మోక్షదాయక నగరాలు

గరుడ పురాణ కథనం ప్రకారం మోక్షాన్నిచ్చే నగరాలు ఏడు. అవి- అయోధ్య, మధుర, హరిద్వార్, కాశీ, కంచి, అవంతికా, ద్వారక. ఇవి మోక్షదాయకాలని పురాణాలు చెబుతున్నాయి. అయోధ్య కోసలరాజ్యానికి రాజధాని. సాకేతపురమనీ పిలుస్తారు. భారతదేశంలోని అతిపురాతన నగరాల్లో ఒకటి.

Published : 27 May 2024 00:28 IST

రుడ పురాణ కథనం ప్రకారం మోక్షాన్నిచ్చే నగరాలు ఏడు. అవి- అయోధ్య, మధుర, హరిద్వార్, కాశీ, కంచి, అవంతికా, ద్వారక. ఇవి మోక్షదాయకాలని పురాణాలు చెబుతున్నాయి.

అయోధ్య కోసలరాజ్యానికి రాజధాని. సాకేతపురమనీ పిలుస్తారు. భారతదేశంలోని అతిపురాతన నగరాల్లో ఒకటి. దశావతారాల్లో ఒకటైన శ్రీరామచంద్రుడు పుట్టి పెరిగిన ప్రాంతం. అధర్వణ వేదం దీన్ని విష్ణువు నిర్మించిన నగరంగా చెబుతోంది.

ద్వాపరయుగం నుంచి పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది మధుర. ఇది శ్రీకృష్ణుడి జన్మస్థానం. బాల్యంలో కృష్ణుడు గోపికలతో గడిపిన స్థలం. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఇక్కడ చాలా వైభవంగా జరుపుతారు.

ఉత్తరాఖండ్‌లో ఉన్న హరిద్వార్‌కు పురాణాల్లో మాయా నగరమని పేరు. గరుడుడు అమృతం తీసుకెళుతున్నపుడు ఇక్కడ ఒక చుక్క పడిందని, అందుకే ఈ క్షేత్రం పవిత్రతను సంతరించుకుందని అంటారు. ఇక్కడ పన్నెండు సంవత్సరాలకొకసారి కుంభమేళా జరుగుతుంది.

వరుణ, అసి అనే రెండు ఘాట్ల మధ్య ఉన్నందువల్ల ‘వారణాసి’ అనే పేరు వచ్చింది. పాళీభాషలో దీన్ని భారణాసిగా రాసేవారు. అందువల్ల బనారస్‌ గా మారింది. విశ్వేశ్వరుడు కొలువైన, పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటైన వారణాసిలో చనిపోయినా, అంత్యక్రియలు జరిగినా నేరుగా స్వర్గానికి చేరుకుంటారని భక్తుల నమ్మకం.

కంచి, కాంచీపురం, కాంచి సమానార్థక నామాలు. పూర్వం కాంజీవరం, కాంచీపట్టణం అనీ పిలిచేవారు. తమిళనాడులోని ఈ పట్టణం దేవాలయాలకు ప్రసిద్ధి. వైష్ణవ, శైవాలయాలతో పాటు అష్టాదశ పీఠాల్లో ఒకటైన కామాక్షీ ఆలయం ఇక్కడ ఎంతో ప్రాశస్త్యం పొందింది. ప్రముఖ వైష్ణవ ధామం వరదరాజస్వామి ఆలయం, శివుని ఆలయమైన ఏకాంబరేశ్వరస్వామి గుడి, శక్తి క్షేత్రం కామాక్షిదేవి ఆలయం, కుమారకొట్టం, కచ్ఛపేశ్వర దేవాలయం, కైలాసనాథ ఆలయం వంటి దివ్య క్షేత్రాలు కంచిలో ఉన్నాయి.

మధ్యప్రదేశ్‌లో క్షిప్రా నదీతీరంలో వెలసిన పుణ్యక్షేత్రం ఉజ్జయిని. శైవ, వైష్ణవులకు సైతం అత్యంత పవిత్రమైన నగరం. దీనికే అవంతీనగరమనీ పేరు. మహాకాళేశ్వర, కాలభైరవ, చింతామణిగణేశ్, గోషా మందిరంలో నిత్యం భక్తుల సందడి ఉంటుంది. ఇక్కడి మహాకాళేశ్వర దేవాలయం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి.

శ్రీకృష్ణుడు, బలరాముడు, కుచేలుడు సాందీపని వద్ద చదువుకున్న నగరం ఉజ్జయిని అని భాగవతం వల్ల తెలుస్తోంది. సాందీపని ఆశ్రమం ఈ నగరంలో క్షిప్రా నది ఒడ్డున ఉంది. చరిత్ర ప్రసిద్ధి పొందిన విక్రమాదిత్య మహారాజు ఉజ్జయినీ నగరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. ఇతని సోదరుడు ‘భట్టి’ మంత్రిగా, మరొక సోదరుడు భర్తృహరి మహా పండితుడిగా, కాళిదాసాది మహాకవులు అతడి ఆస్థాన నవరత్నాలుగా చరిత్ర ప్రసిద్ధులు.

సంస్కృతంలో ద్వార అంటే ప్రవేశం అని, కా అంటే పరబ్రహ్మ సన్నిధి అని అర్థం. ద్వారక అంటే మోక్షానికి ప్రవేశ ద్వారమని భావం. పురాణ కాలం నుంచి ప్రసిద్ధి చెందిన నగరమిది. శ్రీకృష్ణుడు మధురను విడిచి దాదాపు వందేళ్లు నివశించిన ప్రాంతం. ఈ క్షేత్రంలో ద్వారకా(ధీష్‌)దీ దేవాలయం, రుక్మిణి దేవాలయం, ఎన్నో ధార్మిక క్షేత్రాలున్నాయి. ఆది శంకరాచార్యులు స్థాపించిన నాలుగు పీఠాల్లో ఒకటైన శారదా పీఠం ఇక్కడే ఉంది.

భారతదేశంలో పుట్టినవారు కన్నుమూసేలోగా తప్పనిసరిగా ఈ ఏడు ఆలయాలను దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని పెద్దలు చెబుతారు.

అయ్యగారి శ్రీనివాసరావు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని