విన్నపాలు వినవలె...

లోక వ్యవహారంలో ప్రజలు వ్యక్తిగతంగా గాని సామూహికంగా గాని మంత్రులకో ఉన్నతాధికారులకో తమ కోరికలు సమస్యలు మనవి చేసుకోవడం చూస్తుంటాం. వాటిని విజ్ఞప్తులని విజ్ఞాపనలని వినతులని వ్యవహరిస్తారు. పైవారు కిందివారికి ఇచ్చేవి ఆదేశాలు ఆజ్ఞలు. ఈ వినతులకు ఆధ్యాత్మిక భక్తి వాఙ్మయంలో విశిష్ట స్థానం ఉంది. భక్తుడు భగవంతుడికి తన కష్టాలు విన్నవించుకొని మొరపెట్టుకోవడాన్ని కవులు వర్ణించారు.

Published : 28 May 2024 01:01 IST

లోక వ్యవహారంలో ప్రజలు వ్యక్తిగతంగా గాని సామూహికంగా గాని మంత్రులకో ఉన్నతాధికారులకో తమ కోరికలు సమస్యలు మనవి చేసుకోవడం చూస్తుంటాం. వాటిని విజ్ఞప్తులని విజ్ఞాపనలని వినతులని వ్యవహరిస్తారు. పైవారు కిందివారికి ఇచ్చేవి ఆదేశాలు ఆజ్ఞలు. ఈ వినతులకు ఆధ్యాత్మిక భక్తి వాఙ్మయంలో విశిష్ట స్థానం ఉంది. భక్తుడు భగవంతుడికి తన కష్టాలు విన్నవించుకొని మొరపెట్టుకోవడాన్ని కవులు వర్ణించారు. ఈ కవితా ప్రక్రియను విన్నపాలు అని వ్యవహరిస్తారు.

శరణాగత ధర్మం విన్నపంతో ఆరంభమవుతుంది. భగవంతుడి శరణు కోరిన భక్తుడు సేవకుడే. సేవకులకు స్వామి పాదాలే శరణ్యం. వైష్ణవ సంప్రదాయంలో ప్రధానంగా విశిష్టాద్వైతంలో విన్నపాలకు చాలా ప్రాముఖ్యం ఉంది. కవులు కావ్యారంభంలో ఇష్టదేవతా ప్రార్థనలో దైవానికి తమ విజ్ఞాపనల్ని అందజేస్తారు. కవులుగా తమకు కీర్తిని ప్రసాదించమని వేడుకునేవారు. తమ కావ్యాలను రాజులకు అంకితం చేసే సందర్భంలోనూ ఆ రాజు విజయం కోసం దేవుణ్ని ప్రార్థించేవారు. ఇవి కూడా ఒక విధంగా విన్నపాలే. భక్తుడు భగవంతుడితో మాట్లాడటమే ఈ విన్నపం. తనను కాపాడమని భక్తుడు వేడుకోవడంలో ఆర్తి ఉంటుంది. అదే వేదన. ఆ వేదనలోంచే విన్నపం పుడుతుంది.

భక్తిసాహిత్యానికి సంబంధించిన వచనాల్లో పదాల్లో కోరికల్ని విన్నవించే ధోరణి కనిపిస్తుంది. సింహగిరి నరహరి వచనాలు, శ్రీవేంకటేశ్వర వచనాలు మొదలైనవాటిని ఈ పద్ధతికి దృష్టాంతాలుగా భావించవచ్చు. స్వామి ఆరాధనలో అర్చనలో తాను  దాసుణ్నని దాసానుదాసుణ్నని భక్తుడు చెప్పుకోవడం ఉంది. శైవ సాహిత్యంలోనూ ఈ లక్షణం కనిపిస్తుంది. కన్నడంలోని బసవేశ్వర వచనాలు, తెలుగులో పాల్కురికి సోమన ‘గద్య’ల్లోనూ విన్నపాలున్నాయి. విన్నపాల్లో ప్రకృతి తత్వం, పరతత్వం, బంధమోక్షం, మోక్షోపాయం అనే అంశాలు సాధనాలు గోచరిస్తాయి.

విన్నపాలు అనగానే ప్రధానంగా అన్నమయ్య గుర్తుకువస్తాడు. ఆయన విన్నపాలు పలువిధాలుగా ఉంటాయి. శ్రీనివాసుడితో  తన గోడు చెప్పుకొంటాడు. తన ఆంతర్యాన్ని వెళ్ళబోసుకుంటాడు. స్వామి మహిమల్ని క్షేత్ర ప్రశస్తిని ఉత్సవ విశేషాలను సామాన్య జనానికి ఆకర్షణీయంగా చెబుతూ శ్రీనివాసుణ్ని దర్శించుకొమ్మంటాడు. తత్వోపదేశం చేస్తూ మనుషులు జాగ్రత్తగా మసలుకోవాలని ప్రేమతో విన్నవిస్తాడు. ఇతర అర్చామూర్తుల్నీ వర్ణిస్తాడు.

అన్నమయ్య భక్తుడికీ భగవంతుడికీ తారతమ్యాన్ని తనపరంగా అన్వయించుకొని చెబుతూ తాను పలు చెడు గుణాలకు ఆలవాలమైనవాడినని పరమాత్మ గుణరత్నాలకు సముద్రం వంటివాడని అన్ని విధాల తనకన్నా హీనులు, శ్రీనివాసుడికన్నా ఘనులు లేరని అంటాడు. గడ్డిపోచనూ మేరువుగా చేయగల సమర్థుడు స్వామి అయితే తాను సామాన్య సేవకుణ్నని  ఏకాకినని, సర్వాన్ని భక్షించడం తన గుణమైతే సర్వాన్నీ రక్షించేవాడు వేంకటరమణుడని చెప్పుకొంటాడు. చదువులు సంపదలు ఉపవాసాలు దేశాటనం... ఇవేవీ ముక్తికి కారణం కాదని ఇహలోకమే పరలోకమనే భ్రమ తొలగడం లేదని తన తెలివితేటలు ముక్తికి సాధనం కావని గ్రహించానని తనను కాపాడమని విన్నవించుకున్నాడు. 

క్షేత్రయ్య పదాల్లో శృంగారమే ప్రధానంగా గోచరిస్తున్నా అడుగడుగునా విన్నపాలు దర్శనమిస్తాయి. విజ్ఞాపన పదకర్త అన్నారాయనను. భక్తరామదాసు ‘మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ’ అంటూ రామయ్యకు అతడి పత్ని ద్వారా  తన మనసులో మాటను చేరవేశాడు. ఆళ్వారులూ తమ విన్నపాలను పాశురాల్లో బంధించారు. ఈ విధంగా విన్నపాలు పండిత పామర జనరంజకమై విశేష ఖ్యాతిని పొందాయి.

డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని