నిరంతర స్రవంతి

మానవ సంబంధాల పట్టాల మీదనే మనిషి జీవితం ముందుకు సాగుతుంది. సాటి మనిషితో సఖ్యంగా ఉండాలి. బంధాలను ఏర్పరచుకోవాలి. మనిషితో మనిషి ఏర్పరచుకునే ఆత్మీయతానుబంధాలే- బలం,  బలగం. ఏ వ్యక్తీ చెడ్డగానో, మంచిగానో పుట్టడు. పెరిగిన వాతావరణం, కుటుంబ నేపథ్యాలు మనిషి వ్యక్తిత్వంపై ప్రభావం చూపుతాయి. ప్రతి వ్యక్తిలోనూ బొమ్మబొరుసులుగా మంచిచెడులు ఉంటాయి.  వ్యక్తి ప్రవర్తన పరిస్థితులకు తగ్గట్లు మారవచ్చు...

Published : 21 Nov 2023 00:57 IST
మానవ సంబంధాల పట్టాల మీదనే మనిషి జీవితం ముందుకు సాగుతుంది. సాటి మనిషితో సఖ్యంగా ఉండాలి. బంధాలను ఏర్పరచుకోవాలి. మనిషితో మనిషి ఏర్పరచుకునే ఆత్మీయతానుబంధాలే- బలం,  బలగం.
ఏ వ్యక్తీ చెడ్డగానో, మంచిగానో పుట్టడు. పెరిగిన వాతావరణం, కుటుంబ నేపథ్యాలు మనిషి వ్యక్తిత్వంపై ప్రభావం చూపుతాయి. ప్రతి వ్యక్తిలోనూ బొమ్మబొరుసులుగా మంచిచెడులు ఉంటాయి.  వ్యక్తి ప్రవర్తన పరిస్థితులకు తగ్గట్లు మారవచ్చు. కానీ, వ్యక్తిత్వం మాత్రం క్షణక్షణానికి మారకూడదు. అలా మారితే అది వ్యక్తిత్వం కాదు... స్వార్థం అవుతుంది.
ఓ రోజు గౌతమ బుద్ధుడు ధ్యానం ముగించుకుని కళ్లు తెరిచాడు. ఒక రాజు ఆయన ముందు మోకరిల్లి  ‘మహానుభావా! మీ వదనంలో నిరంతర ప్రశాంతతను గమనిస్తున్నాను. అది ఎలా సాధ్యపడుతోంది మీకు?’ అని ప్రశ్నించాడు.
దానికి బుద్ధుడు ‘రాజా! నేనూ నీలాంటి మానవుడినే. నా ప్రశాంతతకు కారణం  జీవనతత్వం. నాలో ఉన్న ప్రేమ కారణరహితమైనది. ఎలాంటి బంధా లకు బంధనాలకు కట్టుబడనిది. స్వ పర భేదాలు లేకుండా సృష్టిలో సకల ప్రాణులను సమానంగా ప్రేమిస్తాను. కారణరహిత ప్రేమనే పంచుతాను. ఇదే నా ప్రశాంతతకు కారణమని అనుకుంటున్నాను’ అన్నాడు. జీవించి ఉన్నప్పుడే సాటి మనుషులతో సత్సంబంధాల్ని ఏర్పరచుకోవాలి. అలా ఏర్పరచుకోగలిగినవారే కాలా తీతంగా కారణరహిత ప్రేమను పంచగలుగుతారు.
పెద్దలు అందించిన మానవ సంబంధాలను రాబోయే తరాలకు అందించడంలో మనం చిన్న పాత్రనైనా పోషించాలి. మన దగ్గర ఉన్నదాన్ని ఇతరులకు పంచాలి. మన వద్ద లేనిదాన్ని ఇతరుల నుంచి పొందాలి. ఈ రెంటినీ సమతులం చేసుకోగలిగిన వారు ఎటువంటి  బంధంలోనైనా ఇమిడిపోగలరు.
దీన్నే స్వామి వివేకానంద సామాజిక జ్ఞానం అన్నారు. మహిమాన్వితమైన మానవ సంబంధాలు ఎంతో సున్నితంగా ఉంటాయి. సన్నజాజి పూలు కోస్తున్నప్పుడు కొమ్మలు విరిగిపోయినట్టు మానవ సంబంధాలూ అంతే సున్నితాలు మరి.
మానవ సంబంధాలు మసకబారిపోతున్న కలుషిత వాతావరణంలో నేటితరం బతుకుతోంది. స్వార్థంతో కూడుకున్న నేను అన్నింటా ముందుంటోంది. కుటుంబ సభ్యులూ మనసులు విప్పి మాట్లాడుకోలేని పరిస్థితులు కల్పిస్తున్నాయి నేడు సామాజిక మాధ్యమాలు. మనిషికి తోడు మనిషే. యంత్రాలు కావు. ఈ వాస్తవాన్ని రేపటి తరానికి తెలియజెప్పాల్సిన బాధ్యత ఈతరంవారిదే.
ఇంటి తరవాత మనిషి వ్యక్తిత్వం రూపుదిద్దుకొనే దేవాలయం విద్యాలయమే. అక్కడ స్నేహం దొరుకుతుంది. శిక్షణ, క్రమశిక్షణ, తప్పొప్పుల విశ్లేషణ, చదువు, సంస్కారం, మనోవికాసం కలుగుతాయి. మానవ సంబంధాలకు గట్టి పునాది ఏర్పడుతుంది. గురుశిష్య బంధం అంతర్జాలంలో దొరికే మాయాజాలం కాదు. ఆ బంధాన్ని ప్రత్యక్షంగా ద్రోణుడు అర్జునుడిలా అనుభూతి పొందాల్సిందే.
మానవ సంబంధాలు పటిష్ఠంగా ఉన్న సమాజంలోనే ఐక్యత వర్ధిల్లుతుంది. అప్పుడే భావోద్వేగాలు, ఆత్మీయతలు, విలువలు, ఆధ్యాత్మికత సమపాళ్లలో ఉండే మానవ సంబంధాలు నిరంతర స్రవంతిలా తరానికి తరానికి మధ్య వారధిలా కొనసాగుతాయి.
ఎం.వెంకటేశ్వర రావు
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని