ధర్మమే సర్వం

‘ధర్మం పాటించండి’ అనే మాట సాధారణంగా వినిపిస్తుంది. రెండక్షరాల ఈ పదం వెనక చాలా పెద్దభావం ఉంది. లోతైన వివరణ ఉంది. చేయదగినపని, లక్షణం, స్వభావం, పద్ధతి, తగినది, దానగుణం అనే వివిధ అర్థాల్లో ఈ పదాన్ని వాడతారు. సమాజంలో ప్రతివారికీ ఏదో ఒక చేయదగిన పని ఉంటుంది.

Published : 27 Apr 2024 00:48 IST

‘ధర్మం పాటించండి’ అనే మాట సాధారణంగా వినిపిస్తుంది. రెండక్షరాల ఈ పదం వెనక చాలా పెద్దభావం ఉంది. లోతైన వివరణ ఉంది. చేయదగినపని, లక్షణం, స్వభావం, పద్ధతి, తగినది, దానగుణం అనే వివిధ అర్థాల్లో ఈ పదాన్ని వాడతారు.

సమాజంలో ప్రతివారికీ ఏదో ఒక చేయదగిన పని ఉంటుంది. విద్యార్థి, ఉపాధ్యాయుడు, ఉద్యోగి, పౌరుడు, సేవకుడు, మిత్రుడు, భర్త, భార్య, రాజు, సన్యాసి... ఇలా ఈ లోకంలో ప్రతి ఒక్కరికీ ఆచరించవలసిన పనులుంటాయి. వాటిని సక్రమంగా చేయడాన్ని ధర్మం అంటారు. కారంగా ఉండటం మిరపకాయకు, తియ్యగా ఉండటం చెరకుకు సహజ లక్షణం. దాన్ని కోల్పోతే వాటికి విలువ ఉండదు. కాబట్టి అవి ఎప్పుడూ ఆ ధర్మాలనే కలిగి ఉండాలి.

స్వభావం అనే విషయానికి ఒక ఉదాహరణగా ఈ కథ చెబుతారు. నీటిలో కొట్టుకుపోతున్న తేలును రక్షించే ప్రయత్నం చేస్తున్నాడో సాధువు. ఆ ప్రయత్నంలో ప్రతిసారీ అది కుడుతూనే ఉంది. అది చూసిన ఒకాయన ‘పదేపదే కాటేస్తున్నా ఇంకా దాన్నెందుకు రక్షించే ప్రయత్నం చేస్తున్నావు’ అని అడిగాడు. ‘కుట్టడం దాని ధర్మం. ఆపదలో ఉన్నవాటిని రక్షించడం మానవ ధర్మం. ప్రాణాపాయ స్థితిలోనూ అది తన ధర్మాన్ని వీడనప్పుడు నా ధర్మాన్ని నేనెందుకు వీడాలి?’ అని సాధువు తిరిగి ప్రశ్నించాడు. అలా ఉంటుంది స్వభావ ధర్మం.

వేసవిలో ఎండ కాయడం, వర్షాకాలంలో వానలు కురవడం... ప్రకృతి ధర్మం. క్రమశిక్షణతో మెలగడం మానవులకు... ఇలాంటి వాటిని పద్ధతి అనే అర్థంలో వాడతారు. అవి గతి తప్పితే కలిగేవి అనర్థాలే. ఎదురుగా ఆకలితో ఉన్న వ్యక్తి కనబడితే మొదట అతడి ఆకలి తీర్చిన తరవాతనే తన ఆకలిని తీర్చుకునే ప్రయత్నం చెయ్యాలి. అది సక్రమంగా నిర్వహించడమే తగిన పని. ఇలా తగిన పనినీ ధర్మంగా చెబుతారు. రంతిదేవుడు ఆచరించిన ధర్మం అదే.

వీటన్నింటినీ మించినది దానగుణం. లేమిలో ఉన్నవాళ్లకు చేసే సాయం ఒక్కటే దానంగా భావిస్తారు చాలామంది. అది సరైనదే. అవసరమైనవారి అవసరాలను తీర్చగలగడం కూడా దానగుణం కిందకే వస్తుంది. ఇక్కడ పేదరికం ప్రసక్తి ఉండదు. విద్యార్థికి విద్య అందించడం, అవసరాలను తీర్చడం, అనారోగ్యంతో బాధపడేవారికి అవసరమైతే అవయవాదులను ఇవ్వడం లాంటివి కూడా దానమే. ఇలా చేసే దానగుణాన్నీ ధర్మమనే అంటారు. హృదయ నిర్మలత్వం, సత్యం, శాంతి, దయ, అహింస, ఉపకారం, సానుభూతి మొదలైన గుణాలు ధర్మానికి అవయవాలుగా పండితులు చెబుతారు.

పురుషార్థాలు నాలుగు. అవి ధర్మ, అర్థ, కామ, మోక్షాలనేవి. వీటిలో మొదటి స్థానం ధర్మానికి కేటాయించారు. దీన్ని బట్టి ధర్మానికి ఎంతటి ప్రాధాన్యం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలా చెప్పడంలో ఆంతర్యం- మిగిలిన మూడూ సాధించాలంటే మొదట ధర్మాన్నే ఆచరించాలి, అది తప్పనిసరి అని. ఎవరైతే తమ ధర్మాన్ని తప్పకుండా పాటిస్తారో వారు ఇహలోకంలోను, పరలోకంలోనూ సుఖశాంతులతో జీవిస్తారని శాస్త్రాలు, పురాణాలు చెబుతున్నాయి.

ఏవో కారణాల వల్ల అధర్మం తాత్కాలికంగా పైస్థాయిలో ఉన్నా- చివరకు గెలిచేది ధర్మమేనని అనేక సంఘటనలు నిరూపిస్తున్నాయి. కౌరవులు అధర్మవర్తనులై తాత్కాలికంగా విజయం పొందారు. కానీ పాండవులు ధర్మానికి కట్టుబడి ఉండటం వల్ల కురుక్షేత్రంలో విజయాన్ని సాధించారు. రాముడు, కృష్ణుడు లాంటివారు అనుసరించినది ధర్మమార్గం.

ఎవరి ధర్మాన్ని వారు ఆచరించకపోతే, ప్రకృతి ధర్మాలు గతి తప్పుతాయి. అప్పుడు సమస్యలు, అరాచకాలు ప్రబలుతాయి. వైపరీత్యాలు కలుగుతాయి. అలాంటి సమయంలో ధర్మాన్ని నిలబెట్టడం కోసం తాను అవతారాలు ఎత్తుతానని గీతలో శ్రీకృష్ణుడు స్వయంగా వెల్లడించాడు.

కె.వి.ఎస్‌.ఎస్‌.శారద

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని