి విముక్తి కావాలి. సదా భగవంతుణ్ని స్మరిస్తూ, సేవిస్తూ ఉండాలి. దైనందిన జీవితంలో ఆధ్యాత్మిక చింతన విడదీయరాని భావం కావాలి. సూర్య నమస్కారాలు, యోగాసనాలు లాంటివి ఆధ్యాత్మికతకు ఉపకరించేవే. వ్యాయామం, ఆహారవిహారాదులన్నీ మన శరీర రక్షణ, పోషణలకు ఉపయోగపడేవే. వాటితో పాటు ఆధ్యాత్మిక ప్రగతికీ అవి తోడ్పడతాయి.

వి.ఎస్‌.ఆర్‌.మౌళి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని